Wrestlers protest: గంగా నది తీరంలో రోదనలు.. పతకాల నిమజ్జనానికి బ్రేక్‌

గంగానదిలో తమ పతకాలను కలిపేస్తామన్న నిర్ణయం అమలును రెజ్లర్లు తాత్కాలికంగా నిలిపివేశారు. బ్రిజ్‌భూషణ్‌పై 5 రోజుల్లోగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి గడువు విధించారు. లేదంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Updated : 30 May 2023 21:12 IST

హరిద్వార్‌: భారత రెజ్లర్ల సమాఖ్య అధ్యక్షుడు, ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనబాట పట్టిన రెజ్లర్లు (Wrestlers) తమ పతకాలను గంగానదిలో (Ganga River) కలిపేందుకు సిద్ధమయ్యారు. కానీ, స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు తమ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు ప్రకటించారు. బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకునేందుకు 5 రోజుల గడువు విధించారు. లేనిపక్షంలో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. హరిద్వార్‌లో బైఠాయించిన రెజ్లర్ల దగ్గరికి రైతు సంఘాల నాయకుడు నరేశ్‌ టికాయత్‌ వెళ్లారు. కొన్నేళ్లపాటు ఎంతో శ్రమించి తీసుకొచ్చిన పతకాలను ఇలా గంగపాలు చేయడం సరికాదని వాళ్లకు నచ్చజెప్పారు. వాళ్లదగ్గరున్న పతకాలు తీసుకొని.. ప్రభుత్వానికి కొంత గడువు కోరాలని సూచించారు. ఆయన సూచన మేరకు రెజ్లర్లు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. 

ఇవాళ ఉదయం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించినట్లుగానే రెజ్లర్లు సాక్షిమాలిక్‌, వినేశ్‌ ఫొగాట్‌, సంగీత తదితర రెజ్లర్లు గంగానది ఒడ్డున ఉన్న హర్‌కీ పౌరీ ప్రదేశానికి చేరుకున్నారు. వాళ్లు వస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న పోలీసులు భద్రతాచర్యలు చేపట్టారు. మరోవైపు పెద్ద ఎత్తున మద్దతుదారులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గంగానది ఒడ్డుకు చేరుకున్న రెజ్లర్లు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దాదాపు 20 నిమిషాలపాటు మౌనం పాటించారు. ప్రాణ సమానమైన పతకాలను నిమజ్జనం చేయాల్సి వస్తోందంటూ కన్నీటిపర్యంతమయ్యారు. తమను ఈ స్థితికి తీసుకొచ్చిన నేతలపై విమర్శలు గుప్పించారు. వారి రోదనలో అక్కడి వాతావరణం గంభీరంగా మారిపోయింది.

ఈ నెల 28న పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అటువైపు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇకపై జంతర్‌మంతర్‌లో నిరసన చేపట్టేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు దిల్లీ పోలీసులు వెల్లడించారు. దీంతో ఆగ్రహం చెందిన రెజ్లర్లు తమ పతకాలను గంగానదిలో కలిపేస్తామని, ఆ తర్వాత దిల్లీలోని ఇండియాగేట్‌ వద్ద నిరాహార దీక్ష చేస్తామని ప్రకటించారు. అయితే, ఇండియా గేట్‌ వద్ద కూడా నిరసనకు అనుమతించేది లేదని దిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. ‘‘అది ఒక స్మారక చిహ్నం.. నిరసనలు చేసేందుకు కేటాయించిన స్థలం కాదు’’ అని తెలిపారు. 

రెజ్లర్ల ఆందోళనల విషయంలో కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సీనియర్ రెజ్లర్‌ సాక్షి మాలిక్‌ ఇవాళ ఉదయం విమర్శలు గుప్పించింది. ‘‘ ఈ పతకాలే మా ప్రాణం, జీవితం. అందుకే వాటిని గంగలో కలిపేస్తాం. ఆ తర్వాత బతికి ఉన్నా, లేకపోయినా ఒక్కటే. అందుకే ప్రాణాలు పోయేంత వరకు ఇండియా గేటు వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం. గంగానది ఎంత స్వచ్ఛమైనదో.. అంతే స్వచ్ఛమైన మనసులతో గెలిచిన పతకాలు ఎంతో పవిత్రమైనవి. అందుకే వాటిని దాచేందుకు గంగానదే సరైన ప్రదేశమని భావించి  ఈ నిర్ణయం  తీసుకున్నాం.  నేరస్థులపై చర్యలు తీసుకోకుండా దోషులను చూసి వ్యవస్థ భయపడుతోంది.’’ అని సాక్షిమాలిక్‌ ఆరోపించింది. ఆందోళన చేస్తున్న ప్రదేశానికి కేవలం 2 కి.మీ దూరంలోనే ఉంటున్న రాష్ట్రపతి, ప్రధాని కూడా తమ బాధలను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘మాకు న్యాయం చేయడండి అని అడగడమే మేం చేసిన తప్పా? పోలీసులు, రాజ్యాంగ వ్యవస్థ మమ్మల్నే దోషులుగా చూస్తున్నారు. నేరం చేసిన వాళ్లు మాత్రం మమ్మల్ని చూసి ఎగతాళిగా నవ్వుకుంటున్నారు.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని