
PM Modi: ఉద్ధవ్ బాగానే కోలుకొంటున్నారు.. ప్రధానికి చెప్పినశివసేన ఎంపీ!
దిల్లీ: గత నెలలో వెన్నుపూసకు శస్త్ర చికిత్స చేయించుకున్న మహారాష్ట్ర సీఎం, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా పలు పార్టీల సభాపక్ష నేతలతో స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన సంప్రదాయ భేటీ సందర్భంగా శివసేన ఎంపీలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ఉద్ధవ్ బాగానే కోలుకుంటున్నారని, ప్రస్తుతం కొనసాగుతున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ఆయన హాజరు కానున్నట్టు శివసేన ఎంపీ వినాయక్ రౌత్ ప్రధానికి వివరించారు. ఆ సమయంలో స్పీకర్ కార్యాలయంలో ప్రధాని మోదీ వెంట కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు.
మరోవైపు, నవంబర్‌లో మెడ నొప్పి రావడంతో ముంబయిలోని హెచ్.ఎస్ రిలయన్స్ ఆస్పత్రిలో చేరిన ఉద్ధవ్ ఠాక్రేకు వైద్యులు వెన్నుపూసకు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. అంతేకాకుండా అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేసిన తేనీటి విందుకు కూడా వర్చువల్‌గానే హాజరయ్యారు. సర్జరీ తర్వాత తొలిసారి విధాన సభను కూడా సందర్శించారు. డిశ్చార్జి అయిన తర్వాత నుంచి తన అధికారిక నివాసం వర్ష నుంచి పనిచేస్తున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.