Karthikeya 2 : వాళ్లు ఎంత ఎక్కువ చూస్తే అంత సంతోషం!

తొలి సినిమా ‘కార్తికేయ’తోనే తనదైన ప్రభావం చూపించిన దర్శకుడు.. చందు మొండేటి. ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ల తర్వాత ఆయన ‘కార్తికేయ’కి కొనసాగింపుగా ‘కార్తికేయ2’ను తెరకెక్కించారు.

Updated : 11 Aug 2022 12:02 IST

తొలి సినిమా ‘కార్తికేయ’తోనే తనదైన ప్రభావం చూపించిన దర్శకుడు.. చందు మొండేటి. ‘ప్రేమమ్‌’, ‘సవ్యసాచి’ల తర్వాత ఆయన ‘కార్తికేయ’కి కొనసాగింపుగా ‘కార్తికేయ2’ను తెరకెక్కించారు. నిఖిల్‌ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. చిత్రం శనివారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా చందు మొండేటి బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

కార్తికేయ-2పై ఉన్న అంచనాలు మీపై ఎలాంటి ప్రభావం చూపాయి?
ఒక దర్శకుడిగానే కాకుండా... ఒక ప్రేక్షకుడిగానూ ఇలాంటి సినిమాల నుంచి ఏం ఆశిస్తారో నాకు, మా బృందానికీ బాగా తెలుసు. విజయవంతమైన చిత్రానికి కొనసాగింపుగా వస్తున్నది కాబట్టి కథ, విజువల్స్‌ పరంగా ప్రత్యేకంగా కొన్ని కొలతలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే ఈ కథని అభివృద్ధి చేశాం. అందుకు అనుగుణంగానే తీశాం. 2015లో ఈ ఆలోచన వచ్చింది. వెంటనే కథానాయకుడు నిఖిల్‌తో చెప్పా. కార్తికేయ పాత్రలో నటించిన అనుభవం ఉంది కాబట్టి, తను మరింత సులభంగా ఇందులో ఒదిగిపోయాడు.

దేవుడు - సైన్స్‌... ఈ రెండింటినీ ముడిపెట్టి కథ రాయాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
దైవత్వంలోనూ సైన్స్‌ ఉంది. హనుమంతుడు చూడటానికి మామూలుగానే కనిపిస్తాడు కానీ, ఆయన కొండని ఎత్తడం కోసం భారీకాయుడిగా మారడం వెనక సాంకేతిక కారణం ఉంది. వింటున్నప్పుడు దాన్నొక మేజిక్‌లా పరిగణిస్తాం కానీ, అంత బలం ఎలా వచ్చిందనే అంశానికి జీవ సంబంధమైన కారణం ఉంది. మనకు అంతు చిక్కని విషయాల వెనక సైన్స్‌ ఉందని నమ్ముతాను. సహజంగా నాకు సాహసాలన్నా, వెలుగు చూడని నిజాలన్నా, నిధుల వెనక రహస్యాలన్నా చాలా ఇష్టం. భాగవతంలో మనం శ్రీకృష్ణుడుని చూసింది, మరొకకోణంలో శ్రీకృష్ణుడి గురించి పరిశోధన ... ఈ రెండింటినీ ముడిపెట్టి తీసిన చిత్రమే ఇది.

శ్రీకృష్ణుడు అంటే అనంతం. అందులో ఒకట్రెండు అంశాల్ని తీసుకుని ఈ సినిమా చేశా. శ్రీకృష్ణుడు, కర్మ  సిద్ధాంతం తదితర విషయాల్ని ఇందులో స్పృశించాం. ఒక కథకుడిగా ఈ  సినిమాని 5 నుంచి 15 ఏళ్ల వయస్సు వాళ్లు ఎంత ఎక్కువమంది చూస్తే అంతగా సంతోషిస్తా. ఈ సినిమా చూశాక వాళ్లలో చరిత్ర తెలుసుకోవాలనే ఆసక్తి ఏర్పడితే మా లక్ష్యం నెరవేరినట్టే.

తొలి చిత్రంతో పోలిస్తే ఈసారి ఎదురైన సవాళ్లేంటి?
ఈ సినిమా చేశాక నేర్చుకోవల్సింది ఇంకా చాలా ఉందనే విషయం అర్థమైంది. మేం ఎంత పెద్ద కథ రాసుకున్నా బడ్జెట్‌ పరంగా మాకంటూ కొన్ని పరిధులు ఉంటాయి. ఆర్థిక విషయాల్ని గౌరవిస్తూనే మేం తెరపై ఏం చూపించాలో అది చూపించే ప్రయత్నం చేశాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌లో యానిమేషన్‌, మ్యాప్‌ పెయింటింగ్స్‌... ఇలా ఎన్ని రకాలుంటాయో అవన్నీ వినియోగించాం.

మూడో భాగమూ ఉంటుందా?  
చెప్పాల్సింది ఇంకా చాలా ఉంది. ప్రేక్షకుల నుంచి లభించే ఆదరణని బట్టి మూడో భాగంపై ఓ నిర్ణయానికొస్తాం.

స్వతహాగా మీకు ఏ నేపథ్యంలో కథలంటే ఇష్టం?
ఒక తరహా జోనర్‌ అంటూ ఏమీ లేదు. అన్ని రకాల సినిమాలూ ఇష్టమే. కాకపోతే మా కుటుంబమంతా చూసి ఆహ్లాదాన్ని పొందేది వినోదాత్మక చిత్రాలతోనే. జంధ్యాల, శ్రీనువైట్ల తరహా సినిమాలంటే ఇష్టం. అలాంటివి చేయాలని ఉంది కానీ, ఎక్కడో చిన్న భయం.

తదుపరి ప్రాజెక్టుల సంగతులేమిటి?
గీతా ఆర్ట్స్‌ సంస్థలో సినిమా చేయనున్నా. ప్రేమ, డ్రామాతో కూడిన రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఏదో ఒక కథతో సినిమా ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున కథానాయకుడిగా ఓ చిత్రం చేస్తా.

తొలి కథలోని ఏయే అంశాలు ఇందులో ఉంటాయి?
‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌, ‘లగేరహో మున్నాభాయ్‌’ సినిమాల తరహాలోనే ఈ కథని చెప్పా. కథానాయకుడి పాత్ర మాత్రమే ఇందులో కొనసాగుతుంది. తొలి భాగంలో కథానాయకుడు వైద్యవిద్యార్థిగా కనిపిస్తే, ఇందులోనేమో డాక్టర్‌గా కనిపిస్తాడు. కథ మొదలు కాగానే కథానాయకుడి పాత్ర మరో ఊరికి వెళ్లిపోతాడు కాబట్టి మిగతా పాత్రల్ని కొనసాగించే అవకాశం లేకపోయింది. తొలి భాగంలో కథానాయకుడు ఓ సాహసోపేతమైన ప్రయాణం ఎలా చేశాడో, ఇందులోనూ అలాంటి ఓ ప్రయాణమే చేస్తాడు. ఈసారి కథ శ్రీకృష్ణుడి చుట్టూ సాగుతుంది. తొలి సినిమా చూడకపోయినా సరే, దీన్ని ఆస్వాదించొచ్చు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts