Udaipur Murder: ‘నన్ను చంపడానికి ప్లాన్‌.. రక్షించండి’.. హత్యకు ముందు పోలీసులకు దర్జీ ఫిర్యాదు!

రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్య లాల్‌ హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Published : 30 Jun 2022 02:16 IST

ఉదయ్‌పుర్‌: రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో దర్జీ కన్హయ్య లాల్‌ హత్య (Udaipur Murder) కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. అతడిని హతమార్చడానికి ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారని కన్హయ్య చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. మూడ్రోజుల నుంచి షాప్‌ తెరవనీయకుండా బెదిరిస్తున్నారని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోనూ కన్హయ్య పేర్కొన్నట్లు వెల్లడించారు.

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు మద్దతుగా దర్జీ కన్హయ్య లాల్‌ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని పోలీసులు జూన్‌ 11న అతడిని అరెస్టు చేశారు. జూన్ 15న బెయిల్‌పై విడుదల చేశారు. తర్వాత ఆయనకు పలు సంస్థల నుంచి బెదిరింపులు వస్తున్నాయని.. ఇద్దరు వ్యక్తులు షాప్‌ తెరవనీయకుండా తనకు అడ్డుపడుతున్నారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. ‘‘ఆరు రోజుల క్రితం నా కుమారుడు మొబైల్‌లో గేమ్ ఆడుకుంటూ ఏమరపాటులో ఓ పోస్టు పెట్టాడు. అది నాకు కూడా తెలియదు. అది పెట్టిన రెండ్రోజుల తర్వాత ఇద్దరు వ్యక్తులు వచ్చి నా ఫోన్‌ను లాక్కోవాలని ప్రయత్నించారు. మూడ్రోజులు నేను షాప్‌ ఓపెన్‌ చేస్తుంటే వచ్చి అడ్డుకున్నారు. నా కోసం కాపు కాస్తూ షాప్‌ ఓపెన్‌ చేయొద్దని ఒత్తిడి చేశారు. దయచేసి వారిపై చర్యలు తీసుకోండి. దుకాణం తెరిచేందుకు నాకు సహాయం చేయండి. వారి నుంచి నన్ను రక్షించండి’’ అని జూన్‌ 15న కన్హయ్యలాల్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇరువర్గాల నాయకులతో పాటు ఇరుగుపొరుగు వారిని పిలిపించి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత సమస్య పరిష్కారమైందని ఓ సీనియర్‌ అధికారి కూడా చెప్పారు. సమస్య సద్దుమణిగిందని.. ఇకపై అతడికి పోలీసుల అవసరం లేదని కన్హయ్య లాల్‌కు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. అయినప్పటికీ తాను భయపడుతూ ఉండేవాడని కన్హయ్య భార్య యశోద తెలిపారు. అందుకే తను వారం రోజులపాటు షాప్‌కి వెళ్లలేదని.. వారం తర్వాత తొలిసారిగా నిన్న వెళ్లాడని వివరించారు. అయితే, అతడిపై దాడి చేసింది బెదిరించిన వ్యక్తులు కాదని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. దర్జీ హత్య కేసులో రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ కీలక విషయాలు వెల్లడించారు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకే అతడిని హతమార్చారని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. హత్యకు కారకులైన ఇద్దరు నిందితులు గౌస్‌ మహ్మద్‌, రియాజ్‌ అఖ్తారీకి అంతర్జాతీయంగా ఉగ్రవాద సంబంధాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై కేసు నమోదు చేసి కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విచారణ వేగవంతం చేసింది. రియాజ్‌ అఖ్తారీకి పాకిస్థాన్‌కు చెందిన దావత్-ఎ-ఇస్లామీతో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కన్హయ్యను హత్య చేయడానికి ముందు గౌస్‌ ఐఎస్‌ఐఎస్‌కు సంబంధించిన వీడియోలను చూశాడని, పాకిస్థాన్‌కు అనేక సార్లు కాల్‌ చేశాడని తెలిసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని