Temperature : ఫిబ్రవరిలోనే ఎండలు భగ భగ.. ఎందుకంటే..!

ఇటీవల కాలంలో ఉష్ణోగ్రతలు (Temparature) అమాంతం పెరిగిపోయినప్పటికీ ముందస్తుగా వేసవికాలం వచ్చిందని చెప్పలేమని ఐఎండీ (IMD) నిపుణులు చెబుతున్నారు. రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశముందని అంటున్నారు.

Updated : 21 Feb 2023 19:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంకా ఫిబ్రవరి నెల పూర్తికాక ముందే దేశ వ్యాప్తంగా ఎండలు (Day temparature) మండుతున్నాయి. గుజరాత్‌ (Gujarat), రాజస్థాన్‌ (Rajasthan), మహారాష్ట్రలోని కొంకణ్‌, గోవా (Goa), కర్ణాటక (Karnataka)లో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఉష్ణోగ్రతల్లో ఒక్కసారిగా ఇంతటి మార్పులు ఎందుకు సంభవించాయి? ఈ ఏడాది వేసవి కాలం ముందుగా వచ్చిందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు.

మహారాష్ట్రలోని కొంకణ్‌ ప్రాంతంలో వేడిగాలులు తీవ్రంగా వీచే అవకాశముందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణశాఖ ( ఐఎండీ) నిపుణులు ఆదివారం హెచ్చరికలు జారీ చేశారు. ఆ తర్వాతి రోజునే 4 నుంచి 9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టొచ్చని మరో ప్రకటన విడుదల చేశారు. దీనిని బట్టి ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. కానీ,  ఏటా ఈ సమయానికి నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో పోల్చితే ప్రస్తుత  ఉష్ణోగ్రతలు అధికమనే చెప్పాలి.

ఎందుకీ భగ..భగ

సాధారణంగా పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులను వాయవ్య ప్రాంతంలోని పర్వతాలు అడ్డుకుంటాయి. ఫలితంగా తక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ, ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవు. పర్వత ప్రాంతంలో ఈ ఏడాది వర్షపాతం తగ్గడంతోపాటు, పొడి వాతావరణం నెలకొనడం వల్ల పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న వేడిగాలులు నేరుగా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి. ఫలితంగా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మధ్యధరా ప్రాంతంలో ఏర్పడిన  తుపానులు భారత వాయవ్య ప్రాంతం మీదుగా ప్రయాణించి అక్కడ వర్షాలు కురిపిస్తాయి. కానీ, అలాంటి పరిస్థితులు లేకపోవడం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి ఓ కారణంగా చెప్పవచ్చు. మరోవైపు గుజరాత్‌లో ఏర్పడిన యాంటీ సైక్లోన్లు కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా సముద్రం మీదుగా వచ్చే చల్లని గాలులు.. భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకున్నప్పుడు యాంటీ సైక్లోన్‌ పరిస్థితులు ఏర్పడతాయి.  ఇది కూడా ఉష్ణోగ్రతల పెరుగుదలకు దారితీసిందని చెబుతున్నారు.

ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముందా?

మరో రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతల ప్రభావం తగ్గే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ, సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని చెబుతున్నారు. అలాగని తాజా పరిస్థితులను అంచనా వేస్తూ వేసవికాలం ముందుగా వచ్చిందని చెప్పలేమని అంటున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రతలు వేసవి ప్రారంభానికి సంకేతాలు కాదని చెప్పిన శాస్త్రవేత్తలు.. ఇవి భూ వాతావరణ పరిస్థితులు కారణంగా అప్పుడప్పుడు ఏర్పడే అధిక ఉష్ణోగ్రతలేనని అంటున్నారు. వాతావరణ శాఖ నియమాల ప్రకారం మైదాన ప్రాంతంలో 40 కంటే ఎక్కువ, కొండ ప్రాంతాల్లో 30 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనప్పుడు వడగాలులు వీస్తున్నట్లు ప్రకటిస్తారు.‘‘ఫిబ్రవరిలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పెరిగినప్పటికీ.. కొన్ని రోజుల వ్యవధిలోనే క్రమంగా మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. అందువల్ల ఈ ఏడాది వేసవికాలం ముందుగా వచ్చిందని చెప్పలేం’’ అని ఐఎండీ సీనియర్‌ శాస్త్రవేత్త ఆర్కే జన్మని మీడియాకు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని