Bridge Collapse: నిర్మాణంలో ఉండగానే కుప్పకూలిన వంతెన.. వీడియో వైరల్‌

బిహార్‌ (Bihar)లో నిర్మాణంలో ఉన్న తీగల వంతెన కూలిపోయింది. వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఆ దృశ్యాలు వైరల్‌గా మారాయి. 

Updated : 04 Jun 2023 21:13 IST

పట్నా: బిహార్‌ (Bihar)లో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.  బిహార్‌లోని ఖగారియా జిల్లాలో గంగా నదిపై అగువాని సుల్తాన్‌గంజ్‌ గంగా (Aguwani Sultanganj Ganga) పేరుతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్‌ ఒక్కసారిగా నదిలో కూలిపోయింది. ఈ వంతెనకు ప్రమాదం జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్‌ నెలలో తుఫాను కారణంగా వంతెన పిల్లర్లు కొంతభాగం దెబ్బతిన్నాయి. ఖగారియా (Khagaria) - అగువాని (Aguwani) ప్రాంతాల మధ్య గంగా నదిపై ఈ వంతెనను నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం కోసం బిహార్‌ ప్రభుత్వం రూ.1,717 కోట్లు కేటాయించింది. ఈ ఘటనపై బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌ విచారణకు ఆదేశించారు. 2015లో నీతీశ్‌ కుమార్‌ ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2020 నాటికి ఈ వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటికీ పూర్తికాలేదు. 

వంతెన కూలుతున్న సమయంలో అక్కడే ఉన్న స్థానికులు ఆ దృశ్యాలను రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంపై ప్రతిపక్షాలు నీతీశ్‌ కుమార్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ‘‘సీఎం కమిషన్లకు అలవాటుపడ్డారు. ప్రభుత్వ వ్యవస్థ మొత్తం అవినీతిలో కూరుకుపోయింది. రాష్ట్రంలో పాలనను గాలికొదిలేసి ప్రతిపక్షాల ఐక్యత కోసం నీతీశ్‌ తిరుగుతున్నారు’’ అని భాజపా ఎమ్మెల్యే విజయ్‌ కుమార్‌ సిన్హా ఆరోపించారు. గతేడాది డిసెంబర్‌లో కూడా బిహార్‌లోని బెగుసరాయ్‌ ప్రాంతంలో బుర్హి గండక్‌ నదిపై నిర్మించిన వంతెనలో కొంత భాగం కూలిపోయింది. అదే ఏడాది నవంబరులో సీఎం నీతీశ్‌ కుమార్‌ సొంత జిల్లా నలందలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనలో ఒక కూలీ చనిపోగా, మరోవ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అంతకముందు కిషన్‌గంజ్‌, సహర్‌సా జిల్లాలో ప్రారంభానికి ముందే రెండు వంతెనలు కూలిపోయాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు