Rajinikanth: రజనీకాంత్‌ 170వ చిత్రం.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఫిక్స్‌.. ఎవరెవరంటే?

హీరో రజనీకాంత్‌, డైరెక్టర్‌ టి.జి. జ్ఞానవేల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘తలైవా 170’ (వర్కింగ్‌ టైటిల్‌)లో కీలక పాత్రలు పోషించనున్న హీరోయిన్ల వివరాలను చిత్ర బృందం ప్రకటించింది.

Published : 02 Oct 2023 18:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘జైలర్‌’ (Jailer)తో మంచి విజయాన్ని అందుకున్న కోలీవుడ్‌ అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌ (Rajinikanth) ఇప్పటికే తన కొత్త చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టి.జి. జ్ఞానవేల్‌ (TJ Gnanavel) దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘తలైవా 170’ (Thalaivar 170) అనేది వర్కింగ్‌ టైటిల్‌. ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్న హీరోయిన్ల వివరాలను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ తాజాగా ప్రకటించింది. ఆ కథానాయికలెవరో కాదు.. మంజూ వారియర్‌ (Manju Warrier), రితికా సింగ్‌ (Ritika Singh), దుషారా విజయన్‌ (Dushara Vijayan).

అతడి వల్ల నేను బలైయ్యాను.. హౌస్‌మేట్స్‌ గురించి రతిక చెప్పిన నిప్పులాంటి నిజాలు!

రజనీకాంత్‌కు ఇది 170వ సినిమాకావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. సినిమాలో బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి ఫాహద్‌ ఫాజిల్‌ను ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేయనున్నారనే టాక్‌ ఇటీవల వినిపించింది. మరో కీ రోల్‌ ప్లే చేసేందుకుగాను దర్శకుడు.. టాలీవుడ్‌ హీరో నానిని సంప్రదించారని కొన్ని రోజుల క్రితం రూమర్స్‌ వచ్చాయి. ఆ తర్వాత, ఇందులో నటించేందుకు నాని తిరస్కరించారని, ఆ స్థానంలో శర్వానంద్‌ని తీసుకునే అవకాశాలున్నాయని వార్తలొచ్చాయి. శర్వానంద్‌ కూడా నో చెప్పడంతో దగ్గుబాటి రానాకు ఆ ఛాన్స్‌ దక్కనుందనీ ప్రచారం జరిగింది. మరి, ఈ ముగ్గురిలో ఎవరు రజనీకాంత్‌తో కలిసి తెరను పంచుకుంటారో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే. తాను విలేకరిగా పనిచేస్తున్న సమయంలో చెన్నైలో జరిగిన ఓ బూటకపు ఎన్‌కౌంటర్‌ ఆధారంగా జ్ఞానవేల్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా చిత్రీకరణ ప్రారంభమైందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని