Radheshyam: అతిపెద్ద చిత్ర పరిశ్రమగా అవతరించనున్నాం

‘‘ప్రేమకు... విధికి మధ్య జరిగే యుద్ధం’’ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ‘రాధేశ్యామ్‌’ చిత్రబృందం. ఈ నెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన

Updated : 03 Mar 2022 09:08 IST

‘‘ప్రేమకు... విధికి మధ్య జరిగే యుద్ధం’’ ఎలా ఉంటుందో చూపిస్తామంటున్నారు ‘రాధేశ్యామ్‌’ చిత్రబృందం. ఈ నెల 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రమిది. కె.రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించారు. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. కృష్ణంరాజు, భాగ్యశ్రీ, జగపతిబాబు, సచిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. తెలుగు, మిగతా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ ఈ పాన్‌ ఇండియా చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘‘మనం ఆలోచన చేస్తున్నామని భ్రమపడతాం... మన ఆలోచనలు కూడా ముందే రాసుంటాయి’’ అంటూ ప్రభాస్‌ కంఠంతో గంభీరంగా మొదలైంది టీజర్‌. ‘‘చేయి చూసి ఫీచర్‌ని... వాయిస్‌ విని పాస్ట్‌ని చెప్పేస్తావా?’’ అంటూ ప్రభాస్‌ పాత్రని పరిచయం చేశారు. విజువల్స్‌, నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా ఉన్నాయి. ముంబయిలో జరిగిన ట్రైలర్‌ రిలీజ్‌ కార్యక్రమంలో ప్రభాస్‌, పూజా హెగ్డేలతో పాటు.. దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆస్ట్రాలజీ కార్నర్‌లో ఓ హస్త సాముద్రికుడితో జ్యోతిషం చెప్పించుకున్నారు ప్రభాస్‌, పూజా హెగ్డే. ఈ కార్యక్రమంలో ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘బాహుబలి’తో మొదలైన పాన్‌ ఇండియా చిత్రాల హవా ‘కేజీఎఫ్‌’, ఈ మధ్య వచ్చిన ‘పుష్ప’తో మరింత పెరిగింది. భవిష్యత్తులో 50కి పైగానే పాన్‌ ఇండియా చిత్రాలు రానున్నాయి. ఇది చాలా మంచి పరిణామం. భారతీయ చిత్రసీమ భవిష్యత్తులో ప్రపంచంలోనే అదిపెద్ద చిత్ర పరిశ్రమగా అవతరించనుంది’’ అన్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌ ఆదిత్య అనే హస్తరేఖ శాస్త్రం తెలిసిన వ్యక్తి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధ నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని