Sabavath nayak: ఇరవయ్యేళ్ల కల.. చే

క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘చే’. లాంగ్‌ లివ్‌... అనేది ఉపశీర్షిక. సభావత్‌ నాయక్‌ దర్శకత్వం వహిస్తూ... ప్రధాన పాత్రని పోషించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు.

Updated : 13 Dec 2023 09:32 IST

క్యూబా పోరాట యోధుడు చేగువేరా జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రం ‘చే’. లాంగ్‌ లివ్‌... అనేది ఉపశీర్షిక. సభావత్‌ నాయక్‌ దర్శకత్వం వహిస్తూ... ప్రధాన పాత్రని పోషించారు. సూర్య, బాబు, దేవేంద్ర సంయుక్తంగా నిర్మించారు. లావణ్య సమీరా, పూల సిద్ధేశ్వర్‌, కార్తీక్‌ నూనె, పసల ఉమా మహేశ్వర్‌ కీలక పాత్రధారులు. ఈ నెల 15న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విడుదలకి ముందస్తు వేడుకని నిర్వహించారు. జనసేన నాయకురాలు రాయపాటి అరుణ, ‘ప్రత్యర్థి’ దర్శకుడు శంకర్‌, నటుడు మాణిక్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు, కథానాయకుడు సభావత్‌ నాయక్‌ మాట్లాడుతూ ‘‘తొమ్మిదో తరగతిలో చేగువేరా గురించి చదివాక ఆయన జీవితాన్ని సినిమాగా తీసుకురావాలని కల కన్నా. మధ్యలో కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ మాటలు నా లక్ష్యాన్ని గుర్తు చేస్తూ... నాలో మరింతగా స్ఫూర్తిని రగిలించేవి. తోపుడు బండిపై తినుబండారాలు అమ్ముతూ, పైసా పైసా పోగు చేస్తూ నా లక్ష్యానికి చేరువయ్యా. చేగువేరా గౌరవం ఏమాత్రం తగ్గకుండా సినిమాని తీశా. ‘చే’తో ఇరవయ్యేళ్ల నా శ్రమ ఫలించింది. చేగువేరా కూతురు డా.అలైదా గువేరా స్వయంగా మా సినిమా ప్రచార చిత్రాల్ని విడుదల చేసి మమ్మల్ని అభినందించారు. సెన్సార్‌ బృందం మా సినిమాని చూసి  మెచ్చుకున్నార’’ని చెప్పారు. ‘‘యువతరం ఇలాంటి సినిమాల్ని చూడాలి’’ అన్నారు జనసేన నాయకురాలు రాయపాటి అరుణ. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు ప్రభు, భరద్వాజ్‌, నటుడు వివారెడ్డితోపాటు చిత్రబృందం పాల్గొంది.


చేనేత కార్మికులకు అంకితం ఈ సినిమా

‘జోరుగా హుషారుగా’ చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు విరాజ్‌ అశ్విన్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అను ప్రసాద్‌ తెరకెక్కించారు. నిరీష్‌ తిరువిధుల నిర్మించారు. పూజిత పొన్నాడ కథానాయిక. ఈ సినిమా ఈనెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో ఇటీవల విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఇందులో దర్శకుడు వశిష్ఠ, ఎమ్మెల్సీ రమేష్‌ యాదవ్‌ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో విరాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇందులో నేను చేనేత కార్మికుల కుటుంబం నుంచి వచ్చిన సంతోష్‌గా కనిపిస్తాను. దీంట్లో చేనేత కార్మికుల గురించి ఒక ప్రత్యేకమైన పాట పెట్టాం’’ అన్నారు. ‘‘పోచంపల్లి చేనేత కార్మికుల గురించి దీంట్లో చాలా చక్కగా చూపించారు. నేనిందులో చేనేత కార్మికుడిగా నటించడం నా అదృష్టం. ఈ సినిమాని చేనేత కార్మికులకు అంకితమిస్తున్నాం’’ అన్నారు నటుడు సాయికుమార్‌. ఈ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్‌, దామోదర ప్రసాద్‌, వేణుగోపాల్‌, అనూప్‌ రూబెన్స్‌ తదితరులు పాల్గొన్నారు.


శాంతలకు కథే బలం

‘పరిమిత వ్యయంతో రూపొందిన మంచి చిత్రాలకు ప్రేక్షకుల ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. ఈ ఏడాది ‘జైలర్‌’, ‘జవాన్‌’, ‘యానిమల్‌’ తరహా భారీ సినిమాలతోపాటు... ‘బలగం’, ‘బేబి’ లాంటి చిత్రాల్నీ చూశారు. బలమైన కథతో రూపొందిన మా ‘శాంతల’ కూడా ప్రేక్షకుల్ని తప్పకుండా మెప్పిస్తుంది’’ అన్నారు కె.ఎస్‌.రామారావు. ఆయన క్రియేటివ్‌ కమర్షియల్‌ సూపర్‌ విజన్‌ పతాకంపై ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న చిత్రం ‘శాంతల’. నిహాల్‌ కోదాటి, ఆశ్లేష ఠాకూర్‌ జంటగా నటించారు. శేషు పెద్దిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇర్రింకి సురేశ్‌ నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తుందీ చిత్రం. ఈ సందర్భంగా మంగళవారం  హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శనని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ ‘‘కథే బలంగా రూపొందిన చిత్రమిది. రెండేళ్లుగా కష్టపడి పాన్‌ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఆ స్థాయిలోనే విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని