Changure Bangaru Raja Review: రివ్యూ: ఛాంగురే బంగారురాజా

Changure Bangaru Raja Movie Review: కార్తీక్‌ రత్నం కీలక పాత్రలో రవితేజ నిర్మించిన ఛాంగురే బంగారు రాజా మూవీ ఎలా ఉందంటే?

Updated : 15 Sep 2023 13:54 IST

changure bangaru raja review| చిత్రం: ఛాంగురే బంగారురాజా; నటీనటులు: కార్తీక్‌ రత్నం, గోల్డై నిస్సీ,  సత్య, రవిబాబు, సునీల్‌ (వాయిస్‌), అజయ్‌, వాసు ఇంటూరి తదితరులు; సంగీతం: కృష్ణ సౌరభ్‌; సినిమాటోగ్రఫీ: సుందర్‌ ఎన్‌సీ; ఎడిటింగ్‌: కార్తీక్‌ ఉన్నవ; నిర్మాత: రవి తేజ, శ్వేత కర్లపూడి, షాలిని నంబు; రచన, దర్శకత్వం: సతీష్‌వర్మ; విడుదల: 15-09-2023

క‌థానాయ‌కుల్లో చాలా మందికి సొంత నిర్మాణ సంస్థ‌లు ఉన్నాయి. ఎవ‌రి అభిరుచుల‌కి త‌గ్గ‌ట్టుగా వాళ్లు సినిమాల్ని నిర్మిస్తుంటారు. చాలామంది ప‌రిమిత వ్య‌యంతో రూపొందే సినిమాల్ని నిర్మించ‌డానికే మొగ్గు చూపుతుంటారు. కొత్త క‌థ‌లు, కొత్త‌త‌రం వెలుగులోకి వ‌చ్చేది ఇలాంటి సినిమాల‌తోనే. ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ర‌వితేజ కూడా ఈ మ‌ధ్య త‌న ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్ ప‌తాకంపై వ‌రుస‌గా సినిమాలు నిర్మిస్తున్నారు. (changure bangaru raja movie review) ‘మ‌ట్టికుస్తీ’ త‌ర్వాత ఆయ‌న నిర్మాణంలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మ‌రో చిత్రం... ‘ఛాంగురే బంగారురాజా’. ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’ ఫేమ్ కార్తీక్ ర‌త్నం క‌థానాయ‌కుడిగా న‌టించగా, స‌తీశ్ వ‌ర్మ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమయ్యారు. ప్ర‌చార చిత్రాల‌తో ఆస‌క్తి రేకెత్తించిన ఈ సినిమా ఎలా ఉంది?

క‌థేంటంటే: బంగార్రాజు (కార్తీక‌ర‌త్నం) ఊళ్లో మోట‌ర్ సైకిల్ మెకానిక్. ఎవ‌రికీ భ‌య‌ప‌డని నైజం. త‌ల్లిదండ్రులు లేక‌పోవ‌డంతో పెద్ద‌లు సంపాదించిన కొద్దిపాటి పొలాన్ని చూసుకుంటూ గ‌డిపేస్తుంటాడు. ఆ ఊరు రంగురాళ్ల‌కి ప్ర‌సిద్ధి. వర్షం కురిస్తే చాలు...  ఊరు ఊరంతా రంగురాళ్ల వేట‌కి వెళ్తుంది. అక్క‌డ బంగార్రాజుతో గొడ‌వ‌ప‌డిన ఓ అబ్బాయి మ‌రుస‌టిరోజు హ‌త్య‌కి గుర‌వుతాడు. ఆ హ‌త్య కేసు బంగార్రాజుపై ప‌డుతుంది. నిజంగా ఆ హ‌త్య‌ని బంగార్రాజే చేశాడా?తాతారావు (స‌త్య‌), గాటీలు (ర‌విబాబు)కి ఆ హ‌త్య‌తో ఎలాంటి సంబంధం ఉంది? కానిస్టేబుల్ మ‌ంగ‌ర‌త్నం (గోల్డీ నిస్సీ)కీ, బంగార్రాజుకీ మ‌ధ్య‌నున్న సంబంధమేమిటి? త‌దిత‌ర విష‌యాల్ని తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ఒక హ‌త్య వెన‌క మిస్ట‌రీ చుట్టూ సాగే క‌థ ఇది. నాలుగు కోణాల్ని ఆవిష్క‌రిస్తూ క‌థ‌ని న‌డిపించారు. త‌న‌పై మోపిన నేరం వెనుక వాస్త‌వాల్ని నిగ్గు తేల్చాల‌నుకున్న ఓ యువ‌కుడు ఏం చేశాడ‌నేది ఇందులో కీల‌కం. ఇలాంటి క‌థ‌లు తెలుగు తెర‌పైకి త‌ర‌చూ వ‌స్తూనే ఉంటాయి. (changure bangaru raja movie review) నేరం ఎవ‌రు చేశారనే విష‌యంపై ర‌క‌ర‌కాల అనుమానాల్ని రేకెత్తించి చివ‌రికి ఏది నిజ‌మో అస‌లు గుట్టుని బ‌య‌ట పెడుతుంటారు. ఆ క్ర‌మంలో ప్రేక్ష‌కుడిని ఎంత థ్రిల్ చేశారు?ఏ మేర‌కు వినోదం పంచార‌నే విష‌యంపైనే స‌ద‌రు సినిమా ఫ‌లితం ఆధార‌ప‌డుతుంది. ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడి వ్యూహం ఏమిటో మ‌రీ.. ఓ సంఘ‌ట‌న, మూడు కోణాలు, అస‌లు వాస్త‌వం అంటూ ముందే గుట్టు విప్పేసి ఒక్కొక్క ఛాప్ట‌ర్‌ని పాఠంలా చెప్ప‌డం మొద‌లుపెడ‌తాడు. ఆ ఛాప్ట‌ర్లైనా కొత్త‌గా ఉన్నాయా అంటే అన్ని ఛాప్ట‌ర్ల‌లోనూ అదే క‌థే. 

మూడు ఛాప్ట‌ర్ల‌లో కాకుండా చివ‌ర్లోనే వాస్త‌వం ఉంద‌ని ముందే ప్రేక్ష‌కుడిని సిద్ధం చేసిన ద‌ర్శ‌కుడు...  ఆ ఛాప్ట‌ర్ల‌నీ రిపీటెడ్ స‌న్నివేశాల‌తో మ‌ల‌చ‌డంతో సినిమా అంతా సాగ‌దీతే అయిపోయింది. ఒక్క‌టంటే ఒక్క స‌న్నివేశం ప్ర‌భావం చూపించ‌దు. క్లైమాక్స్‌కి  ముందు మొద‌ల‌య్యే ఛేజింగ్‌తో సినిమాని ఇంకా లాగిన‌ట్టు అనిపిస్తుంది. (changure bangaru raja movie review in telugu) కామెడీకి, సెంటిమెంట్‌కీ,  ఉత్కంఠ‌కి ఆస్కారం ఉన్న క‌థే అయినా ర‌చ‌న‌లో ప‌స లేక‌పోవ‌డంతో స‌న్నివేశాల‌న్నీ చ‌ప్ప‌గా సాగిపోతుంటాయి. ప‌దే ప‌దే స‌న్నివేశాలు రిపీట్ అవుతూనే ఉంటాయి. స‌త్య, ర‌విబాబు ల‌వ్ ట్రాక్‌లతోపాటు...  సునీల్ వాయిస్‌తో వినిపించే కుక్క స‌న్నివేశాలు అక్క‌డ‌క్క‌డా మెప్పించినా క‌డుపుబ్బా న‌వ్వుకునే సంద‌ర్భం సినిమాలో ఒక్క‌టీ లేదు. క‌థ‌, క‌థనాల్లో కొత్త‌ద‌నం కొర‌వ‌డిన సినిమా ఇది. రంగురాళ్ల నేప‌థ్యం మాత్రమే కాస్త కొత్తగా అనిపిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: కార్తీక్ ర‌త్నం మంచి న‌టుడు. ‘కేరాఫ్ కంచ‌ర‌పాలెం’, ‘నార‌ప్ప‌’ త‌దిత‌ర సినిమాలు ఆ విష‌యాన్ని చాటిచెప్పాయి. పాత్ర‌లో బ‌లం లేక‌పోతే  ఎంత మంచి న‌టుడైనా ఏమీ చేయ‌లేడ‌ని ఈ సినిమా చాటుతుంది. అన్యాయంగా నేరాన్ని మోపినా  పాత్ర‌పై ఎక్క‌డా సింప‌థీ క‌ల‌గ‌దు. ప్రేమ స‌న్నివేశాల్లోనూ బ‌లం లేదు. స‌త్య‌, ర‌విబాబు అనుభ‌వాన్నంతా రంగ‌రించి టైమింగ్‌ని ప్ర‌దర్శించినా పెద్దగా ఫ‌లితం క‌నిపించ‌దు. కానిస్టేబుల్ మంగ‌ర‌త్నం పాత్ర‌లో గోల్డీనిస్సీ, స‌త్య ల‌వ్ ఇంట్రెస్ట్‌గా నిత్య‌శ్రీ, ర‌విబాబు మ‌న‌సు దోచిన వ‌రం పాత్ర‌లో ఎస్తేర్ ప‌ర్వాలేద‌నిపించారు. ఎస్సైగా న‌టించిన అజ‌య్ పాత్ర‌లో బ‌లం లేదు. సాంకేతిక విభాగాల్లో కెమెరా విభాగానికి మంచి మార్కులు ప‌డ‌తాయి. సంగీతం ఓకే. ఎడిటింగ్ విభాగం చేయాల్సిన ప‌ని ఇంకా చాలా ఉంద‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు  కొత్త నేప‌థ్యంలో కథ చెప్పాడు కానీ, ఆస‌క్తిక‌రంగా మాత్రం చెప్ప‌లేక‌పోయారు. ర‌చ‌న‌లో బ‌లం లేదు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది.

  • బ‌లాలు
  • + అక్క‌డ‌క్క‌డా హాస్యం
  • + రంగురాళ్ల నేప‌థ్యం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ
  • - ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌నం
  • - సాగ‌దీత‌గా స‌న్నివేశాలు
  • చివ‌రిగా: ఛాంగురే బంగారురాజా... ఆక‌ట్టుకోదు రాజా (changure bangaru raja movie review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు