Chandramukhi 2: రజనీకాంత్‌ను కలిసిన లారెన్స్‌.. ఆనందంగా ఉందంటూ పోస్ట్‌

స్టార్‌ హీరో రజనీకాంత్‌ను రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence) కలిశారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

Published : 26 Sep 2023 11:38 IST

చెన్నై: కథానాయకుడు, దర్శకుడు రాఘవ లారెన్స్‌ నటించిన తాజా చిత్రం ‘చంద్రముఖి 2’ (Chandramukhi 2). సెప్టెంబర్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో స్టార్‌ హీరో రజనీకాంత్‌ (Rajinikanth) ఇంటికి వెళ్లిన లారెన్స్‌ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

‘నా గురువు, తలైవా రజనీకాంత్‌ను కలిశాను. ‘జైలర్‌’ సూపర్‌ హిట్‌ సాధించినందుకు అభినందనలు తెలిపాను. అలాగే ‘చంద్రముఖి-2’ విడుదల నేపథ్యంలో ఆయన ఆశీర్వాదం తీసుకున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి’ అని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ఫొటోలు చూసిని అభిమానులు ‘గురువుకు తగ్గ శిష్యుడంటూ కామెంట్స్‌ పెడుతున్నారు’. ఇక రజనీకాంత్‌ 2005లో నటించిన ‘చంద్రముఖి’ (Chandramukhi)కి సీక్వెల్‌గా ఈ సినిమా రానున్న సంగతి తెలిసిందే.

 ప్రభాస్‌ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!

‘చంద్రముఖి -2’లో రాఘవ లారెన్స్‌ (Lawrence), కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ట్రైలర్‌, సాంగ్స్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతమందించగా.. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించింది. మొదట ఈ సీక్వెల్‌ను సెప్టెంబర్‌ 15న విడుదల చేయాలని భావించారు. అయితే రిలీజ్‌కు సరిగ్గా వారం రోజుల ముందు 480 షాట్స్‌ ఫైల్స్‌ కనిపించపోవడంతో దర్శకనిర్మాతలు దీన్ని సెప్టెంబర్‌ 28కు వాయిదా వేశారు. ఇక ఈ చిత్ర ఫలితం ఆధారంగా ‘చంద్రముఖి-3’ కూడా తీసే అవకాశాలున్నట్లు చిత్రబృందం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని