Mask in Car: కారు ప్రయాణంలోనూ మాస్కు.. అర్థంలేని నిబంధనే..!

కారులో ఒంటిరిగా ప్రయాణించే సమయంలోనూ మాస్కు ధరించాలని ప్రభుత్వం తెచ్చిన నిబంధన అర్థం లేనిదని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

Published : 02 Feb 2022 16:37 IST

ప్రభుత్వ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలన్న దిల్లీ హైకోర్టు

దిల్లీ: కారులో ఒంటరిగా ప్రయాణించే సమయంలోనూ మాస్కు ధరించాలని ప్రభుత్వం తెచ్చిన నిబంధన అర్థం లేనిదని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కారులో ప్రయాణిస్తున్న సమయంలో మాస్కు ధరించలేదనే కారణంగా జరిమానా విధించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. ఇప్పటికీ ఆ నిబంధన ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మాస్కు పెట్టుకోలేదనే కారణంగా రూ.500 జరిమానా విధించారంటూ దాఖలైన నాలుగు పిటిషన్ల విచారణ సందర్భంలో దిల్లీ హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కారులో ప్రయాణించే వారు మాస్కులు ధరించకుంటే మొదట్లో రూ.500 జరిమానా విధించగా.. ప్రస్తుతం రూ.2వేలు చలాన్‌ విధిస్తున్న మాట నిజమేనని ప్రభుత్వం తరుపున సీనియర్‌ న్యాయవాది రాహుల్‌ మెహ్రా హైకోర్టు ధర్మాసనానికి వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇటీవల చోటుచేసుకున్న ఓ విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. ‘ఓ మహిళ తన తల్లితో కలిసి కారులో కూర్చొని కాఫీ తాగుతోంది. అప్పటికి కారు అద్దాలన్నీ మూసివేసే ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు రూ.2వేల చలాన్‌ విధించారు. ఈ విషయాన్ని సదరు మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తూ తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది’ అని వివరించారు. ప్రస్తుతం కొవిడ్‌కు సంబంధించి వాస్తవ పరిస్థితులు మారాయని.. అందుకే గతంలో ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలంటే నెలలు, సంవత్సరాలు పడుతుందని.. న్యాయస్థానమైతే వెంటనే ఆదేశాలు ఇచ్చే ఆస్కారం ఉంటుందని హైకోర్టు ధర్మాసనానికి న్యాయవాది రాహుల్‌ మెహ్రా విన్నవించారు.

సీనియర్‌ న్యాయవాది చెప్పిన విషయాలను విన్న హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ చర్యలను తప్పుబట్టింది. ‘అవి దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైనా న్యాయస్థానం ముందుకు వస్తే తప్ప తామేమి చేయలేం. దిల్లీ ప్రభుత్వ ఆదేశాలైనా.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలైనా.. అవి మాత్రం అసంబద్ధమైనవి. గతేడాది తీసుకువచ్చిన నిబంధన ఇప్పటికీ ఎందుకు అమలు చేస్తున్నారు. అప్పటి ఆదేశాలను ప్రభుత్వమే ఎందుకు వెనక్కి తీసుకోకూడదో పరిశీలించండి. సొంత కారులో కూర్చున్న వారు మాస్కు ధరించాలని చెప్పడం అర్థంలేనిది. సూచనలు వెనక్కు తీసుకోండి’ అని జస్టిస్‌ విపిన్‌ సంఘీ, జస్టిస్‌ జస్మీత్‌ సింగ్‌ ధర్మాసనం దిల్లీ ప్రభుత్వ తరపున న్యాయవాదికి సూచించింది. ఇందుకు సంబంధించి దిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (DDMA) గతంలో ఇచ్చిన ఆదేశాలన్నింటినీ కూడా పునఃపరిశీలించాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితులకు అనుగుణంగా కొత్త నిబంధనలు విడుదల చేయాలని హైకోర్టు ధర్మాసనం మౌఖిక ఆదేశాలిచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని