Updated : 07 Oct 2021 09:42 IST

వంద సినిమాలు చేయొచ్చు కానీ...

‘‘ఏదో ఒకటి చేయడం నాకు ఇష్టం ఉండదు. కథ బాగుంటేనే సినిమా  చేయాలనుకుంటా. 1985లో దర్శకుడినై 33 సినిమాలే చేశానంటే కారణం అదే’’ అన్నారు సీనియర్‌ దర్శకుడు బి.గోపాల్‌. అగ్ర  కథానాయకులతో సినిమాలు తీసి వరుసగా విజయాలు అందుకున్నారీయన. సీనియర్లతో పాటు... నవతరం కథానాయకులతోనూ సినిమాలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించారు. గోపీచంద్‌ కథానాయకుడిగా ‘ఆరడుగుల బుల్లెట్‌’ తెర  కెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ వివరాలు...

‘‘నాకు వచ్చిన అవకాశాలకి వంద సినిమాలు అవలీలగా చేయొచ్చు. కానీ కథ విషయంలో ఆలోచించే అడుగులు వేస్తుంటా. కథ నచ్చకపోతే సినిమా వద్దనుకుంటా. నిర్మాత మొదలుకొని... కథా   నాయకుడు, పంపిణీదారుడు,   ప్రేక్షకుడు వరకు అందరూ సంతృప్తిగా ఉండాలి. ఆ సినిమాల్నే చేయాలనుకుంటా. ‘ఆరడుగుల బుల్లెట్‌’ తండ్రీ కొడుకుల మధ్య జరిగే కథ. ఆకతాయి కొడుకుని ఓ తండ్రి దూరంగా పెట్టడం, చివరికా కుటుంబం కష్టాల్లో పడేసరికి ఆ కొడుకే వచ్చి కాపాడటం ఈ సినిమా ప్రత్యేకత. చాలా మంది ట్రైలర్‌ చూసి ‘చాలా బాగుంది. మళ్లీ బి.గోపాల్‌ కనిపించార’ని మెచ్చుకున్నారు. వక్కంతం వంశీ రాసిన కథ, అబ్బూరి రవి మాటలు, గోపీచంద్‌ నటన... ఇలా ఇందులోని ప్రతీ అంశం ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’.

* ‘‘ఎవరి ప్రయాణాన్నయినా జయాపజయాలే ప్రభావితం చేస్తాయి. దర్శకుడిగా నాకు చాలా విరామం రావడానికి కారణం అదే. మధ్యలో కొన్ని అనుకున్నాం కానీ కుదరలేదు. కథ కుదిరితే ఒకేసారి రెండు సినిమాలు చేయడానికి నాకు ఇబ్బందేమీ ఉండదు. నా కెరీర్‌లో మూడుసార్లు ఒకేసారి రెండు సినిమాలు చొప్పున చేశా. ‘విజయ్‌’ - స్టేట్‌రౌడీ’, ‘లారీ డ్రైవర్‌ - బొబ్బిలిరాజా’, ‘ఇంద్ర’ - ‘అల్లరి రాముడు’... ఇలా ఇవన్నీ ఒకేసారి చేసిన సినిమాలే. నేను రచయితని కాను. వేరొకరి కథలతోనే సినిమాలు చేస్తుంటా. కొత్తతరం రచయితలతో కలిసి ప్రయాణం చేస్తుంటాను కాబట్టి... ట్రెండ్‌కి దగ్గరగానే ఉంటాను. స్క్రిప్ట్‌ బాగుంటే మాస్‌ కథలు సూపర్‌హిట్‌ అవుతాయి’’.

* ‘‘ఫ్యాక్షన్‌ కథలతో ప్రయాణం చేయాలని నేను ముందు అనుకుని చేసిన సినిమాలు కాదు. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహానాయుడు’, ‘ఇంద్ర’ సినిమాల కథలు నా దగ్గరికొచ్చే వరకు అవి ఫ్యాక్షన్‌ కథలని నాకు తెలియదు. మళ్లీ ఎవరైనా కథ చెబితే ఫ్యాక్షన్‌  నేపథ్యంలో సినిమా చేయడానికి సిద్ధమే. స్క్రిప్ట్‌, హీరోల ఇమేజ్‌లను బట్టి నా సినిమాల ప్రయాణం సాగుతుంటుంది. రీమేక్‌లంటే ఇష్టం ఉండదు. అందుకే ‘అసెంబ్లీరౌడీ’, ‘బ్రహ్మ’లాంటి ఒకట్రెండు రీమేక్‌లే చేశా. ఇటీవల బాలకృష్ణ కోసం కథలు సిద్ధం చేస్తున్నాం. బుర్రా సాయిమాధవ్‌, చిన్నికృష్ణ కథలు చెప్పారు. బాలకృష్ణతో ఇదివరకే ఓ సినిమాని మొదలుపెట్టాం కానీ అది పూర్తి కాలేదు’’.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts