Dileep Kumar: ఆయన మరణంతో ఓ శకం ముగిసింది

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌(98) మరణవార్తతో సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసినట్లు అయ్యిందని సినిమాలోకం సంతాపం ప్రకటించింది. తన నటనతో కొన్ని సంవత్సరాలపాటు సినీ సామ్రాజ్యాన్ని ఏలిన దిలీప్‌కుమార్‌ బుధవారం...

Updated : 07 Jul 2021 14:11 IST

దిలీప్‌ మృతిపట్ల సంతాపం ప్రకటించిన సినీ తారలు

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌(98) మరణవార్తతో సినీ పరిశ్రమలో ఓ శకం ముగిసినట్లు అయ్యిందని తారలు సంతాపం ప్రకటించారు. తన నటనతో కొన్ని సంవత్సరాలపాటు సినీ సామ్రాజ్యాన్ని ఏలిన ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ వార్త విని సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయ్యింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ ప్రధానితోపాటు పలువురు సినీ తారలు సోషల్‌మీడియా వేదికగా ట్వీట్లు చేశారు.

‘సినీ రంగంపై తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి దిలీప్‌కుమార్‌. తన నటనతో విదేశాల్లో సైతం ఎంతోమంది అభిమానుల్ని ఆయన సొంతం చేసుకున్నారు. ఆయన మరణంతో సినీ రంగంలో ఓ శకం ముగిసిపోయింది. భారతీయుల హృదయాల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి ఉంటారు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ - రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌.

‘సినీ పరిశ్రమలో లెజెండ్‌గా దిలీప్‌కుమార్‌ ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారు. ఆయనలోని నటనాకౌశలం, తేజస్సు ఎన్నో సంవత్సరాలపాటు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆయన మరణం సినీ లోకానికి, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ - నరేంద్రమోదీ

‘భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన దిలీప్‌కుమార్‌ మృతితో సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసింది. ఆయన ఒక సినీ సంస్థ, సినీ సంపద. కొన్నేళ్లపాటు తన నటనతో ఎంతోమందిని ఆకట్టుకున్న లెజెండ్‌ మృతి బాధకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’ - చిరంజీవి

‘ఓ సినీ బాంఢాగారం చరిత్ర పుటలోకి వెళ్లిపోయింది. ఇకపై ఎప్పుడైనా భారతీయ సినిమా గురించి చెప్పాలంటే దిలీప్‌కుమార్‌కి ముందు.. తర్వాత అని అభివర్ణించాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ - అమితాబ్‌ బచ్చన్‌

‘భారతీయ సినీ పరిశ్రమలో ఉత్తమ నటుడు దిలీప్‌కుమార్‌ ఆత్మకు శాంతి చేకూరాలి’ - సల్మాన్‌ఖాన్‌

‘దిలీప్‌కుమార్‌ సర్‌ ఇకపై మన మధ్య ఉండరనే వార్త నన్ను ఎంతో కలచివేసింది. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ ఓ లెజెండ్‌. ఆయన లెగసీ మన హృదయాల్లో చిరకాలం నిలిచే ఉంటుంది. ఆయన కుటుంబసభ్యులు, స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి’ - వెంకటేశ్‌

‘మిమ్మల్ని కలిసిన ప్రతిసారీ మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలు, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేను. మీరే నా అభిమాన నటుడు. మీలాగా ఎవరూ ఉండలేరు. ఉండరు’ - మమ్ముట్టి

‘లెజెండ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ మరణవార్త నన్ను ఎంతో కలచివేసింది. ప్రపంచంలో ఎంతోమంది నటనపరంగా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. సినిమా పరిశ్రమకు ఇదో తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ - మహేశ్‌బాబు

‘భారతీయ సినీ పరిశ్రమ విలువను పెంచిన దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అనిర్వచనీయమైనవి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ - ఎన్టీఆర్‌

‘వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన జీవితంలోనూ దిలీప్‌కుమార్‌ సర్‌తో నాకెన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆయన అకాల మరణం నన్ను కలచివేస్తోంది. సినిమా రంగానికి ఆయనో నిధి, టైమ్‌లెస్‌ యాక్టర్‌. ఆయన మరణ వార్తతో నా హృదయం ముక్కలైంది’ - అజయ్‌దేవ్‌గణ్‌

‘ఈ ప్రపంచానికి చాలామంది హీరోలై ఉండొచ్చు. దిలీప్‌కుమార్‌ సర్‌ మాలో స్ఫూర్తి నింపిన గొప్ప హీరో. సినీ పరిశ్రమకు చెందిన ఒక శకం ఆయనతో ముగిసిపోయింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి’ - అక్షయ్‌కుమార్‌

‘లెజెండ్‌ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి గురయ్యింది. మీ నటనతో ఎన్నో ఏళ్లపాటు మాకు వినోదాన్ని అందించినందుకు ధన్యవాదాలు. సినిమా వేదికగా మీరు ఎప్పటికీ గుర్తుండిపోతారు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ -మెహ్రీన్‌

‘వెండితెర మీద హీరో ఎలా ఉండాలో చూపించిన మొదటి భారతీయ కథానాయకుడు .. హీరోకి ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించిన మహానటుడు.. మొట్టమొదటి సినీ నక్షత్రం .. దిలీప్‌కుమార్‌.. ఇక శాశ్వతంగా మిగిలిపోయారు’ - సాయి మాధవ్‌ బుర్రా

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని