Budget 2023: ఎన్నికల ఎఫెక్ట్‌.. బడ్జెట్‌లో కర్ణాటకకు ‘ప్రత్యేక’ కేటాయింపులు

మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు కేంద్ర బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు ఆర్థిక సాయం ప్రకటించారు.

Updated : 01 Feb 2023 14:22 IST

దిల్లీ: రాబోయే 25ఏళ్ల అమృత కాలానికి తొలి బడ్జెట్‌ (Budet 2023)ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)‌.. అన్ని వర్గాల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమిచ్చినట్లు చెప్పారు. అయితే, మాంద్యం భయాలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్‌లో పెద్దగా జనాకర్షక పథకాల జోలికి పోని నిర్మలమ్మ.. దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక (Karnataka)కు మాత్రం భారీగానే కేటాయించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆ రాష్ట్రానికి బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించడం గమనార్హం.

కర్ణాటకలో కరవు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆర్థిక సహకారం అందించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) వెల్లడించారు. అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు రూ.5,300 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. 29.4 టీఎంసీల సామర్థ్యంతో 2.25 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు నీటిని సరఫరా చేసేందుకు అప్పర్‌భద్ర ప్రాజెక్టును కర్ణాటక చేపట్టింది. కరవు ప్రాంతాల్లో నీటి సరఫరాకు ఈ ప్రాజెక్ట్‌ అత్యంత కీలకమని కర్ణాటక చెబుతోంది. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మరికొద్ది నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. కర్ణాటకకు కేంద్రం నిధులు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది మే 24తో కర్ణాటక అసెంబ్లీ గడువు ముగియనుంది. ఆలోపే అంటే మార్చి-ఏప్రిల్‌లో అక్కడ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో భాజపా (BJP) ప్రభుత్వం అధికారంలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని