Allu Arjun: వి.వి. వినాయక్‌ వల్లే ‘ఆర్య’ సాధ్యమైంది: అల్లు అర్జున్‌

వి.వి వినాయక్‌ ఇచ్చిన ధైర్యం వల్లే ‘ఆర్య’ తీశామని అల్లు అర్జున్ అన్నారు. 

Updated : 08 May 2024 14:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్: డైరెక్టర్‌ వి.వి వినాయక్‌ ఇచ్చిన ధైర్యం కారణంగానే ‘ఆర్య’ (Arya Movie) పట్టాలెక్కిందని అల్లు అర్జున్ అన్నారు. ఆ చిత్రం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని తెలిపారు. సుకుమార్‌ దర్శకత్వంలో బన్నీ హీరోగా తెరకెక్కిన ‘ఆర్య’ విడుదలై 20 ఏళ్లు పూర్తిచేసుకున్నా సందర్భంగా చిత్రబృందం ప్రత్యేక వేడుక నిర్వహించింది. అందులో అల్లు అర్జున్‌ (Allu Arjun) మాట్లాడుతూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.

‘నేను నటించిన ‘గంగోత్రి’ సూపర్‌ హిట్‌ అయింది. కానీ ఆ చిత్రంతో నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోలేకపోయాను. ఆ తర్వాత ఒక సంవత్సరం ఖాళీగా కూర్చున్నా. రోజుకు మూడు కథలు వినేవాడిని. ఆ టైమ్‌లో ‘దిల్‌’ సినిమా ప్రీమియర్‌ షోకు వెళ్తే అక్కడ సుకుమార్‌ నన్ను చూశారు. తర్వాత ‘ఆర్య’ కథ చెప్పారు. చాలా నచ్చింది. నాకు ఇది ‘ఇడియట్‌’ సినిమా అవుతుందని ఊహించాను. అందరం కొత్త వాళ్లం కావడంతో దీన్ని తెరకెక్కించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాం. సుకుమార్‌ (Director Sukumar) ఈ సినిమాను ఎలా రూపొందిస్తారో అని అందరూ సందేహపడ్డారు. ఆ సమయంలో వి.వి వినాయక్‌ (V.V. Vinayak) మాకు ధైర్యాన్నిచ్చారు. ‘నన్ను నమ్మండి. సుకుమార్‌ చాలా బాగా తీస్తాడు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే నేను వచ్చి డైరెక్షన్‌ చేస్తా’ అని హామీ ఇచ్చారు. ఆ ఒక్కమాట మాకు ఏనుగంత బలాన్నిచ్చింది. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలి. ఒకవారం షూటింగ్‌ చేశాక చూస్తే అద్భుతంగా అనిపించింది. సుకుమార్‌ దర్శకత్వం అందరికీ నచ్చింది. అలా ఈ చిత్రం పట్టాలెక్కింది. దేవీ శ్రీ ప్రసాద్‌ పాటలు ఊపేశాయి’ 

‘పుష్ప’ ఫేమస్‌ డైలాగ్‌ వెనుక హరీశ్‌ శంకర్‌

‘మొదట 10వారాలు ఆడుతుందన్నారు. 125 రోజుల షీల్డ్‌ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటా అని మా నాన్నతో కోపంగా చెప్పా. చెప్పినట్లు గానే చిరంజీవిగారి చేతుల మీదగా 125 రోజుల షీల్డ్‌ తీసుకున్నాను. నాకెంతో ఇష్టమైన ఆయన చేతులమీదగా షీల్డ్‌ తీసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేను. దిల్‌రాజు ధైర్యం చేసి డబ్బులు పెట్టారు. ఆ చిత్రానికి వర్క్‌ చేసినవాళ్లంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో ఉన్నారు. సుకుమార్‌ (Sukumar) లేకపోతే ఈ చిత్రం లేదు.  అందరికంటే ముఖ్యంగా ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పాలి’ అని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు