Krishna Vamsi: రమ్యకృష్ణపై సన్నివేశాలు తీస్తున్నప్పుడు కన్నీళ్లొచ్చాయి

‘‘70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్‌’ చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకి... మన సమాజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘రంగమార్తాండ’ (Ranga Marthanda) చేశాం.

Updated : 20 Mar 2023 07:00 IST

- దర్శకుడు కృష్ణవంశీ

‘‘70వ దశకంలోని నాటకాన్ని ఆధారంగా తీసుకుని మరాఠీలో ‘నటసామ్రాట్‌’ చేశారు. మేం అందులోని ఆత్మని తీసుకుని నేటి పరిస్థితులకి... మన సమాజానికి తగ్గట్టుగా మార్పులు చేసి ‘రంగమార్తాండ’ (rangamarthanda) చేశాం. కొన్ని సినిమాలకి అన్నీ కుదురుతాయి, కొన్నిసార్లు కుదరదు. ఈ సినిమాకి అనుకున్నవన్నీ పక్కాగా కుదిరాయి’’ అన్నారు కృష్ణవంశీ (Krishna Vamsi). ఆయన దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్‌, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘రంగమార్తాండ’. కాలీపు మధు నిర్మాత. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆదివారం హైదరాబాద్‌లో చిత్రబృందం విలేకర్ల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘కథ బాగుంటే ప్రేక్షకులు సినిమాని స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మాస్‌ సినిమాల జోరు కొనసాగుతున్న సమయంలో ‘శంకరాభరణం’ వచ్చింది. ఈమధ్య ‘మహానటి’ వచ్చింది. అందరం అన్ని చిత్రాలూ బాగుండాలనే, ప్రేక్షకుల మెప్పు పొందాలనే తీస్తాం. ‘రంగమార్తాండ’ చూసినవాళ్లంతా బాగుందని చెప్పారు. అందరూ బాగా కనెక్ట్‌ అయ్యారు. విడుదల తర్వాత కూడా ప్రేక్షకుల నుంచి అదే రకమైన స్పందన వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. మరాఠీలో ‘నటసామ్రాట్‌’ కథ ఎక్కువగా షేక్‌స్పియర్‌ నాటకాల చుట్టూ సాగుతుంది. మేం మన నాటకాలకి అన్వయిస్తూ స్క్రిప్ట్‌ని తీర్చిదిద్దాం. ప్రకాశ్‌రాజ్‌ ఆంగ్లం, సంస్కృతం, తెలుగు... ఏదైనా మాట్లాడతాడు. గొప్ప నటుడు తను. రాఘవరావు పాత్రలో ఒదిగిపోయాడు. బ్రహ్మానందం తన పాత్ర లుక్‌ కోసం ఏమీ తినకుండా, ఎన్ని టేక్‌లైనా ఓపికతో చేశారు. పెద్ద పెద్ద డైలాగ్స్‌ని ఆయన చెప్పారు. రమ్యకృష్ణ చేసిన పాత్ర కోసం మొదట వేరే నటుల్ని పరిశీలించాం. తను కూడా కొన్ని పేర్లు సూచించింది. ప్రతి సినిమాలోనూ పెద్ద పెద్దగా అరుస్తూ నటిస్తుంటావెందుకని  నేను, మా అబ్బాయి రమ్యకృష్ణని అడుగుతుంటాం. కానీ ఇందులో కళ్లతోనే భావాలు పలికించే పాత్ర తనది. తన కళ్లు చాలా బాగుంటాయి. ఓరోజు ఈ పాత్రని నువ్వే ఎందుకు చేయకూడదని అడిగా. తను ఒప్పుకోవడంతోపాటు, ఆ పాత్రకి మేకప్‌, హెయిర్‌స్టైల్‌ తనే చేసుకుంది. తనపై క్లైమాక్స్‌లో సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నప్పుడు కంట్లో నీళ్లొచ్చాయి. వాటిని దాదాపు 36 గంటలపాటు తీశా’’ అన్నారు. సినిమాలో కీలక పాత్ర పోషించిన రాహుల్‌ సిప్లిగంజ్‌ మాట్లాడుతూ ‘‘కృష్ణవంశీ సర్‌ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. అదే ప్రత్యేకం అనుకుంటే ఇందులో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం రావడం మరింత ఆనందాన్నిచ్చింది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని