Salaar: ‘కేజీఎఫ్‌2’తో ‘సలార్‌’ను ముడిపెట్టిన ప్రశాంత్‌నీల్‌..!

‘సలార్‌’ (Salaar) టీజర్‌ను జులై 6న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతం నెట్టింట ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

Updated : 04 Jul 2023 14:58 IST

హైదరాబాద్‌: ‘కేజీఎఫ్‌2’తో (KGF2) ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను ఆకట్టుకున్న డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్.. ప్రస్తుతం ‘సలార్‌’తో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. తాజాగా దీని టీజర్‌ విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం. ఈ ప్రకటన వచ్చిన దగ్గరి నుంచి సోషల్‌మీడియాలో ఒక వార్త ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ను ‘కేజీఎఫ్‌2’తో ముడిపెట్టారంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

సాధారణంగా కొత్త సినిమాల ఫస్ట్‌లుక్‌ పోస్టర్లు, టీజర్‌లు.. ఏవైనా ఉదయం, సాయంత్రం సమయాల్లో విడుదల చేస్తారు. కానీ, ‘సలార్‌’ (Salaar) టీజర్‌ను మాత్రం జులై 6 తెల్లవారుజామున 5.12కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సమయంపై నెట్టింట చర్చ మొదలైంది. సరిగ్గా ‘కేజీఎఫ్‌2’ క్లైమాక్స్‌లో యశ్‌పై సముద్రంలో దాడి జరిగిన సమయం కూడా ఇదే కావడం విశేషం. ఆ సన్నివేశంలో యశ్‌ ప్రయాణించే ఓడలో ఇదే సమయాన్ని చూపుతారు. దీంతో ప్రశాంత్ నీల్‌ ఈ టైమ్‌లోనే ‘సలార్‌’ టీజర్‌ రిలీజ్‌ చేయడం గమనార్హం.

ఇక ప్రశాంత్‌నీల్ సినిమాల్లో కామన్‌గా కనిపించే మరో పాయింట్‌ హీరోల లుక్‌. ‘కేజీఎఫ్‌2’లో యశ్‌ ఎంతో రఫ్‌ లుక్‌లో కనిపించారు. తాజాగా విడుదల చేసిన ‘సలార్‌’ పోస్టర్‌లోనూ ప్రభాస్‌ (Prabhas) ఇలానే కనిపించారు. ఇక కేజీయఫ్‌ గోల్డ్‌ మైనింగ్‌ నేపథ్యం అయితే, సలార్‌ కోల్‌ మైనింగ్‌ కథగా తెరకెక్కుతోంది. దీంతో ఈ సినిమాల మధ్య ఏదో లింక్‌ ఉందనే టాక్‌ బాగా వినిపిస్తోంది.

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ‘సలార్‌’ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలోని నటీనటులు దీని గురించి ఆసక్తికర విషయాలు పంచుకుని అంచనాలను రెట్టింపు చేశారు. మరోవైపు కౌంట్‌డౌన్‌తో రోజుకో పోస్టర్‌ సోషల్‌మీడియాలో సందడి చేస్తోంది. ప్రభాస్‌ సరసన శ్రుతి హాసన్‌ నటిస్తోన్న ఈ సినిమా సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. జగపతిబాబు, ఈశ్వరీరావు, శ్రియారెడ్డి తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.  కమర్షియల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ఐదు భాషల్లో రానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని