Thandel: భారీ ధరకు ‘తండేల్‌’ ఓటీటీ రైట్స్‌.. చైతూ కెరీర్‌లో బిగ్‌ డీల్‌

తండేల్‌ మూవీ ఓటీటీ డీల్‌ పూర్తయింది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ దక్కించుకుంది.

Published : 29 Apr 2024 13:51 IST

హైదరాబాద్‌: ఒకవైపు సినిమాలతో అలరిస్తూనే ఇటీవల ‘దూత’ వెబ్‌సిరీస్‌తో మెప్పించారు యువ కథానాయకుడు నాగచైతన్య (Naga Chaitanya). ఆయన ప్రధాన పాత్రలో చందూ మొండేటి దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘తండేల్‌’ (Thandel). సాయిపల్లవి (Sai Pallavi) కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేశభక్తి అంశాలతో నిండిన రా రస్టిక్‌ ప్రేమకథతో ఇది తెరకెక్కుతోంది. చైతన్య ఇందులో రాజు అనే మత్స్యకారుడిగా కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డీల్‌ పూర్తయింది. చైతూ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.40 కోట్లకు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) మూవీ రైట్స్‌ను దక్కించుకుంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ‘తండేల్‌’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. థియేట్రికల్‌ రన్‌ ముగిసిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

ఫుల్‌ స్వింగ్‌లో షూటింగ్‌..

సినిమా ప్రారంభానికి ముందు క్షేత్రస్థాయిలో ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకుని, స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు దర్శకుడు చందూ మొండేటి. సినిమా సెట్స్‌పైకి వెళ్లిన తర్వాత షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌, స్టిల్స్‌ను చిత్ర బృందం పంచుకుంటోంది. ఇంతకు ముందెప్పుడూ చేయని సరికొత్త పాత్రలో చైతూ.. సాయిపల్లవి డీగ్లామర్‌ లుక్స్‌లో కనిపించనున్నారు. కొన్ని రోజుల కిందట హైదరాబాద్‌లో జరిగిన షెడ్యూల్‌లో నాగచైతన్యపై ఓ భారీ పోరాట ఘట్టాన్ని తెరకెక్కించారు. ఇది సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచే యాక్షన్‌ సీక్వెన్స్‌ అని చిత్రవర్గాలు తెలిపాయి. ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ సుప్రీమ్‌ సుందర్‌ ఈ ఎపిసోడ్‌కు నేతృత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్న ‘తండేల్‌’ను బన్ని వాసు నిర్మిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని