Adipurush: ఆగని ‘ఆదిపురుష్‌’డి వివాదాలు

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్‌’ వివాదాల్లో చిక్కుకుంది. ఆదివారం విడుదలైన ఆ సినిమా టీజర్‌లో పాత్రలు కనిపించిన విధానమే అందుకు కారణం. సినిమాలో హనుమంతుడి పాత్రని చిత్రీకరించిన విధానం, రావణుడి వేషధారణపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

Updated : 05 Oct 2022 07:13 IST

రామాయణం ఆధారంగా రూపొందుతున్న ‘ఆదిపురుష్‌’ (Adipurush) వివాదాల్లో చిక్కుకుంది. ఆదివారం విడుదలైన ఆ సినిమా టీజర్‌లో పాత్రలు కనిపించిన విధానమే అందుకు కారణం. సినిమాలో హనుమంతుడి పాత్రని చిత్రీకరించిన విధానం, రావణుడి వేషధారణపై విమర్శలు వ్యక్తమయ్యాయి. మీసాలు లేకుండా కేవలం గడ్డం, తోలు వస్త్రంతో హనుమంతుడి పాత్రని చూపించడం... లంకేశ్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ కనిపిస్తున్న తీరుపైనా సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా భోపాల్‌లో నగరంలో మంగళవారం సమావేశం నిర్వహిస్తూ చిత్రబృందాన్ని హెచ్చరించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. హిందూ పురాణ పురుషుల్ని తప్పుగా చూపించే సన్నివేశాల్ని తొలగించకపోతే చట్టపరమైన చర్చలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ‘ఆదిపురుష్‌’ టీజర్‌లో అభ్యంతరకమైన సన్నివేశాలున్నాయని, ఇవి మతపరంగా కొందరి మనోభావాల్ని దెబ్బతీసే సన్నివేశాలని, వాటిని తొలగించాలని కోరుతూ దర్శకుడికి లేఖ రాస్తున్నట్టు చెప్పారు. ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. కృతిసనన్‌ కథానాయిక. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్‌ ఆదివారం అయోధ్యలో విడుదలైన విషయం తెలిసిందే. మరోవైపు ఈ సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌తో తమకెలాంటి సంబంధం లేదని అజయ్‌ దేవ్‌గణ్‌కి చెందిన వీఎఫ్‌ఎక్స్‌ వాలా ప్రకటించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని