Nisith Pramanik: కేంద్రమంత్రి కారుపై రాళ్ల దాడి.. బెంగాల్‌లో ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో మరోసారి ఉద్రిక్తత చెలరేగింది. కేంద్రమంత్రి నిశిత్‌ ప్రామాణిక్‌ కారుతో కొందరు రాళ్ల దాడికి పాల్పడ్డారు.

Published : 25 Feb 2023 17:23 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ (West Bengal)లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిశిత్‌ ప్రామాణిక్‌ (Nisith Pramanik)కు చేదు అనుభవం ఎదురైంది. కూచ్‌బెహార్‌ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై కొందరు ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

నిశిత్‌ ప్రామాణిక్‌ (Nisith Pramanik) కూచ్‌బెహార్‌ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శనివారం ఆయన స్థానిక భాజపా (BJP) కార్యాలయానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి హానీ జరగలేదు. అయితే ఆయన ప్రయాణిస్తున్న కారు ముందు అద్దం పగిలిపోయింది. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు వెనక్కితగ్గకపోవడంతో బాష్పవాయువు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

ఈ ఘటనపై కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) కార్యకర్తలే ఈ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ‘‘ఒక కేంద్రమంత్రికే రక్షణ లేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం ఎలాంటి స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. హింసకు పాల్పడిన వారికి రక్షణ కల్పిస్తున్నారు’’ అని ఆయన మండిపడ్డారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని