Afghanistan: కశ్మీర్‌ సరిహద్దుల్లో అఫ్గాన్‌ సిమ్‌లు యాక్టివేట్‌..!

అమెరికా అఫ్గానిస్థాన్లో వదిలేసి వెళ్లిన ఆయుధాలు మెల్లగా పాకిస్థాన్‌ చేరి అక్కడి నుంచి కశ్మీర్‌ సరిహద్దుల వద్ద వస్తున్నాయి. ఈ విషయాన్ని సైనిక వర్గాలు పసిగట్టాయి.

Published : 21 Feb 2022 01:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అఫ్గానిస్థాన్లో వదిలేసి వెళ్లిన ఆయుధాలు మెల్లగా పాకిస్థాన్‌ చేరి అక్కడి నుంచి కశ్మీర్‌ సరిహద్దుల వద్ద వస్తున్నాయి. ఈ విషయాన్ని సైనిక వర్గాలు పసిగట్టాయి. ఇటీవల కాలంలో అమెరికా వాడిన నైట్‌విజన్‌ సామగ్రి, ఆయుధాలు కశ్మీర్‌ ఉగ్రమూక వద్ద ఉన్నట్లు గుర్తించాయి. ఈ విషయాన్ని సైనిక వర్గాలు ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించాయి.

అఫ్గాన్‌ భాష మాట్లాడేవారు తరచూ సరిహద్దులకు అవతలవైపు కనిపిస్తున్నట్లు సమాచారం. దీంతోపాటు అఫ్గాన్‌ సిమ్‌కార్డుల సిగ్నల్స్‌ సంఖ్య పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో పెరిగిపోయినట్లు గుర్తించారు. ఇటీవల కశ్మీర్‌లోకి చొరబడేందుకు యత్నించిన కొందరిని ఆర్మీ మట్టుబెట్టగా.. వారి వద్ద అమెరికా ఆయుధాలు, ఇతర పరికరాలు లభ్యమయ్యాయి. అమెరికా దళాలపై అఫ్గానిస్థాన్‌లో దాడుల కోసం వెళ్లిన ఉగ్రవాదులు తిరిగి పీవోకేకు చేరుకొన్నట్లు అంచనావేస్తున్నారు. వీరిని పాక్‌ సైన్యం కశ్మీర్‌లోకి మళ్లించే అవకాశం ఉంది. ఈ వేసవిలో వీరు కశ్మీర్‌లో చొరబడేందుకు యత్నించే అవకాశం ఉన్నట్లు సైనిక వర్గాలు భావిస్తున్నాయి.

అఫ్గానిస్థాన్‌లో దాదాపు ఆరు లక్షల అత్యాధునిక చిన్న ఆయుధాలను అమెరికా వదిలేసి వెళ్లిపోయింది. దీంతోపాటు వేల సంఖ్యలో నైట్‌విజన్‌ పరికరాలు కూడా అఫ్గానిస్థాన్‌లో వదిలేశాయి. పాక్‌ సైన్యం ఇటువంటి ఆయుధాలను ఉపయోగించదు. ఈ నేపథ్యంలో ఎన్‌కౌంటర్ల సమయంలో సైన్యం ఇటువంటి ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని