Bubblegum Review: రివ్యూ: రాజీవ్‌ కనకాల, సుమ తనయుడి బ‌బుల్‌గ‌మ్‌ మూవీ మెప్పించిందా?

bubblegum movie review in telugu: రోషన్‌, మానస కీలక పాత్రల్లో రవికాంత్‌ పేరెపు దర్శకత్వంలో రూపొందిన ‘బబుల్‌గమ్‌’ మూవీ ఎలా ఉంది?

Updated : 29 Dec 2023 12:31 IST

Bubblegum movie review in telugu; చిత్రం: బ‌బుల్‌గ‌మ్‌; న‌టీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు; సంగీతం: శ్రీచరణ్ పాకాల; ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ రగుతు; కథ: రవికాంత్ పేరెపు, విష్ణు కొండూరు, సెరి-గన్ని; దర్శకత్వం: రవికాంత్ పేరేపు; నిర్మాణ సంస్థ‌లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ; విడుద‌ల తేదీ: 29-12-2023

రాజీవ్ క‌న‌కాల, సుమ దంప‌తుల త‌న‌యుడు రోష‌న్ హీరోగా తెర‌కు ప‌రిచ‌యమైన చిత్రం ‘బబుల్‌ గమ్‌’. ‘క్ష‌ణం’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’తో ఆక‌ట్టుకున్న ర‌వికాంత్ పేరేపు దర్శకుడు. చిరంజీవి, రాజ‌మౌళి, వెంక‌టేష్ వంటి ప్ర‌ముఖ తార‌లు ఈ చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం.. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు యువ‌త‌రాన్ని ఆకర్షించేలా ఉండ‌టంతో సినిమాపై కాస్త అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం అందుకుందా?(bubblegum movie review in telugu) హీరోగా రోష‌న్ తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకున్నాడా?

క‌థేంటంటే: ఆది అలియాస్ ఆదిత్య (రోష‌న్ క‌న‌కాల‌) హైద‌రాబాద్‌కు చెందిన ఓ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుర్రాడు. డీజే అవ్వాల‌న్న ల‌క్ష్యంతో జీవిస్తుంటాడు.  ఓ పార్టీలో జాను అలియాస్ జాన్వీ (మాన‌స చౌద‌రి)ని చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. ఆమె చాలా పెద్దింటి అమ్మాయి. ఆధునిక జీవ‌న శైలికి అల‌వాటు ప‌డిన ఆమెకు ప్రేమ‌, పెళ్లి వంటి ఎమోష‌న్స్‌పై అంత‌గా న‌మ్మ‌కం ఉండ‌దు. అబ్బాయిల్ని ఓ టాయ్‌లా చూసే త‌ను.. మొద‌ట్లో ఆది డీజే ప్లే చేసే తీరు న‌చ్చి ఇష్ట‌ప‌డుతుంది. ఆ త‌ర్వాత అత‌ని వ్య‌క్తిత్వం న‌చ్చి మ‌రింత స‌న్నిహితంగా మెలుగుతుంది. ఈ క్ర‌మంలో తెలియ‌కుండానే ఆదితో ప్రేమ‌లో ప‌డిపోతుంది. అయితే ఓ పార్టీలో జాను ఫ్రెండ్ చేసిన ఓ తొంద‌ర పాటు ప‌ని వాళ్లిద్ద‌రి మ‌ధ్య చిచ్చు రేపుతుంది. అంతేకాదు ఆ వేడుక‌లో అంద‌రి ముందు ఆదిని దారుణంగా అవ‌మానిస్తుంది జాను. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది? జాను చేసిన ఆ అవ‌మానాన్ని ఆది ఎలా తీసుకున్నాడు? రెండు భిన్న నేపథ్యాలు క‌లిగిన వీరి ప్రేమ ఆఖ‌రికి ఏ కంచికి చేరింది?డీజే అవ్వాల‌న్న త‌న ల‌క్ష్యాన్ని ఆది చేరుకున్నాడా?  లేదా? అన్న‌ది మిగ‌తా క‌థ‌.

ఎలా సాగిందంటే: ఇది పూర్తిగా యువ‌త‌రం ల‌క్ష్యంగా రూపొందించిన చిత్రం. దీంట్లోని క‌థా నేప‌థ్యం కూడా కొత్త‌దేమీ కాదు. విరామ స‌న్నివేశాలు,  క్లైమాక్స్ మిన‌హా మిగ‌తా క‌థ‌న‌మంతా చాలా రొటీన్‌గా ఉంటుంది. హీరో డీజే నేప‌థ్యం.. అత‌ని కుటుంబ వాతావ‌ర‌ణం.. వంటివి చూస్తే ఆరంభంలో దీంట్లో డీజే టిల్లు ఛాయలు క‌నిపిస్తాయి.  ఓ చిన్న ఇంట్ర‌డ‌క్ష‌న్ ఫైట్‌తో హీరో ప‌రిచ‌యం అయిన తీరు ఫ‌ర్వాలేద‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత అత‌ని కుటుంబ నేప‌థ్యాన్ని.. ఫ్రెండ్స్ గ్యాంగ్‌ను ప‌రిచయం చేస్తూ నెమ్మ‌దిగా సినిమాని ముందుకు తీసుకెళ్లారు ద‌ర్శ‌కుడు. (bubblegum movie review in telugu) జాను - ఆదిల ప‌రిచ‌యం.. వాళ్లిద్ద‌రూ ద‌గ్గ‌ర‌వ‌డం.. ఒక‌రిపై ఒక‌రు ఇష్టాన్ని పెంచుకోవ‌డం.. ఈ ట్రాక్‌లో పెద్దగా ఎమోష‌న్స్ క‌నిపించ‌వు. వీరి మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలు యువతకు బాగా నచ్చుతాయి. కేవ‌లం యువ‌త‌రాన్ని ఆక‌ర్షించ‌డానికే ఈ ట్రాక్ ఉప‌యోగ‌ప‌డొచ్చేమో కానీ, మిగ‌తా ప్రేక్ష‌కుల‌కు విరామ స‌న్నివేశాలు మాత్రం చాలా కొత్త‌గా ద్వితీయార్ధంపై ఆస‌క్తిరేకెత్తించేలా చేస్తాయి.

ప్రేమికురాలి చేతిలో దారుణ అవ‌మానం త‌ర్వాత క‌సితో ఆది త‌న ల‌క్ష్యం దిశ‌గా అడుగులేసే తీరు మెప్పిస్తుంది. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఇజ్జ‌త్ గీతం ఆక‌ట్టుకుంటుంది. జీవితంలో ఎదుర‌య్యే స‌వాళ్ల‌కు త‌ల‌వొంచ‌ద్దంటూ.. డ‌బ్బు సంపాదించ‌డంలో కిక్ ఉందంటూ ఆదికి త‌న తండ్రి అందించే స్ఫూర్తి  మ‌న‌సుల‌కు హ‌త్తుకుంటుంది. నిజానికి ద్వితీయార్ధంలో తండ్రీకొడుకుల అనుబంధాల నేప‌థ్యంలో వ‌చ్చే ప్ర‌తి సీన్ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంది. ఇక ప్ర‌థమార్ధంలో గ్లామ‌ర్ డాల్‌గా క‌నిపించిన క‌థానాయిక పాత్ర ద్వితీయార్ధంలో న‌ట‌నా ప్రాధాన్య‌మున్న పాత్ర‌లా మారిపోతుంది. (Bubblegum movie review) త‌న త‌ప్పు తెలుసుకొని ఆది ప్రేమ కోసం జాను ఆరాటప‌డ‌టం.. ఈ క్ర‌మంలో ఆది ఇంటికెళ్లి అత‌ను మ‌న‌సు గెలుచుకునేందుకు చేసే ప్ర‌య‌త్నాలు జస్ట్‌ ఓకే. ఒకానొక ద‌శ‌లో ద్వితీయార్ధంలో క‌థ‌ను మొత్తం జానునే ముందుకు న‌డిపిస్తుంది. ప‌తాక స‌న్నివేశాల్ని ద‌ర్శ‌కుడు కొత్త‌గా మ‌లుచుకున్నాడు. ముగింపు యువ‌త‌కు ఓ చిన్న సందేశ‌మిచ్చేలా ఉంటుంది. అయితే దాన్ని వాళ్లు ఎలా స్వీక‌రిస్తార‌న్న దాన్ని బ‌ట్టి ఫ‌లితం ఆధార‌ప‌డి ఉంటుంది.

ఎవ‌రెలా చేశారంటే: ప‌క్కా హైద‌రాబాదీ కుర్రాడిగా ఆది పాత్ర‌లో రోష‌న్ చ‌క్క‌గా ఒదిగిపోయాడు. అత‌ని లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అన్నీ బాగున్నాయి. భావోద్వేగ‌భ‌రిత స‌న్నివేశాల్లోనూ చ‌క్క‌టి న‌ట‌న క‌న‌బ‌రిచాడు.  జాన్వీగా మానస చౌదరి ఇటు అందంతోనూ అటు అభిన‌యంతోనూ ఆకట్టుకుంది. కొన్ని రొమాంటిక్ స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కుల్ని హీటెక్కించే ప్ర‌య‌త్నం చేసింది. హీరో తండ్రిగా చైతూ జొన్న‌ల‌గ‌డ్డ పాత్ర అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. ద్వితీయార్ధానికి ఈ పాత్ర ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. బుబుల్‌గ‌మ్ పేరుకు త‌గ్గ‌ట్లుగా ప్ర‌థమార్ధ‌మంతా సాగ‌తీత వ్య‌వ‌హారంలా ఉంటుంది. (Bubblegum movie review)  ద్వితీయార్ధం మాత్రం కాసిన్ని న‌వ్వుల‌తో.. ఇంకొంచెం భావోద్వేగాల‌తో క‌ట్టిప‌డేస్తుంది. యువ‌త‌రాన్ని ఆక‌ర్షించాల‌నే ప్ర‌య‌త్నంలో క‌థ‌లో బూతులు ఎక్కువ వాడేశార‌నిపిస్తుంది. అలాగే ద‌ర్శ‌కుడు త‌ను చెప్పాల‌నుకున్న విష‌యాన్ని స్ప‌ష్టంగా చెప్ప‌లేక‌పోయార‌నిపిస్తుంది. అయితే కొత్త న‌టీన‌టుల నుంచి మంచి న‌ట‌న రాబ‌ట్టుకోవ‌డంలో పైచేయి సాధించాడు. శ్రీచ‌ర‌ణ్‌ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. సురేష్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌లు క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా ఉన్నాయి.

  • బ‌లాలు
  • + రోష‌న్, మాన‌స‌ న‌ట‌న‌..
  • + తండ్రీ కొడుకుల ట్రాక్‌
  • +  ద్వితీయార్ధంలోని డ్రామా.. ముగింపు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ‌నం
  • ప్ర‌థమార్ధం
  • చివ‌రిగా: బ‌బుల్‌గ‌మ్‌.. మొద‌ట్లో చ‌ప్ప‌గా.. ఆఖ‌ర్లో కాస్త తియ్య‌గా..(Bubblegum movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని