Chandrayaan 3: చంద్రుడిని చేరాలంటే.. 40 రోజులు ఎందుకు పడుతోంది..?

చంద్రుడిపై చేసే ప్రయోగాల కోసం అక్కడకు రోవర్లను పంపించాలంటే అమెరికా చేపట్టిన ‘అపోలో 11’కి నాలుగు రోజులు, రష్యాకు ఒకటిన్నర రోజు పడితే.. భారత్‌కు 40రోజులు పడుతోంది.

Updated : 14 Aug 2023 18:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలు ఎంతో ప్రగతి సాధించినా.. చంద్రుడి అన్వేషణ ఓ సవాలుగానే మారింది. దశాబ్దాల క్రితమే జాబిల్లిపై అమెరికా కాలుమోపగా.. తర్వాత రష్యా, చైనాలు తమ రోవర్లను అక్కడ సురక్షితంగా దించగలిగాయి. భారత్‌ సైతం.. ఇదే ప్రయత్నంలో భాగంగా చంద్రయాన్‌-3ని ప్రయోగించింది. ఇస్రో రాకెట్‌ ఇప్పటికే దీన్ని విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టినా.. చంద్రుడిని చేరాలంటే మాత్రం 40రోజులకుపైగా సమయం తీసుకుంటుంది. అదే అమెరికా గతంలో చేపట్టిన ‘అపోలో 11’ మాత్రం నాలుగు రోజుల్లోనే అక్కడికి చేరుకుంది. రష్యాకు ఒకటిన్నర రోజులే పట్టింది. మరి ఇస్రోకు నెలకు పైగా సమయం ఎందుకనే విషయాన్ని పరిశీలిస్తే..

భూమి నుంచి 3.84 లక్షల కి.మీ దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు నేరుగా వెళ్తే.. స్వల్ప వ్యవధిలోనే చేరుకోవచ్చు. అయితే, అందుకు శక్తిమంతమైన రాకెట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. పైగా.. భారీ మొత్తంలో ఇంధనం అవసరం. ఇందుకోసం భారీ రాకెట్‌ను వినియోగించాల్సి ఉంటుంది. 1969 జులై 16న అమెరికా చంద్రుడిపైకి ‘అపోలో 11’ ప్రయోగానికి భారీ రాకెట్‌ను వినియోగించింది. అపోలోను మోసుకెళ్లిన శాటర్న్‌ వీ రాకెట్‌ ఎత్తు 363 అడుగులు కావడం గమనార్హం. ప్రస్తుతం ఇస్రో వినియోగించిన ఎల్‌వీఎం-3 రాకెట్‌ ఎత్తు 142 అడుగులు మాత్రమే.

భారీ రాకెట్ల ప్రయోగం.. అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. భారీ ప్రయోగాల కోసం అమెరికా శాటర్న్‌ వీ రాకెట్‌లను 1967 నుంచి 1973 వరకు పలుసార్లు వినియోగించింది. చంద్రుడిపైకి మానవులను పంపించేందుకు కూడా ఇదే రాకెట్‌ను ఉపయోగించింది. అది గంటకు 39వేల కి.మీ వేగంతో ప్రయాణించగలదు. అంతేకాకుండా అత్యంత శక్తిమంతమైన రాకెట్లు.. తాము మోసుకెళ్లే పేలోడ్‌నూ వేగంగా చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టగలవు. అలా ‘అపోలో 11’ రాకెట్‌.. నాలుగు రోజుల్లో చంద్రుడి వద్దకు చేరుకుంది. అంతకుముందు వెళ్లిన అపోలో- 8 కేవలం 69 గంటల్లోనే ఈ పని పూర్తి చేసింది. ఇక 1959లో రష్యా చేపట్టిన లూనా-2 వ్యోమనౌక కేవలం 34 గంటల్లో చంద్రుడిని చేరింది. అయితే, 1964-73 మధ్యకాలంలో అమెరికా తన ఒక్కో ప్రాజెక్టుకు సుమారు 185 మిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. కానీ.. ఇస్రో మాత్రం కేవలం రూ.615 కోట్లతోనే చంద్రయాన్‌- 3 ప్రాజెక్టుకు చేపట్టింది.

వేగంగా వెళ్లాల్సిన అవసరం లేకపోవడం, ప్రాజెక్టుకు అయ్యే వ్యయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇస్రో.. భిన్న మార్గాన్ని ఎంచుకొంది. భూమి గురుత్వాకర్షణ సాయంతో చంద్రుడివైపు పయనించే విధానాన్ని అనుసరిస్తోంది. ఈ క్రమంలో తొలుత చంద్రయాన్‌-3ని రాకెట్‌ ద్వారా భూమి చుట్టూ ఉన్న 170X 36,500 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెడుతోంది. భూమి చుట్టూ 24 రోజులపాటు చక్కర్లు కొడుతూనే చంద్రయాన్‌-3.. క్రమంగా తన కక్ష్యను పెంచుకుంటూపోతుంది. అలా చివరకు చంద్రుడి గురుత్వాకర్షణ క్షేత్రంలోకి చేరుకుంటుంది. ఈ ప్రక్రియకు దాదాపు 40రోజుల సమయం పడుతోంది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని