Tiger: ఆ ‘సూపర్‌ మామ్‌ టైగర్‌’ మృతికి సీఎం, కేంద్రమంత్రి నివాళి

మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌లో లెజెండరీ ఆడ పులి ‘కొల్లార్‌వాలి’ మృతి పట్ల కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ స్పందించారు. ......

Published : 17 Jan 2022 22:24 IST

దిల్లీ: మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌లో లెజెండరీ ఆడపులి ‘కొల్లార్‌వాలి’ మృతి పట్ల కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ స్పందించారు. 29 పులులకు జన్మనిచ్చిన ఈ ‘పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ క్వీన్‌’ మరణం తీరని లోటుగా అభివర్ణించారు. సూపర్‌ మామ్‌గా పిలవబడే ‘కొల్లార్‌వాలి‘ మన దేశంలో పులుల జనాభాను పెంచడం ద్వారా పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో చేసిన మేలు ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ ఆయన ట్విట్‌ చేశారు. మరోవైపు, ఈ పులి మరణించిన విషయం తెలిసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ కూడా నివాళులర్పించారు. మధ్యప్రదేశ్ ‘టైగర్‌ స్టేట్‌’ హోదా సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ పులి తమ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఈ ‘పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ క్వీన్‌’ పిల్లల గర్జనతో మధ్యప్రదేశ్ అడవులు ఎప్పుడూ ప్రతిధ్వనిస్తాయని పేర్కొన్నారు. 

దాదాపు 17 ఏళ్లు జీవించిన ఈ పులి 11 ఏళ్ల వ్యవధిలో ఎనిమిది ఈతల్లో ఒకటికాదు, రెండు కాదు ఏకంగా 29 పులులకు జన్మనిచ్చింది. వయో భారంతో నీరసించిపోవడంతో గత వారం రోజులుగా వైద్యులు చికిత్స అందించారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం 6.15గంటలకు కర్మజ్‌హిరి రేంజ్‌లో ఈ ఆడ పులి మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఈ పులికి అటవీశాఖ అధికారులు అంత్యక్రియలు నిర్వహించగా స్థానికులు కూడా అక్కడికి వచ్చి నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని