Corona: మరణ మృదంగ‘మే’

4077, 4106, 4329, 4,529.. గత నాలుగు రోజులుగా దేశంలో నమోదైన కరోనా మరణాలివి. గత కొద్ది రోజులుగా దేశంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. వైరస్‌తో ప్రాణాలు

Updated : 19 May 2021 12:23 IST

18 రోజులు.. 71,395 మరణాలు

ఇంటర్నెట్‌డెస్క్‌: 4077, 4106, 4329, 4,529.. గత నాలుగు రోజులుగా దేశంలో నమోదైన కరోనా మరణాలివి. గత కొద్ది రోజులుగా దేశంలో కొత్త కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుండం భయాందోళనలు రేపుతోంది. ఈ మృత్యుఘోష ఆగేదెప్పుడా అని యావత్ భారతావని ఆశగా ఎదురుచూస్తోంది. మరి కొత్త కేసులు, రికవరీలు ఊరటనిస్తున్నప్పటికీ.. మరణాలు ఎందుకు ఇంత భారీగా ఉంటున్నాయంటే.. దీనికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. 

మే నెలలో భారీగా మరణాలు..

గత కొద్ది రోజులుగా మరణాల సంఖ్య 4వేల పైనే ఉంటోంది. రానున్న రోజుల్లో ఇది మరింత ఎక్కువయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మే నెల ఆరంభం నుంచి ఇప్పటివరకూ 71,395 మందిని మహమ్మారి బలితీసుకుంది. అంటే సగటున రోజుకు 3800 మందికి పైనే వైరస్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఏప్రిల్‌ నెల మొత్తంలో 49వేలుగా ఉన్న మరణాల సంఖ్య ఈ నెలలో రెట్టింపు అయ్యేలాగే కన్పిస్తోంది. తాజాగా నిన్న ఒక్క రోజే 4,529 మంది మరణించగా.. దేశంలో మొత్తం మరణాలు 2.8లక్షలు దాటాయి.

ఏప్రిల్ ఉద్ధృతి ప్రభావమేనా..

రెండో దశలో కరోనా అలుపన్నదే లేకుండా పేట్రేగిపోయింది. పల్లెలు.. పట్టణాలు అనే తేడా లేకుండా, చిన్నా పెద్దా అని చూడకుండా అందరిమీదా గట్టిగా విరుచుకుపడింది.  ఒక్క ఏప్రిల్‌ నెలలోనే దాదాపు 70లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అంటే సగటున రోజుకు 2లక్షలకు పైనే కేసులు వచ్చాయి. ఆ ఉద్ధృతే రికార్డు స్థాయి మరణాలకు దారితీస్తోందనేది నిపుణుల మాట. అయితే దీంతో పాటు కొన్ని రాష్ట్రాలు పాత మరణాలను కూడా ఇప్పుడు వెల్లడించడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. మహారాష్ట్రలో సోమవారం 1200 మరణాలు నమోదు కాగా.. ఇందులో క్రితం వారం నాటి మరణాలు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక కర్ణాటకలోనూ ఇలాంటి  పరిస్థితే ఉంది. మరణాల నమోదులో అధికారుల అలసత్వం కారణంగానే ఇలా జరుగుతోంది. 

జూన్‌ నాటికి తగ్గే అవకాశం..

గత నెలలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో ఉండటంతో ఇప్పుడు మరణాలు భారీగా ఉంటున్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చే నెలలో ఈ సంఖ్య తగ్గే అవకాశాలున్నట్లు కన్పిస్తోంది. ప్రస్తుతం కొత్త కేసులు కూడా తగ్గుతుండటంతో రికార్డు మరణాలకు అడ్డుకట్టపడేలాగే ఉంది. కరోనా కేసుల ప్రభావం మూడు వారాల తర్వాత మృతుల సంఖ్యపై కన్పిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఆ ఐదు రాష్ట్రాల్లో మరణమృదంగం

కరోనా దేశంలోకి ప్రవేశించిన నాటి నుంచి ఇప్పటివరకు 2.8లక్షల మంది మృత్యుఒడికి చేరుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 83,777 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత కర్ణాటకలో 22,838 మంది, దిల్లీలో 22వేల మంది మరణించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడులోనూ మరణాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో రోజుకు సగటున 300 మందికి పైనే వైరస్‌కు బలవుతున్నారు. 12 రాష్ట్రాల్లో రోజువారీ మరణాల సంఖ్య 100 కంటే ఎక్కువగానే ఉంటుండటం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని