CoronaVaccine: పిల్లలకు ఎప్పుడు?
: రెండో దశలో కరోనా రక్కసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి మీదా ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పటికే ఎంతోమంది ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండో దశ ఉద్ధృతిలో పిల్లల్లో వైరస్ కేసులు
ఇంటర్నెట్‌డెస్క్: రెండో దశలో కరోనా రక్కసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరి మీదా ప్రతాపం చూపిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పటికే ఎంతోమంది ముక్కుపచ్చలారని చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండో దశ ఉద్ధృతిలో పిల్లల్లో వైరస్ కేసులు ఎక్కువవుతుండటంతో వ్యాక్సిన్ల కోసం తల్లిదండ్రులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రెండేళ్ల చిన్నారుల నుంచి 18ఏళ్ల యువతపై టీకా ప్రయోగాలకు అనుమతులు మంజూరు చేసింది. మరి పిల్లలకు వ్యాక్సిన్లు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? వీరికి కూడా పెద్దవాళ్లలాగే ఇస్తారా? అవి వారికి సురక్షితమేనా?
ముమ్మరంగా ప్రయోగాలు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ కరోనా టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అవన్నీ 18ఏళ్ల పైబడిన వారికే. నిజానికి గతేడాది కరోనా విజృంభణ సమయంలో చిన్నారులపై వైరస్ ప్రభావం తక్కువగా ఉంది. అయితే ఇప్పుడు అనేక రూపాంతరాలు చెందుతున్న ఈ మహమ్మారి పిల్లలపైనా విరుచుకుపడుతోంది. దీంతో చిన్నారులకు టీకాను విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పలు కంపెనీలు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే అనేక సంస్థలు ఆరు నెలల చిన్నారుల నుంచి 18ఏళ్ల లోపు వారిపై జరుపుతున్న క్లినికల్ ట్రయల్స్ వివిధ దశల్లో ఉన్నాయి.
రెండేళ్ల చిన్నారుల నుంచి 18 ఏళ్ల లోపు వారిపై కొవాగ్జిన్ ప్రయోగాలకు భారత్ బయోటెక్‌కు అనుమతి లభించిన విషయం తెలిసిందే. భారత్ వెలుపల ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా లాంటి సంస్థలు కూడా పిల్లలపై టీకా ప్రయోగాలు చేస్తున్నాయి. 12-18 ఏళ్ల వారిపై మోడెర్నా టీకా ప్రయోగ ఫలితాలు త్వరలో రానున్నాయి. 2-11ఏళ్ల వారిపైనా ఈ సంస్థ క్లినికల్ ట్రయల్స్ చేయనుంది. ఇక ఫైజర్ సంస్థ 12ఏళ్ల పైబడిన వారి కోసం తయారు చేసి టీకాకు అమెరికా, కెనెడా ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. త్వరలోనే ఈ సంస్థ నెలల నుంచి 2 సంవత్సరాల మధ్య చిన్నారులపై కూడా పరీక్షలు జరపనుంది. వీటితో పాటు జాన్సన్ అండ్ జాన్సన్, నొవావాక్స్ కూడా పిల్లలపై ప్రయోగాలు వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నాయి.
ఆ దేశాల్లో 12ఏళ్ల పైబడిన వారికి టీకా..
అమెరికాలో 12-15 ఏళ్ల వయసు వారికి ఫైజర్ టీకాలు ఇచ్చేందుకు ఆ దేశ ఆహార, ఔషధ నిర్వహణ సంస్థ(ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. అంతకుముందే 16-18ఏళ్ల వారికి టీకా అందించేందుకు అమెరికా అనుమతించింది. తాజాగా 12-15 మధ్య వయసు వారిలోనూ ఫైజర్ టీకా సమర్థంగా పనిచేస్తుందని క్లినికల్ పరీక్షల ద్వారా నిర్ధారణ అవడంతో ఎఫ్‌డీఏ అనుమతులు మంజూరు చేసింది. మరోవైపు కెనడా ప్రభుత్వం కూడా 12ఏళ్లు దాటిన పిల్లలకు టీకా ఇచ్చేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ దేశంలో 12-18ఏళ్ల వయసు వారిపై ఫైజర్ జరిపిన ప్రయోగాలు ఫలించడంతో కెనెడా ప్రభుత్వం అనుమతులిచ్చింది.
పిల్లలకు భద్రమేనా?
నిజానికి చాలా మంది పిల్లలకు కరోనా సోకినా వారిలో లక్షణాలు కన్పించట్లేదు. లేదా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి. సాధారణ జ్వరం లాగే కన్పించి తగ్గుతుంది. అయితే కొందరిలో మాత్రం ఎక్కువగా ఉంటోంది. దీంతో వీరికి టీకాలు అవసరమా లేదా అన్నదానిపై అనేక అపోహలు తలెత్తుతున్నాయి. మరోవైపు టీకాలతో దుష్ప్రభావాలు వస్తాయన్న ప్రచారం కూడా ఉండటంతో తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. అయితే లక్షణాలు కన్పించకపోవడంతో పిల్లల నుంచి ఇతరులకు వైరస్ వ్యాపించకుండా ఉండటం కోసం వారికి టీకా ఇవ్వాల్సిన అవసరం ఉందని కొందరు వైద్యులు చెబుతున్నారు.
12-15ఏళ్ల వయసు వారిపై ఫైజర్ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ కమిటీ ఛైర్మన్ డాక్టర్ యువొన్నె మాల్డొనాడో చెబుతున్నారు. అయితే పెద్దవాళ్లలాగే పిల్లలకు కూడా టీకా తీసుకున్న తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ రావడం సాధారణమే అని ఎఫ్‌డీఏ తెలిపింది. టీకా ఇచ్చిన చోట నొప్పి, దురదతో పాటు తలనొప్పి, జ్వరం, కీళ్లనొప్పులు వచ్చే అవకాశముందని, అయితే అవి త్వరగానే నయమవుతాయని పేర్కొంది. అయితే టీకా భద్రతపై నిపుణులు, ప్రభుత్వ సంస్థల నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ఎలా ఇస్తారు..?
ప్రస్తుతం భారత్ బయోటెక్ పిల్లలపై ప్రయోగిస్తున్న వ్యాక్సిన్ ఇంజెక్షన్ ద్వారా వేసే టీకా. తొలి డోసు వేసిన 28 రోజులకు రెండో డోసు వేయాల్సి ఉంటుంది. అయితే ముక్కు ద్వారా వేసే చుక్కల వ్యాక్సిన్‌పైనా కొన్ని సంస్థలు ప్రయోగాలు జరుపుతున్నాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పామును కొరికి చంపిన బాలుడు
-
India News
28 వేల మంది జమ్మూకశ్మీర్ ప్రభుత్వోద్యోగులపై ఐటీ శాఖ నిఘా
-
Ap-top-news News
శ్రీవారి ఆలయ సమీపంలో వెళ్లిన విమానం
-
Sports News
చిరునవ్వుతో టాటా.. పీఎస్జీని వీడిన మెస్సి
-
India News
అనాథకు.. తండ్రిని చూపిన అన్నదానం
-
Ts-top-news News
ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు