Shyam Singha Roy: ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో ఓ కొత్త ప్రపంచాన్ని చూస్తారు!

‘‘ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలని తాపత్రయపడే ప్రతీ మేకర్‌కి నా జోహార్లు. అలాంటి మరో ప్రయత్నమే ఈ సినిమాతో మేం చేశాం. యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి ప్రేక్షకులు ఓ సరికొత్త ప్రపంచాన్ని చూస్తార’’న్నారు రాహుల్‌ సాంకృత్యాన్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. నాని కథానాయకుడు

Updated : 19 Dec 2021 05:41 IST

‘‘ప్రేక్షకుడిని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాలని తాపత్రయపడే ప్రతీ మేకర్‌కి నా జోహార్లు. అలాంటి మరో ప్రయత్నమే ఈ సినిమాతో మేం చేశాం. యాభై ఏళ్లు వెనక్కి వెళ్లి ప్రేక్షకులు ఓ సరికొత్త ప్రపంచాన్ని చూస్తార’’న్నారు రాహుల్‌ సాంకృత్యాన్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. నాని కథానాయకుడు. సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ కథానాయికలు. వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ సందర్భంగా కథానాయకుడు నాని మాట్లాడుతూ... ‘‘మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. ఎప్పుడూ సింపుల్‌గా వచ్చే నేను ఈ ఫంక్షన్‌కు కోటు వేసుకొచ్చాను. సినిమా చూశాకా నాకంత ధైర్యం వచ్చింది. మాకు ఇంత ప్రేమను అందిస్తున్న తెలుగు ప్రేక్షకులకు మంచి సినిమా ఇస్తున్నాం. ఈ క్రిస్మస్‌ మనదే ’’ అని చెప్పారు. దర్శకుడు రాహుల్‌ సంకృత్యాన్‌ మాట్లాడుతూ ‘‘ఒక గొప్ప చిత్రం వెయ్యి కొత్త చిత్రాల్ని తీసే శక్తినిస్తుంది. సత్యదేవ్‌ జంగా ఈ కథాంశాన్ని తీసుకుని వచ్చినప్పుడు అందులో బెంగాలీ నేపథ్యం ఆసక్తిని రేకెత్తించింది. ఆ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చేలా ఉంటుంది. చిత్రం ఒక్కరివల్లే  జరగదు. ఛాయాగ్రాహకుడు సాను జాన్‌ వర్గీస్‌, సంగీత దర్శకుడు మిక్కీ జె.మేయర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాష్‌, ఎడిటర్‌ నవీన్‌ నూలి... ఇలా సాంకేతిక బృందం అంతా చక్కటి సహకారం అందించింది. ఈ కథకి నిర్మాత వెంకట్‌  దొరకడం మా అదృష్టం.   సిరివెన్నెల సీతారామశాస్త్రి సర్‌తో పాట రాయించుకోవడానికి నాకు ధైర్యం సరిపోలేదు. ఒక షెడ్యూల్‌ తర్వాత ధైర్యం తెచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్లా. ఆయన  ప్రాణం పెట్టి రాశారు. సిరివెన్నెల ఆఖరి పాట మాకు వచ్చిందంటే ఇది విధి కాకపోతే మరేమిటి? అంతటి మహానుభావుడు సంతకం పెట్టి ఇది చివరి పాట అవుతుందని చెప్పి వెళ్లిపోయారు. నానికి సరైన స్క్రిప్ట్‌ ఇప్పటిదాకా  దొరకలేదు. నటుడిగా ఆయనబలం ముందు ముందు చూడనున్నాం’’ అన్నారు. వేణుశ్రీరామ్‌ మాట్లాడుతూ ‘‘నాని... నా కెరీర్‌నే కాకుండా, చాలామంది కెరీర్‌లని పునః ప్రారంభించారు. ఆయన మనసు  గెలవాలంటే మంచి కథ ఉంటే సరిపోతుంది. దర్శకుల్ని ప్రోత్సహించడమే కాకుండా, ఆయన సంపాదించింది సినిమాల్లోనే పెట్టి చాలా మంది కొత్తవాళ్లకి అవకాశాల్ని ఇస్తున్నారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు స్రవంతి రవికిశోర్‌, పి.కిరణ్‌, అనిల్‌ సుంకర, రామ్‌ ఆచంట, సుధాకర్‌ చెరుకూరితోపాటు, శైలేష్‌ కొలను, నీరజ కోన, సత్యదేవ్‌, ఆనంద్‌, కృష్ణకాంత్‌, వేణు కుమారి,  మనీష్‌, అవినాష్‌, వెంకటరత్నం, విశ్వ తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని