Nithiin: ఆమె ఎక్స్‌ట్రార్డినరీ మహిళ.. శ్రీలీలపై నితిన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ (Extra Ordinary Man) ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో.. శ్రీలీల టాలెంట్‌ గురించి నితిన్‌ మాట్లాడారు.

Updated : 05 Dec 2023 15:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌  (Nithiin) - శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన వినోదాత్మక చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్‌’ (Extra Ordinary Man). వక్కంతం వంశీ దర్శకుడు. డిసెంబర్‌ 8న ఇది విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు.

‘‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నా కెరీర్‌లో ఇంత మంచి పాత్ర ఇప్పటి వరకు చేయలేదు. మా నాన్న డిస్ట్రిబ్యూటర్‌గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన డిస్ట్రిబ్యూట్‌ చేసిన మొదటి సినిమా రాజశేఖర్‌ నటించిన ‘మగాడు’. అది సూపర్‌ హిట్‌ కావడంతో ఇండస్ట్రీలోనే కొనసాగారు. దాంతో నాకు సినిమాల్లోకి రావాలనే ఆసక్తి కలిగింది. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి రాజశేఖర్‌ ప్రధాన కారణం. ఆయన ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌’ చేయడమే మాకు పెద్ద బహుమతి. ఇక శ్రీలీల నిజ జీవితంలో ఎక్స్‌ట్రార్డినరీ మహిళ.. ఆమెకు భరతనాట్యం, కూచిపూడి తెలుసు. రాష్ట్రస్థాయిలో హాకీ ప్లేయర్‌. స్విమ్మింగ్‌లోనూ రికార్డు ఉంది. త్వరలోనే మెడిసిన్‌ పూర్తిచేయనుంది. ఇక సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే డిసెంబర్‌ 8వ తేదీన అభిమానులందరూ కాలరు ఎగరేస్తారు’ అంటూ ధీమా వ్యక్తం చేశారు. 

నితిన్‌ - సిద్ధు సరదా మాటలు.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో దివి

‘రాజశేఖర్‌ ఇందులో నటించాలని బలంగా కోరుకున్నా. కథ విన్న వెంటనే అంగీకరించారు. అది నా అదృష్టం’ అని దర్శకుడు వక్కంతం వంశీ అన్నారు. ఇక శ్రీలీల మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు విడుదలైన ట్రైలర్‌, పాటలను ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నా పాత్రకు హద్దులు ఉండవు. కచ్చితంగా అందరూ ఎంజాయ్‌ చేస్తారు’ అని అన్నారు.

రాజశేఖర్‌ మాట్లాడుతూ..‘‘నితిన్‌ చాలా కష్టపడతాడు. ఈ సినిమాలో నాది చిన్న పాత్రే అయినా.. నవ్వులు పూయిస్తుంది. ‘జీవితమూ జీవిత ఒక్కటే’ అని నేను చెప్పిన డైలాగ్ ఇప్పటికే వైరల్‌గా మారింది. నేను నా భార్య ఏం చెబితే అది చేస్తానని అందరూ అనుకుంటారు. కానీ, అది నిజం కాదు.. నేను ఏది చెబితే జీవిత అది చేస్తుంది. చాలా మంచి వ్యక్తి’’ అని జీవితపై ప్రశంసలు కురిపించారు. ‘భార్యాభర్త ఎప్పుడూ ఒకరినొకరు అర్థంచేసుకోవాలి. అలా అయితేనే జీవితం అందంగా ఉంటుంది. నా కుటుంబమే నా ప్రపంచం. మంచి పాత్ర ఉంటే రాజశేఖర్‌ అతిథి పాత్రల్లో నటించడానికి సిద్ధంగా ఉంటారు’ అని జీవిత అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని