Aavesham ott release: మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

జీతూ మాధవన్‌ దర్శకత్వంలో ఫహద్‌ ఫాజిల్‌ నటించిన ‘ఆవేశం’ ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.

Updated : 08 May 2024 12:09 IST

హైదరాబాద్‌: ఇటీవల కాలంలో పలు మలయాళ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. కొన్ని చిత్రాలు అక్కడి థియేటర్లలో విడుదలైన తర్వాత ఇతర భాషల్లో అనువాదం అవుతుండగా, మరికొన్ని నేరుగా ఓటీటీలో వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో తాజా సంచలనం ‘ఆవేశం’ (Aavesham ott release) వచ్చి చేరింది. ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) కీలక పాత్రలో జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. కేవలం రూ.30 కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.150కోట్లు వసూలు చేసింది. త్వరలోనే ఓటీటీలోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇంతకీ ఈ సినిమాలో ఏముంది?

అజు, బిబి, శంతన్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ చదవడానికి కేరళ నుంచి బెంగళూరుకు వస్తారు. కాలేజ్‌ హాస్టల్‌లో కన్నా బయట ఉంటే కాస్త స్వేచ్ఛగా ఉండవచ్చని బీకే హాస్టల్‌లో దిగుతారు. ఈ క్రమంలోనే సీనియర్లు అయిన కుట్టీ, అతడి గ్యాంగ్‌ ఈ ముగ్గురిని దారుణంగా ర్యాగింగ్‌ చేస్తుంది. దీంతో ‘ఆవేశం’తో రగిలిపోయి, తమ సీనియర్లను కొట్టించడానికి స్థానికంగా గ్యాంగ్‌స్టర్‌ అయిన రంజిత్‌ గంగాధర్‌ అలియాస్‌ రంగా (ఫహద్‌ ఫాజిల్‌)ను ఆశ్రయిస్తారు. రంగా ఆ సీనియర్స్‌కు బుద్ధి చెబుతాడు. అయితే, అప్పటి నుంచి అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ రంగా పేరు చెప్పి, తమ హవా చూపిస్తుంటారు. దీంతో చదువు పక్కకు వెళ్లిపోతుంది. ఓ దశ దాటిన తర్వాత ఈ ముగ్గురూ రంగాను చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి అప్పుడు వాళ్లు తీసుకున్న నిర్ణయం ఏంటి? రంగాకు ఈ విషయం ఎలా తెలిసింది? అన్న ఆసక్తికర అంశాలతో సినిమా సాగుతుంది.

‘రొమాంచమ్‌’ వంటి సింపుల్‌ కథను తీసిన జీతూ మాధవన్‌ ‘ఆవేశం’ మూవీని రేసీ స్క్రీన్‌ప్లేతో అదరగొట్టేశాడు. సినిమాలో ఫహద్‌ ఫాజిల్‌ తప్ప ఇతర నటుల గురించి పెద్దగా తెలియకపోయినా తమ నటనతో వాళ్లు కూడా సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చారు. ఇక ఫహద్‌ ఫాజిల్‌ ‘పుష్ప: ది రూల్‌’తో తెలుగువారిని అలరించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతోపాటు రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’లోనూ ఆయన నటిస్తున్నారు.

నెల రోజులు తిరగకుండానే ఓటీటీలో..

‘ఆవేశం’ మూవీ ఏప్రిల్‌ 11న మలయాళంలో విడుదలైంది. ముందుగా చేసుకున్న అగ్రిమెంట్‌ ప్రకారం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో 28 రోజులకే స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేస్తోంది. నెల రోజులు తిరగకుండానే ఓటీటీలో వచ్చేస్తున్నా, మాలీవుడ్‌లో కలెక్షన్ల విషయంలో రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన, ‘2018’, ‘పులి మురుగన్‌’, ‘ఆడు జీవితం’, ‘బాహుబలి-2’, ‘మంజుమ్మెల్‌ బాయ్స్‌’ చిత్రాల సరసన చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని