OTT Movies: ఓటీటీలోకి వచ్చేసిన రెండు కొత్త చిత్రాలు.. థ్రిల్లర్‌ ప్రియులకు వీకెండ్‌ వినోదం..!

ఓటీటీ వేదికగా ఈ వీకెండ్‌లో వినోదం అందించేందుకు రెండు కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి.

Published : 18 Aug 2023 18:27 IST

వీకెండ్‌లో క్రైమ్‌, హారర్‌ చిత్రాలు చూడాలనుకునే వారి కోసం ఓటీటీలో రెండు కొత్త సినిమాలు విడుదలయ్యాయి. అమెజాన్‌ ప్రైమ్‌, హాట్‌స్టార్‌ వేదికగా నేటి నుంచి ఆ చిత్రాలు ప్రసారం అవుతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటి? వాటి కథ ఏమిటి?

‘కొలై’ రిలీజ్‌.. కండిషన్స్‌ అప్లై..! 

‘బిచ్చగాడు’తో తెలుగువారికి చేరువైన కోలీవుడ్‌ నటుడు విజయ్‌ ఆంటోనీ (Vijay Antony). ఆయన నటించిన రీసెంట్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘కొలై’ (Kolai). బాలాజీ కె.కుమార్‌ దీన్ని తెరకెక్కించారు. రితికాసింగ్‌ కథానాయిక. జులై 21న ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ‘హత్య’ అనే పేరుతో విడుదల చేశారు. థియేటర్లలో మిశ్రమ స్పందనలు అందుకున్న ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా శుక్రవారం నుంచి ‘కొలై’ అందుబాటులోకి వచ్చింది. అయితే, ప్రస్తుతానికి తమిళ ఆడియోలోనే సినిమా ప్లే అవుతోంది. తెలుగు ఆడియో వచ్చేవారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ఓటీటీలో ‘బేబీ’ మూవీ.. స్ట్రీమింగ్‌ తేదీ ఫిక్స్‌.. వాళ్లకు స్పెషల్‌!

కథేంటంటే:

లైలా (మీనాక్షి చౌదరి) ఫేమస్‌ మోడల్‌. హైదరాబాద్‌లోని తన ఫ్లాట్‌లో హత్యకు గురవుతుంది. ఆ కేసు దర్యాప్తును ఐపీఎస్‌ అధికారిణి సంధ్య (రితికా సింగ్‌)కు అప్పగిస్తారు. ఎలాంటి సాక్ష్యాధారాలు లేని ఆ కేసును పరిష్కరించేందుకు ఆమె డిటెక్టివ్‌ వినాయక్‌ (విజయ్‌ ఆంటోని) సహాయాన్ని కోరుతుంది.  ఈ కేసు విచారించే క్రమంలో లైలా హత్యకు ఆమె బాయ్‌ ఫ్రెండ్‌ సతీష్‌ (సిద్ధార్థ్‌ శంకర్‌), ముంబయిలో ఉన్న మోడల్‌ కో-ఆర్డినేటర్‌ ఆదిత్య కౌశిక్‌ (మురళీ శర్మ), ఫ్యాషన్‌ ఫొటోగ్రాఫర్‌ అర్జున్‌ వాసుదేవ్‌ (అర్జున్‌ చిదంబరం), బబ్లూ (కిషోర్‌ కుమార్‌) అనే మరో వ్యక్తికి ఏదో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తారు. మరి ఈ నలుగురిలో లైలాను హత్య చేసిందెవరు? అసలు నేరస్థుల్ని వినాయక్, సంధ్య ఎలా కనిపెట్టారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? అనే ఆసక్తికర అంశాలతో ఇది రూపుదిద్దుకుంది.


అవికాగోర్‌ కొత్త సినిమా..!

అవికాగోర్‌ (Avikagor) నటించిన బాలీవుడ్‌ చిత్రం ‘1920: హారర్స్‌ ఆఫ్‌ ది హార్ట్‌’. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి కృష్ణభట్‌ దర్శకత్వం వహించారు. తెలుగు, హిందీ, తమిళం భాషల్లో జూన్‌ 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. తాజాగా ఇది డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా విడుదలైంది. ప్రస్తుతం హిందీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. 

కథేంటంటే:

తన తండ్రి ధీరజ్ అకాల మరణంతో మేఘన (అవికాగోర్‌) మనోవేదనకు గురి అవుతుంది. ధీరజ్‌ రాసిన ఓ పాత డైరీని మేఘన అనుకోకుండా చదువుతుంది. తండ్రి మరణానికి తన తల్లే కారణమని తెలుసుకుంటుంది. తన తల్లిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. తల్లిపై పగ తీర్చుకోవడానికి మేఘన ఏం చేసింది? పగ తీర్చుకునే క్రమంలో ఆమె తన ప్రియుడు అర్జున్‌ను ఎలా దూరం చేసుకుంది? ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని