Bhagavanth kesari: భగవంత్‌ కేసరి భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రం

‘‘భగవంత్‌ కేసరి’ ఒక విస్పోటనంతో పుట్టింది. ప్రతి మహిళ తనని తాను తర్ఫీదు చేసుకొని ఒక సైనికుడిలా తయారవ్వాలన్న సందేశం ఈ సినిమాతో ప్రేక్షకుల్లోకి వెళ్లింది’’ అన్నారు నందమూరి బాలకృష్ణ.

Updated : 25 Oct 2023 13:25 IST

‘‘భగవంత్‌ కేసరి’ ఒక విస్పోటనంతో పుట్టింది. ప్రతి మహిళ తనని తాను తర్ఫీదు చేసుకొని ఒక సైనికుడిలా తయారవ్వాలన్న సందేశం ఈ సినిమాతో ప్రేక్షకుల్లోకి వెళ్లింది’’ అన్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు. కాజల్‌ కథానాయిక. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్‌లో బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌ వేడుకను నిర్వహించింది. ఇందులో దిల్‌రాజు, నందిని రెడ్డి అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘భారతీయ చిత్ర పరిశ్రమలో శాశ్వతంగా నిలిచిపోయే చిత్రాలు చాలా అరుదుగా ఉంటాయి. వాటిలో ఒకటిగా ‘భగవంత్‌ కేసరి’ని నిలిపినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. ఆడపిల్లను సింహంలా పెంచాలనే గొప్ప సందేశంతో ఈ చిత్రం చేయడం సంతోషంగా ఉంది. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని తెలుగువారు తీశారని దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. ఈ సినిమాతో ఓ మంచి సందేశం ప్రేక్షకుల్లోకి వెళ్లింది. కుటుంబాలు తమ పిల్లల్ని తీసుకెళ్లి థియేటర్లలో సినిమా చూపిస్తున్నారు. ఇంత అద్భుతమైన చిత్రాన్ని తీసిన దర్శకుడు అనిల్‌ను అభినందిస్తున్నా. ఏదైనా విస్పోటనం జరిగినప్పుడే ఇలాంటి అద్భుతాలు వస్తాయి. దీంట్లోని పోరాట సన్నివేశాలకు థియేటర్లలో ప్రేక్షకులు లేచి చప్పట్లు కొడుతున్నారు. ఈ విజయం సమష్ఠి కృషికి ఫలితం. ఈ సినిమా కోసం ‘దంచవేమేనత్త కూతురా’ పాటను రీమిక్స్‌ చేశాం. ఇప్పుడా పాటను అభిమానులు, ప్రేక్షకుల కోరిక మేరకు సినిమాలో యాడ్‌ చేస్తున్నాం’’ అన్నారు. ‘‘తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి కుటుంబం థియేటర్‌కు వెళ్లి ఈ సినిమా చూస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా లాంగ్‌ రన్‌ ఉంది. ఈ చిత్ర విజయం వెనకున్న పెద్ద శక్తి మా బాలకృష్ణ. ఆయన నిరంతర విద్యార్థి. తనతో ఈ ప్రయాణం ఇలాగే కొనసాగాలని అనుకుంటున్నా’’ అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. నటుడు అర్జున్‌ రాంపాల్‌ మాట్లాడుతూ.. ‘‘నేనిప్పటి వరకు 46చిత్రాల్లో పని చేశాను. కానీ, ఏ చిత్రానికీ చూడని ప్రేమ.. ఆప్యాయతను ఈ సినిమాకి చూశాను. ఇందులో నేను భాగమవడం ఆనందంగా ఉంద’’న్నారు. ‘‘వినోదాత్మక సినిమాలు తీసే అనిల్‌ ఇలాంటి బలమైన కథ రాసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. తనలో చాలా సామర్థ్యం ఉంది. ఈ సినిమాని తప్పకుండా ప్రతి తెలుగు కుటుంబం చూస్తుంది’’ అన్నారు నిర్మాత దిల్‌రాజు. ఈ కార్యక్రమంలో తమన్‌, సాహు, హరీష్‌, శ్రీలీల, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని