Cinema News: సంక్షిప్త వార్తలు (7)

విష్ణు విశాల్‌, ఐశ్వర్యలక్ష్మి నాయకానాయికలుగా ముస్తాబవుతున్న చిత్రం ‘మట్టి కుస్తీ’. చెల్లా అయ్యావు దర్శకుడు. విష్ణువిశాల్‌ స్టూడియోస్‌ పతాకంపై విష్ణువిశాల్‌తో కలిసి కథానాయకుడు రవితేజ నిర్మిస్తున్నారు.

Updated : 21 Nov 2022 07:57 IST

‘మట్టి కుస్తీ’లో నెగ్గిందెవరు?

విష్ణు విశాల్‌ (Vishnu Vishal), ఐశ్వర్యలక్ష్మి(Aishwarya Lekshmi) నాయకానాయికలుగా ముస్తాబవుతున్న చిత్రం ‘మట్టి కుస్తీ’ (Matti Kusthi). చెల్లా అయ్యావు దర్శకుడు. విష్ణువిశాల్‌ స్టూడియోస్‌ పతాకంపై విష్ణువిశాల్‌తో కలిసి కథానాయకుడు రవితేజ నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ చిత్ర ట్రైలర్‌ని రానా దగ్గుబాటితో కలిసి ఆయన విడుదల చేశారు. ఇందులో విష్ణువిశాల్‌ కబడ్డీ ఆటగాడిగా కనిపిస్తుండగా.. ఐశ్వర్యలక్ష్మి అనవసర గొడవల్లో తలదూర్చే దూకుడైన అమ్మాయిగా నటిస్తోంది. ఈ ఇద్దరికీ పెళ్లయ్యాక ఏం జరిగిందన్నదే కథ. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందిస్తున్నారు.


ఆనందమో... ఆవేశమో

శివ బాలాజీ, ధర్మ, బ్రిగిడ సాగ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం ‘సిందూరం’ (Sindhooram). శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకుడు. ప్రవీణ్‌ రెడ్డి జంగా నిర్మాత. చిత్రీకరణ పూర్తయింది. ‘ఆనందమో... ఆవేశమో...’ అంటూ సాగే ఈ చిత్రంలోని తొలి గీతాన్ని ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. బాలాజీ రచించిన ఈ గీతాన్ని అభయ్‌ జోద్పూర్కర్‌ ఆలపించగా, హరి గౌర స్వరాలు సమకూర్చారు. ధర్మ, బ్రిగిడ సాగలపై తెరకెక్కించిన ఈ గీతానికి వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేశాయి సినీ వర్గాలు. ‘‘రాజకీయం నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. మారేడుమిల్లి అడవుల్లో ఒకే షెడ్యూల్‌లో చిత్రీకరణ పూర్తి చేశాం’’ అని సినీవర్గాలు తెలిపాయి.


ఆ హంతకుడెవరు?

తుషార్‌కపూర్‌ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘మారీచ్‌’ (Marich). తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ఇందులో తుషార్‌ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. ధ్రువ్‌ లాథర్‌ దర్శకుడు. నసీరుద్దీన్‌ షా, రాహుల్‌ దేవ్‌, అనిత హసనందానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు వరుస హత్యల నేపథ్యంలో ట్రైలర్‌ మొదలవుతుంది. ఆ హత్యల హంతకులెవరో ఛేదించే క్రమంలో భయంలేని అధికారిగా కనిపిస్తాడు తుషార్‌. డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తుందీ సినిమా.


‘మన్నించవా..’ 25న

మల్హోత్రా ఎస్‌ శివం, శంకర్‌, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో ఆనేగౌని రమేష్‌గౌడ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మన్నించవా’ (Manninchava). రామరాజ్యం మూవీ మేకర్స్‌, అనంతలక్ష్మి ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబరు 25న సినిమా విడుదల కానున్న సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన నిర్మాతలు దామోదరప్రసాద్‌, ప్రసన్నకుమార్‌ బిగ్‌ సీడీని ఆవిష్కరించారు. ‘ట్రైలర్‌, పాటలు బాగున్నాయి. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అన్నారు దామోదరప్రసాద్‌. చిన్న సినిమాలు మంచి విజయం సాధిస్తేనే పరిశ్రమ కళకళలాడుతుందన్నారు ప్రసన్నకుమార్‌. ‘అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఇందులో ఉన్నాయి. హీరోహీరోయిన్లు, సాంకేతిక నిపుణులు కష్టపడి పని చేశార’న్నారు దర్శకుడు. కార్యక్రమంలో నిర్మాతలు మంజుల చవన్‌, మోహన్‌గౌడ్‌, శివబాలాజీ, బాబ్జీ, ఖయ్యూమ్‌, అప్పారావు, మాణిక్‌ తదితరులు పాల్గొన్నారు.


ఓటీటీలో ప్రతిభే ముఖ్యం

కళాకారుల ప్రతిభను వెలికితీయడంలో ఓటీటీ వేదికలు గొప్ప పాత్ర పోషిస్తున్నాయి. వాటికి నేను ఫిదా అయిపోయాను అంటున్నారు బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌(Vivek Oberoi) . ‘కంపెనీ’, ‘సాథియా’, ‘ఓంకారా’ చిత్రాల ఫేం ఆయన. ‘ఓటీటీ వేదికల స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం నాకు బాగా నచ్చుతోంది. ఇది కలకాలం కొనసాగుతుందని ఆశిస్తున్నా. ఓటీటీలో ప్రతిభే కొలమానం. ఇక్కడ నువ్వెవరు? ఎవరి వారసుడివి? అని పట్టించుకోరు. ప్రతిభ, పనితనం ఉంటే ప్రశంసలు దక్కుతాయి. అవకాశాలొస్తాయి. ఇక్కడ ఎన్ని చిత్రాలైనా విడుదల చేసుకోవచ్చు. ప్రచారం, లాబీయింగ్‌ ఇవేవీ ఉండవు. బలవంతుల ఆటలు ఇక్కడ పని చేయవు’ అన్నారు. ఆయన నటించిన ‘ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’ అనే వెబ్‌సిరీస్‌ విజయోత్సవ కార్యక్రమంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం వివేక్‌ ఒబెరాయ్‌ ‘ధారావి బ్యాంక్‌’ అనే వెబ్‌సిరీస్‌లో జయంత్‌ గావస్కర్‌ అనే పోలీసు అధికారి పాత్రలో నటిస్తున్నారు.


‘శ్రీ’కారం చుట్టుకుంది

తెలుగు పారిశ్రామికవేత్త, దివ్యాంగుడైన శ్రీకాంత్‌ బొల్లా ప్రయాణం స్ఫూర్తిదాయకం. ఆయన జీవితం ఆధారంగా ‘శ్రీ’ పేరుతో హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్‌ బొల్లా పాత్రలో యువ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావు (Rajkumar rao) నటిస్తున్నారు. తుషార్‌ హీరా నందాని దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్‌ కుమార్‌, కృష్ణన్‌ కుమార్‌, నిధి పర్మార్‌ హీరానందాని నిర్మాతలు. ఆదివారం ప్రారంభమైందీ చిత్రం.


విజేత ప్రయాణం

వ్యాపారవేత్త విజయ్‌ శంకేశ్వర్‌ జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘విజయానంద్‌’ (Vijayanand). నిహాల్‌ రాజ్‌పూత్‌ కథానాయకుడిగా నటించారు. సిరి ప్రహ్లాద్‌ కథానాయిక. అనంత్‌నాగ్‌, భరత్‌ బోపన ముఖ్యపాత్రలు పోషించారు. రిషికా శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఆనంద్‌ శంకేశ్వర్‌ నిర్మాత. పలు భాషల్లో డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకొస్తోందీ చిత్రం. ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవలే విడుదల చేశారు. ‘సాధించకుండా చస్తే చావుకే అవమానం... సిద్ధాంతాలు లేకుండా బతికితే బతుకుకే అవమానం అని మా నాన్నగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు...’ అంటూ మొదలవుతుందీ ట్రైలర్‌. ‘‘సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి, ఎన్నో సవాళ్లని ఎదుర్కొని విజేతగా నిలిచిన ఓ వ్యక్తి ప్రయాణం ఇది. అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ప్రతీ సన్నివేశం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతుంద’’ని సినీవర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని