కథపై నమ్మకమే మా చిత్రం

రెండు విభిన్నమైన ప్రేమకథల్ని మేళవించి చేసిన చిత్రమే మా ‘ప్రేమదేశం’ అన్నారు శ్రీకాంత్‌ సిద్ధం. ఆయన దర్శకనిర్మాణంలో త్రిగుణ్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటించిన చిత్రమిది.

Published : 29 Jan 2023 01:34 IST

రెండు విభిన్నమైన ప్రేమకథల్ని మేళవించి చేసిన చిత్రమే మా ‘ప్రేమదేశం’ అన్నారు శ్రీకాంత్‌ సిద్ధం. ఆయన దర్శకనిర్మాణంలో త్రిగుణ్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటించిన చిత్రమిది. మధుబాల ముఖ్య భూమిక పోషించారు. మణిశర్మ స్వరకర్త. ఈ చిత్రం ఫిబ్రవరి 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ సిద్ధం శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. 

* ‘‘కళాశాల నేపథ్యంలో సాగే చిత్రమిది. ప్రేమ, తల్లీకొడుకుల బంధం మేళవింపే ఈ కథలోని ప్రత్యేకత.  యువతరంతోపాటు, కుటుంబ ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. ‘ప్రేమదేశం’ అని పేరుకి ఏమాత్రం తగ్గకుండా ఉండేలా సినిమాని తెరకెక్కించాం. నాటి చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం ప్రాణం పోస్తే, మా సినిమాపై మణిశర్మ అంతే ప్రభావం చూపించారు. ఇప్పటికే పాటలు, టీజర్‌కి మంచి స్పందన లభించింది’’.

* ‘‘సినిమాపై ఉన్న తపన, ప్రేమే అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసుకుంటున్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. మొదట లఘు చిత్రం చేశా. ఆ తర్వాత చేసిన పూర్తిస్థాయి చిత్రమే ‘ప్రేమదేశం’. త్రిగుణ్‌, మేఘ ఆకాష్‌ జోడీ చక్కటి అభినయం ప్రదర్శించారు. మదుబాల తల్లి పాత్రలో సరికొత్తగా కనిపిస్తారు. తనికెళ్ల భరణి కూడా బలమైన పాత్రలో కనిపిస్తారు. దర్శకుడిగా నాకెలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. నిర్మాణం పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురైనా, స్నేహితులతో కలిసి  రాజీ పడకుండా సినిమాని పూర్తిచేశాం. కథపైన మాకున్న నమ్మకమే మా చిత్రం. ప్రేక్షకులు సరికొత్త అనుభూతికి లోనయ్యేలా సినిమా ఉంటుంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని