Teja Sajja: తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్‌

‘హను-మాన్‌’తో సూపర్‌ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్‌ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది.

Updated : 19 Apr 2024 11:42 IST

ను-మాన్‌’తో సూపర్‌ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్‌ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. భవిష్యత్తు అనే అర్థం వచ్చేలా ‘మిరాయ్‌’ అనే పేరుని ఈ సినిమాకి ఖరారు చేశారు. గురువారం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోపాటు, వీడియో ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘‘సమ్రాట్‌ అశోక్‌. చరిత్రలో మరకగా మిగిలిన అతని కళింగ యుద్ధం.  ఆ పశ్చాత్తాపంలో వెలుగు చూసిన ఓ దేవ రహస్యం. అదే మనిషిని దైవం చేసే తొమ్మిది గ్రంథాల అపార జ్ఞానం. తరాలుగా వాటిని కాపాడుతూ తొమ్మిది యోధుల నియామకం. అలాంటి జ్ఞానానికి చేరువవుతున్న ఓ గ్రహణం. ఆ గ్రహణాన్ని ఆపే ఓ జననం. ఇది తరాలుగా తప్పని మహారణం’గా కథని పరిచయం చేసింది ప్రచార చిత్రం. తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘‘మిరాయ్‌ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఓ శాసనం. దీని గురించి సినిమా విడుదల తర్వాత మరింత బాగా అర్థమవుతుంది. ఈ కథ కోసం చాలా నేర్చుకుని సినిమా చేస్తున్నా. ‘హను-మాన్‌’కి ముందే ఈ  కథని తేజకి చెప్పా. పదేళ్లుగా తనతో ప్రయాణం చేస్తున్నా. ఇదొక అద్భుతమైన సినిమాగా మలుస్తున్నా. ఈ చిత్రంలో మంచు మనోజ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తారు’’ అన్నారు. తేజ మాట్లాడుతూ ‘‘నన్నొక యోధుడిగా తెరపై చూపిస్తున్నారు కార్తీక్‌. ఆయన విజన్‌ గొప్పగా ఉంటుంది. ఆర్నెళ్ల కిందటే ఈ సినిమాని మొదలుపెట్టాం. వచ్చే ఏడాది విడుదల రోజు గుడ్‌ ఫ్రైడే. నాతోపాటు, అందరికీ అది గుడ్‌ ఫ్రైడే అవుతుంది. ‘హను-మాన్‌’ తర్వాత రిలాక్స్‌ అయిపోయావా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ప్రతి అడుగూ జాగ్రత్తగా వేసే క్రమంలోనే ఈ సినిమా చేస్తున్నా. మాకున్న వనరులతో భారీగా చేస్తున్నాం. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాణంలో చేయడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.

నిర్మాత టి.జి.విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘కార్తీక్‌తో మా ప్రయాణం చాలా బాగుంది. ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం తెరపై కన్నులపండుగలా ఉంటుంది. పాన్‌ వరల్డ్‌ రికార్డుల్ని సృష్టించే చిత్రం అవుతుంది’’ అన్నారు. ప్రముఖ నిర్మాత డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘కార్తీక్‌, తేజ, విశ్వప్రసాద్‌... ఈ ముగ్గురి కల ఈ సినిమాతో నెరవేరుతుంది. గౌర హరి సంగీతం చాలా బాగుంది. అందరూ కలిసి ఓ అద్భుతమైన సినిమాని అందిస్తున్నారని ప్రచార చిత్రం స్పష్టం చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు నందినిరెడ్డి, మల్లిక్‌ రామ్‌, కృష్ణచైతన్య, బెక్కం వేణుగోపాల్‌, ఎస్‌.కె.ఎన్‌, శ్రీరామ్‌ ఆదిత్య, సాహు గారపాటి, వివేక్‌ కూచిభొట్ల, కళా దర్శకుడు నాగేంద్ర, సంగీత దర్శకుడు గౌర హరి, ఇతర చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని