Odisha Train Tragedy: బోగీలు గాల్లోకి లేచి.. ఒకదానిపై మరొకటి దూసుకెళ్లి..!

Odisha Train Tragedy: వేగంగా వెళ్తున్న రైళ్లు ఢీ కొనడంతో బోగీలు, పట్టాలు ధ్వంసమయ్యాయి. బోగీల కింద ప్రయాణికులు నలిగిపోయారు. 

Updated : 03 Jun 2023 12:24 IST

బాలేశ్వర్‌: శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంతో ఒడిశా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కోరమాండల్‌ ప్రయాణించే నాలుగు రాష్ట్రాలూ తీవ్ర అలజడికి గురయ్యాయి. ప్రమాదం జరిగిన తీరు, అక్కడి దృశ్యాలు కలవరపెడుతున్నాయి. ఒకరైలు బోగీపై మరొకటి వెళ్లిపోవడం, సహాయక సిబ్బంది మృతదేహాలన్నింటిని ఒక వరుసలో ఉంచిన దృశ్యాలు దుర్ఘటన తీవ్రతను తెలియజేస్తున్నాయి. కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం.. (Odisha Train Tragedy)

ప్రయాణికులతో ఉన్న రెండు రైళ్లు, ఒక గూడ్స్ ఢీకొనడం ఈ విషాదానికి కారణమైంది. రైళ్లు అతివేగంతో వెళ్లడంతో ఈ మూడింటి మధ్య తాకిడి తీవ్రత ఎక్కువగా ఉంది. దాంతో కొన్ని బోగీలు గాల్లోకి లేచి, తిరిగిపోయాయి. అంతేబలంగా కిందికి పడిపోవడంతో వాటితోపాటు పట్టాలు ధ్వంసమయ్యాయి. ఒక బోగీపై మరొకటి దూసుకెళ్లడంతో వాటికింద ప్రయాణికులు నలిగిపోయారు. 

ఈ ప్రమాద తీవ్రతతో రైలు బోగీలు ధ్వంసం కావడంతో అందులోని సీట్లు సైతం రూపురేఖలు లేకుండా పోయాయి. ప్రయాణికులకు చెందిన సూట్‌కేసులు, పిల్లల షూలు, దుస్తులు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇక ప్రమాదంలో మృతి చెందిన వారిని తెల్లటి వస్త్రాల్లో చుట్టి, ఒక దగ్గర ఉంచిన దృశ్యాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. కోరమాండల్‌లో ప్రయాణించిన అనుభవ్‌ దాస్‌ ఈ ఘటన గురించి వెల్లడించారు. ‘నా కళ్లముందే భారీ సంఖ్యలో మృతదేహాలు పడిపోయి కనిపించాయి. కుటుంబాలు కుటుంబాలే నలిగిపోయాయి. అవయవాలు కోల్పోయిన వారి ఆర్తనాదాలతో ప్రాంతమంతా నిండిపోయింది. పట్టాలపై ఎటుచూసిన రక్తమే. ఆ ఘటనను నేనేప్పటికీ మర్చిపోలేను’ అని అతడు వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని