
Road Accident: భార్య బతికి ఉందేమోనని నాడి పట్టుకొని..
చీపుర్లపాడు(కోటబొమ్మాళి), న్యూస్‌టుడే: కళ్లెదుటే కట్టుకున్న భార్య నిర్జీవంగా పడి ఉండడాన్ని చూసి అతను చలించిపోయాడు. భార్య బతికి ఉందేమోనని నాడి పట్టుకొని చూశాడు. కదలకుండా పడి ఉన్నా, అతని తాపత్రయం అక్కడున్న అందరినీ కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారక సంఘటన సోమవారం సాయంత్రం కోటబొమ్మాళి మండలం చీపుర్లపాడు జాతీయ రహదారిపై జరిగింది. ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లో ఉంటున్న సురేష్చంద్రసామల్ దమన్‌జోడిలోని నాల్కో కంపెనీలో జనరల్ మేనేజర్. సొంతూరు వచ్చిన ఆయన, సోమవారం తిరిగి విధుల్లో చేరేందుకు భార్య తృప్తిసామల్(57), కుమార్తె సంస్కృతిసామల్తో పాటు, సహోద్యోగి ప్రశాంత్కుమార్సామల్, ఆయన భార్య విజయబిశ్వాల్ను తన కారులో ఎక్కించుకొని దమన్జోడికి బయలుదేరారు. చీపుర్లపాడు వద్ద వీరి వెనక వస్తున్న మరో కారుకు దారి ఇచ్చే ప్రయత్నంలో రోడ్డుపై ఆగివున్న లారీని ఢీకొన్నారు. ప్రమాదంలో వెనక కూర్చొన్న తృప్తి అక్కడికక్కడే మృతిచెందగా, కుమార్తె సంస్కృతి, ప్రశాంత్‌కుమార్, విజయబిశ్వాలకు గాయాలయ్యాయి. బెలూన్ తెరుచుకోవడంతో సురేష్‌చంద్ర స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లిపోయారు. ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
చీపుర్లపాడు వద్ద ప్రమాద దృశ్యం
Advertisement