Bhagavanth Kesari: ఆడపిల్లను సింహంలా పెంచాలనే సందేశం జనాల్లోకి వెళ్లింది

‘భగవంత్‌ కేసరి’గా థియేటర్లలో సందడి చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు.

Updated : 21 Oct 2023 13:34 IST

అనిల్‌ రావిపూడి

‘భగవంత్‌ కేసరి’గా థియేటర్లలో సందడి చేస్తున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అనిల్‌ రావిపూడి తెరకెక్కించారు. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మించారు. కాజల్‌ కథానాయిక. శ్రీలీల, అర్జున్‌ రాంపాల్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం బ్లాక్‌బస్టర్‌ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా షానా ఏండ్లు యాదుంటద’ని ప్రతి ప్రచార కార్యక్రమంలో చెబుతూ వచ్చాం. దాన్ని ఈరోజు నిజం చేశారు. చాలా సంతోషంగా ఉంది. నేనిప్పటి వరకు ఆరు సినిమాలు తీశాను. కానీ, ఈ చిత్రం దర్శకుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చింది. ఈ సినిమా గురించి అందరూ సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటున్నారు. భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన బలం. విజయానికి కారణం. ఇంట్లో ఓ తండ్రికి బిడ్డకు మధ్య ఉండాల్సిన అందమైన భావోద్వేగానికి అందరూ కనెక్ట్‌ అయ్యారు. ఆడపిల్లను సింహంలా పెంచాలనే మంచి సందేశం జనాల్లోకి వెళ్లింది. బాలకృష్ణ అద్భుతమైన నటన గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఆయన ఈ అవకాశం ఇవ్వకపోతే ఈ రోజు నేనిలా నిరూపించుకునే వాడిని కాదు. అలాగే విజ్జి పాప పాత్రను శ్రీలీల అద్భుతంగా చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ కోసం ఆమె ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని నటించింది. ఈ దసరాకు మాకింత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ‘‘ఇంత గొప్ప కథ మా బ్యానర్‌కు ఇచ్చినందుకు అనిల్‌ రావిపూడికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. సినిమాపై మేము పెట్టుకున్న నమ్మకాలు నిజమయ్యాయి’’ అన్నారు నిర్మాత సాహు గారపాటి. నటి శ్రీలీల మాట్లాడుతూ.. ‘‘విజ్జి పాప లాంటి గొప్ప పాత్రను నాకిచ్చినందుకు దర్శకుడు అనిల్‌కు కృతజ్ఞతలు. బాలకృష్ణ సినిమాలో ఓ అమ్మాయికి ఫైట్‌ చేసే అవకాశమివ్వడం మామూలు విషయం కాదు. ఈ చిత్రంలోని సందేశానికి ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అయ్యారు. సినిమాలోని గుడ్‌ టచ్‌.. బ్యాడ్‌ టచ్‌ సీన్‌లో మంచి సందేశముంది. దాన్ని ప్రతి స్కూల్‌లో చూపించాలి’’ అంది. ఈ కార్యక్రమంలో అనంత శ్రీరామ్‌, రామజోగయ్య శాస్త్రి, వెంకట్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని