Karthikeya 2: ప్రమాదం లిఖితం.. పరిష్కారం లిఖితం

‘‘నా వరకు రానంత వరకే సమస్య.. నా వరకు వచ్చాక  అది సమాధానం’’ అంటున్నారు కథానాయకుడు నిఖిల్‌. మరి ఆయన దగ్గరకొచ్చిన సమస్యేంటి? దానికి ఆయన వెతికి  పట్టుకున్న సమాధానమేంటి? తెలియాలంటే ‘కార్తికేయ2’ చూడాల్సిందే. మిస్టరీ

Updated : 07 Aug 2022 03:27 IST

‘‘నా వరకు రానంత వరకే సమస్య.. నా వరకు వచ్చాక  అది సమాధానం’’ అంటున్నారు కథానాయకుడు నిఖిల్‌. మరి ఆయన దగ్గరకొచ్చిన సమస్యేంటి? దానికి ఆయన వెతికి  పట్టుకున్న సమాధానమేంటి? తెలియాలంటే ‘కార్తికేయ2’ చూడాల్సిందే. మిస్టరీ థ్రిల్లర్‌ ‘కార్తికేయ’కు సీక్వెల్‌గా చందు మొండేటి తెరకెక్కించిన చిత్రమిది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. అనుపమ్‌ ఖేర్‌, ఆదిత్య మేనన్‌, శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆగస్టు 13న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో రవితేజ విడుదల చేశారు. ‘‘ఐదు సహస్రాల ముందే పలికిన ప్రమాదం. ప్రమాదం లిఖితం.. పరిష్కారం లిఖితం’’ అనే సంభాషణతో మొదలైన ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. శ్రీకృష్ణుడి చరిత్రతో ముడిపడిన కథ ఇది. ఆ చరిత్రను పరిశోధించే క్రమంలో డాక్టర్‌ కార్తికేయకు ఎలాంటి సవాళ్లెదురయ్యాయి.. దాన్ని అతనెలా ఎదుర్కొన్నాడు? అన్నది మిగిలిన కథ. ప్రచార చిత్రాల్లో కనిపించిన సన్నివేశాల్ని బట్టి సినిమాలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌, గ్రాఫిక్స్‌, ఫైట్స్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. ‘‘కృష్ణుడు ఉండేది చిన్న విషయం అనుకుంటున్నావా? అరేబియన్‌ సముద్రం నుండి అట్లాంటిక్‌ మహా సముద్రం వరకు ముడిపడిన ఒక మహా చరిత్ర’’, ‘‘ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన సంభాషణలు ఆసక్తిరేకెత్తించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని