Malli Pelli: నరేశ్‌- పవిత్రల ‘మళ్లీపెళ్లి’.. కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి

నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ ప్రధాన పాత్రల్లో ఎం.ఎస్‌. రాజు తెరకెక్కించిన చిత్రం ‘మళ్లీపెళ్లి’. ఈ సినిమా విడుదల ఆపాలంటూ నరేశ్‌ భార్య రమ్య రఘుపతి కోర్టును ఆశ్రయించారు.

Updated : 25 May 2023 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మే 26న విడుదలకాబోతున్న ‘మళ్లీపెళ్లి’ (malli pelli) సినిమా విడుదలను ఆపాలంటూ నరేశ్‌ (naresh) భార్య రమ్య రఘుపతి (ramya raghupathi) న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ చిత్రంలోని సన్నివేశాలు తనని కించపరిచేలా ఉన్నాయని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. సినిమా విడుదలకు కొన్ని గంటలే సమయం ఉండడంతో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అంతటా ఆసక్తి నెలకొంది.

మరోవైపు ఈ సినిమాపై నరేష్‌, పవిత్రా లోకేశ్‌లో ఓ టెలివిజన్ వేదికగా సినిమాపై తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నాం. దాంతో కొన్ని ఊహాగానాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత అన్ని విషయాలు మేం పంచుకున్నాం. మన లైఫ్‌ కోసం మనం పోరాడుతున్నాం. ఈ ప్రపంచంలో లక్షల మంది దంపతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వాళ్లలో మేము (నరేష్‌-పవిత్ర) కూడా ఉన్నాం. సమాజానికి భయపడి బతకడం సరికాదు. అందుకే ఈ సినిమా చేయాలనుకున్నాం. ఇదొక ప్రయోగాత్మక చిత్రం. చాలా సన్నివేశాలు మా జీవితానికి దగ్గర ఉంటాయి. సెలబ్రిటీ కపుల్‌ ద్వారా చెబితే మరింత ప్రభావంగా ఉంటుందని దర్శకుడు ఎం.ఎస్‌.రాజు అభిప్రాయపడ్డారు. అందుకు మేము కూడా అంగీకరించాం. అయితే, ‘తప్పు మాది కాదు ఫలానా వాళ్లు చేశారు’ అని మేము చెప్పాలనుకోవడం లేదు. అలా అనుకుంటే, మీడియా ముందుకు వచ్చి చెబుతాం. సినిమాగా తీయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం చేసింది మాత్రమే. అదే సమయంలో లక్షల మంది భావోద్వేగాలను కూడా పరిగణనలోకి తీసుకున్నాం’’ అని నరేష్‌, పవిత్రా లోకేశ్‌ అన్నారు.

నరేశ్‌, పవిత్ర లోకేశ్‌ (Pavitra Lokesh) ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఎం.ఎస్‌. రాజు (ms raju) తెరకెక్కించిన చిత్రమిది. జయసుధ, శరత్‌బాబు, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నరేశ్‌, రమ్య రఘుపతికి మధ్య మనస్పర్థలు తలెత్తిన సంగతి తెలిసిందే. అదే సమయంలో నరేశ్‌.. పవిత్రతో చనువుగా ఉండడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో నరేశ్‌ ‘మళ్లీపెళ్లి’ అంటూ సినిమాని ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాల ఇతివృత్తంగా ఈ సినిమాని తెరకెక్కించి ఉంటారని అనేకమంది భావించారు. ఇటీవల విడుదలైన టీజర్‌, ట్రైలర్లు చూసిన వారూ అదే అనుకున్నారు. అయితే, అది నరేశ్‌ లైఫ్‌ స్టోరీ కాదని, సినిమా చూస్తే అసలు విషయం అర్థమవుతుందని దర్శకుడు ఇటీవల ఓ సందర్భంలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని