Nedumudi Venu: ‘అపరిచితుడు’ నటుడు నెడుముడి వేణు ఇక లేరు

ప్రముఖ మలయాళ నటుడు, స్క్రీన్‌ రైటర్‌ నెడిముడి వేణు(73) కన్నుమూశారు. మలయాళ, తమిళ భాషల్లో కలిపి 500లకు పైగా చిత్రాల్లో నటించారు. అత్యధిక

Published : 11 Oct 2021 17:25 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మలయాళ నటుడు, స్క్రీన్‌ రైటర్‌ నెడిముడి వేణు(73) కన్నుమూశారు. మలయాళ, తమిళ భాషల్లో కలిపి 500లకు పైగా చిత్రాల్లో నటించారు. అత్యధిక చిత్రాలు మలయాళంలోనే చేశారు. కాలేయ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఆదివారం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. నాటక కళాకారుడిగా కెరీర్‌ను ప్రారంభించిన వేణు 1978లో వచ్చిన ‘తంబు’ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘అరవం’, ‘ఒడిత్తరు పహిల్వాన్‌’, ‘కల్లాన్‌ పవిత్రన్‌’ తదితర చిత్రాలు ఆయన కెరీర్‌ను మలుపు తిప్పాయి. పలు చిత్రాలకు ఆయన స్క్రీన్‌ రైటర్‌గానూ పనిచేశారు. ‘పూరమ్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ‘భారతీయుడు’, ‘అపరిచితుడు’ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు.

మూడు నేషనల్‌ అవార్డులు

నెడిముడి వేణు కెరీర్‌లో ఎన్నో అవార్డులు అందుకున్నారు. అందులో మూడు జాతీయ అవార్డులు ఉండటం గమనార్హం. ‘హిస్‌ హైనెస్‌ అబ్దుల్లా’ చిత్రంలో నటనకు గానూ ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. ‘మార్గం’ చిత్రానికి స్పెషల్‌ జ్యూరీ రాగా, ‘మినుక్కు’కు జాతీయ ఉత్తమ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ నెరేషన్‌/వాయిస్‌ ఓవర్‌ అవార్డు వచ్చింది. ఉత్తమ నటుడిగా మూడుసార్లు కేరళ స్టేట్‌ అవార్డు అందుకున్నారు. ఇక రెండు సార్లు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌, లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును సొంతం చేసుకున్నారు. నెడిముడి వేణు మృతి పట్ల మలయాళ చిత్ర పరిశ్రమ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆయనకు నివాళి అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని