
Seetimaarr Kabaddi Anthem: ఆట కూడా.. వేటలా సాగిపోరా..!
హైదరాబాద్: ‘కోర్టులోన.. శివంగ అంగలేరా.. పోరాడుతారు ఆట కూడా వేట అంటూ సాగిపోరా’ అంటూ తమ కబడ్డీ టీమ్‌లను ఉత్సాహ పరుస్తున్నారు గోపిచంద్, తమన్నా. వీరిద్దరూ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సీటీమార్’. సంపత్ నంది దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా బుధవారం ‘కబడ్డీ ఆంథమ్’ పేరుతో స్ఫూర్తి రగిలించే పాటను విడుదల చేశారు. మణిశర్మ స్వరాలకు కల్యాణ్ చక్రవర్తి సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి, సాయి చరణ్, రమ్య బెహర, సాహితి చాగంటిలు ఆలపించారు. ఆద్యంతం అలరించేలా, ఉత్సాహం నింపేలా ఈ పాట సాగింది.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన చిత్రమిది. క్రీడా నేపథ్యంలో సాగే చిత్రం ఎలా ఉండాలో, అదే స్థాయిలో ఉంటుందీ చిత్రం. గోపీచంద్ ఆంధ్ర కబడ్డీ జట్టుకి కోచ్‌గా, తమన్నా తెలంగాణ జట్టుకి కోచ్‌గా కనిపిస్తారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కి, పాటలకి మంచి స్పందన లభించింది. మాస్ అంశాల్ని పక్కాగా మేళవించి, ప్రతి సన్నివేశాన్నీ ప్రత్యేక హంగులతో తెరకెక్కించాం. కచ్చితంగా మా చిత్రం ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని పంచుతుంది’’ అన్నారు. దిగంగన సూర్యవంశీ, భూమిక, పోసాని కృష్ణమురళి, రావు రమేష్, రెహమాన్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రంలో అప్సర రాణి ప్రత్యేక గీతం చేసింది. కళ: సత్యనారాయణ.డి.వై., ఛాయాగ్రహణం: ఎస్.సౌందర్‌రాజన్, కూర్పు: తమ్మిరాజు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.