‘సుశాంత్‌ని అసలు కలవలేదు’

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మనీల్యాండరింగ్‌ కేసుపై దర్యాప్తులో భాగంగా..

Published : 30 Aug 2020 16:52 IST

డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హోటల్‌ యజమాని

దిల్లీ: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పూత్‌ మనీల్యాండరింగ్‌ కేసుపై దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) పలువురిని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే గోవాలోని ‘ట్యామరిండ్ అండ్‌ కేఫె కోటింగా’ హోటల్‌ యజమాని గౌరవ్‌ ఆర్యను సైతం సోమవారం విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. అయితే సుశాంత్‌ను తానెప్పుడూ కలవలేదని గౌరవ్‌ విలేకర్లతో పేర్కొన్నాడు. ‘నాకు కేసుతో ఎలాంటి సంబంధం లేదు. నేనెప్పుడూ సుశాంత్‌సింగ్‌ను కలవలేదు. రియా చక్రవర్తిని 2017లో కలిశాను’ అని తెలిపాడు. కేసు దర్యాప్తులో భాగంగా మాదకద్రవ్యాల వాడకం తెరపైకి వచ్చింది. డ్రగ్స్‌కు సంబంధించి రియా వాట్సాప్‌ చాట్‌లో గౌరవ్‌ ఆర్య ప్రస్తావన ఉంది. అతడే రియాకు మాదకద్రవ్యాలు సరఫరా చేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. గౌరవ్‌ ఆర్యపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ స్పైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) 1985 చట్టం కింద కేసు నమోదు చేశారు. లాక్‌డౌక్‌ ప్రకటించినప్పటి నుంచి మూసి ఉన్న ఆ హోటల్‌ను సైతం ఈడీ అధికారులు పరిశీలించారు. రియా చక్రవర్తితోపాటు ఆమె సోదరుడు షోవిక్‌, రియా మేనేజర్‌ జయ సాహా, సుశాంత్‌ మాజీ మేనేజర్‌ శ్రుతి మోదీపై బుధవారం ఎన్‌డీపీఎస్‌ కేసు నమోదు చేశారు. 

సుశాంత్‌సింగ్‌ మృతిపై సీబీఐ విచారణ కొనసాగుతోంది. రియా చక్రవర్తి మూడో రోజు దర్యాప్తు సంస్థ ఎదుట హాజరైంది. శుక్రవారం ఆమెను 10 గంటలపాటు విచారించిన సీబీఐ శనివారం 7 గంటలపాటు ప్రశ్నించింది. రియాతోపాటు ఆమె కుటుంబసభ్యులు, సుశాంత్‌ ఇంట్లో పనిచేసే పలువురిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని