వెబ్‌సిరీస్‌ దారుల్లో.. తారకలు

‘‘వెండితెరపై కనిపిస్తున్నామా...బుల్లితెరపై మెరుస్తున్నామా...డిజిటల్‌ వేదికలపై సందడి చేస్తున్నామా...అనేది అనవసరం.

Updated : 13 May 2021 11:46 IST

‘‘వెండితెరపై కనిపిస్తున్నామా...బుల్లితెరపై మెరుస్తున్నామా...డిజిటల్‌ వేదికలపై సందడి చేస్తున్నామా...అనేది అనవసరం. ప్రేక్షకులకు చేరువవుతున్నామా? లేదా? అనేది ముఖ్యం...’’ ఈ తరహాలోనే సినీ తారల ఆలోచనలు సాగుతున్నాయి. సినిమా అవకాశాలు తక్కువగా ఉన్నవారే ఎక్కువశాతం డిజిటల్‌ వేదికలపై కనిపించేవారు. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వెండితెరపై అగ్రపథంలో దూసుకుపోతున్న వాళ్లూ వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తున్నారు. సినిమాలను మించి పారితోషికం అందుకుంటున్నారు. రెండు చేతులా సంపాదించే అవకాశం, ఎలాంటి     క్లిష్ట పరిస్థితుల్లోనైనా ప్రేక్షకులకు చేరువయ్యే సౌలభ్యం ఉండటంతో వెబ్‌బాట పడుతున్నారు. ఈ ఏడాదిలో అజయ్‌దేవ్‌గణ్, మాధురీ దీక్షిత్, షాహిద్‌ కపూర్, సోనాక్షి సిన్హా తదితరులు వెబ్‌సిరీస్‌లతో తొలిసారి ప్రేక్షకులను అలరించనున్నారు. గత ఏడాది కాజోల్‌ ‘త్రిభంగ’, అభిషేక్‌బచ్చన్‌ ‘ది బిగ్‌ బుల్‌’ వెబ్‌సిరీస్‌లతో అలరించారు. అదే దారిలో ఈ ఏడాది మరింతమంది తారలు వెబ్‌ వినోదం పంచడానికి సిద్ధమవుతున్నారు.

పోలీస్‌ రుద్ర..అజయ్‌

వెండితెరపై అదరగొట్టేసే అజయ్‌ దేవ్‌గణ్‌ డిజిటల్‌ తెరపై హంగామా చేయనున్నారు. వెండితెర పోలీస్‌ పాత్రలో ఆయన మార్కు ఎలా ఉంటుందో ప్రేక్షకులకు బాగా తెలుసు. ఇప్పుడు వెబ్‌సిరీస్‌ ద్వారా ఓ కొత్త పోలీస్‌ని చూపించనున్నారు అజయ్‌. ఈ ఏడాది ఏప్రిల్‌లో ‘రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌’ వెబ్‌సిరీస్‌లో నటించనున్నట్టు ప్రకటించారు అజయ్‌. ఓటీటీ వేదికలపై అజయ్‌ నటిస్తున్న తొలి క్రైమ్‌ డ్రామా సిరీస్‌ ఇది. చాలా ఆసక్తికరమైన కథ ‘రుద్ర’. వెండితెరపై పోలీస్‌గా కనిపించడం నాకు కొత్తేమీ కాదు. ఇందులోని పోలీస్‌ పాత్ర అంతకుమించి ఉంటుంది. ఇలాంటి పాత్రను ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు చూసుండరు’’అని చెబుతున్నారు అజయ్‌దేవ్‌గణ్‌.

ఇక్కడా అందాల తారే మాధురి

ఒకప్పటి బాలీవుడ్‌ అందాల కథానాయిక మాధురీ దీక్షిత్‌ డిజిటల్‌ తెరపై మురిపించనున్నారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న వెబ్‌సిరీస్‌ ‘ఫైండింగ్‌ అనామిక’. ఇందులో ఓ ప్రముఖ సినీ తార, భార్య, తల్లిగా ఆమె కనిపించనున్నారు. ఎంతో పేరున్న ఓ సినీ తార అనుకోకుండా కనపడకుండా మాయమైతే జరిగిన పరిణామాల నేపథ్యంగా సాగే కథ ఇది. ఈ వెబ్‌సిరీస్‌ కచ్చితంగా తనకు మంచి పేరు తెస్తుందని ధీమాగా ఉన్నారు మాధురి. ఇందులో సంజయ్‌కపూర్, సుహాసినీ ములే, మసక్కన్‌ జఫారీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

షాహిద్‌ కొత్త ప్రయాణం

బాలీవుడ్‌ బాక్సాఫీసుకు వసూళ్ల వర్షం కురిపించే హీరోల్లో షాహిద్‌ కపూర్‌ ఒకరు. ఆయన గత చిత్రం ‘కబీర్‌సింగ్‌’ బాలీవుడ్‌లో భారీ వసూళ్లు అందుకున్న సంగతి తెలిసిందే. చేతినిండా సినిమాలున్నా షాహిద్‌ వెబ్‌సిరీస్‌ల వైపు మనసు పెట్టారు. ప్రముఖ దర్శక ద్వయం రాజ్‌ డీకే తెరకెక్కించనున్న ఓ వెబ్‌సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు షాహిద్‌. ఇందులో రాశిఖన్నా ఆయనకు జోడీగా కనిపించనుంది. థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సిరీస్‌కు ఇంకా పేరు పెట్టలేదు. ‘‘ఈ కథ నాకు బాగా నచ్చింది. ఈ కొత్త ప్రయాణం చాలా ఆసక్తిగా సాగుతుంది. వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తానా అని చాలా ఆత్రుతగా ఉంది’’అంటున్నారు షాహిద్‌. ఆయన నటించిన ‘జెర్సీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.

సోనాక్షి ఓటీటీ బాట

బాలీవుడ్‌లో అగ్రకథానాయికగా కొనసాగుతూనే ఓటీటీవైపు దృష్టి పెట్టింది సోనాక్షి సిన్హా. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న వెబ్‌ సిరీస్‌ ‘ఫాలెన్‌’. ఇందులో అంజలీ భాటి అనే పోలీస్‌ అధికారిణిగా సోనాక్షి నటిస్తోంది. గత ఏడాది డిసెంబరులోనే ఈ వెబ్‌సిరీస్‌ చిత్రీకరణ ప్రారంభమైంది. రీమా కగ్తీ, రుచికా ఒబెరాయ్‌ సంయుక్తంగా ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. మార్చిలోనే దీని చిత్రీకరణను పూర్తి చేసింది సోనాక్షి. ‘‘ఫాలెన్‌’ ఓ అద్భుతమైన ప్రయాణం. ఎన్నో గొప్ప అనుభూతులతో పాటు కొత్త స్నేహితుల్ని ఇచ్చింది. సరికొత్త బైక్‌ రైడింగ్‌ నైపుణ్యాలతో పాటు నిండైన ఆనందాన్ని ఇచ్చింది ఈ సిరీస్‌’’అని చెబుతోంది సోనాక్షి. ఈ సిరీస్‌లో విజయ్‌ వర్మ, గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రల్లో నటించారు.

హృతిక్‌ రోషన్‌ ప్రధాన పాత్రలో హాలీవుడ్‌ సిరీస్‌ ‘ది నైట్‌ మేనేజర్‌’లో హిందీ వెర్షన్‌ తెరకెక్కనుందని సమాచారం. దీనిపై అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనా రాలేదు. త్వరలోనే మరింతమంది తారలు ఇదే దారిలో వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ‘‘కరోనా కష్టకాలంలో థియేటర్లలో సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి. ఒకవేళ విడుదలైనా ఆశించిన స్థాయిలో ఆడటం లేదు. అందుకే వెబ్‌సిరీస్‌లు అనేవి ప్రేక్షకుల్ని అలరించడానికి తమకు దొరికిన కొత్త అవకాశంగా తారలు భావిస్తున్నారు. సినిమాలు చేస్తూనే వెబ్‌సిరీస్‌లు చేయడం మంచి నిర్ణయం’’ అని బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని