Sankrathi: ప్రచార సిత్రాలు

జానర్‌ ఏదైనా.. బడ్జెట్‌ ఎంతైనా.. చిత్రానికి తగినంత ప్రచారం లభించినప్పుడే ఆ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది. ఈ విషయం ఫిల్మ్‌మేకర్లకు బాగా తెలుసు. అందుకే నాయికానాయకులు, ప్రధాన తారాగణంతో కూడిన ప్రచార చిత్రాలను తరచూ విడుదల చేస్తుంటారు.

Updated : 18 Jan 2024 00:50 IST

జానర్‌ ఏదైనా.. బడ్జెట్‌ ఎంతైనా.. చిత్రానికి తగినంత ప్రచారం లభించినప్పుడే ఆ సినిమా ప్రేక్షకులకు మరింత చేరువ అవుతుంది. ఈ విషయం ఫిల్మ్‌మేకర్లకు బాగా తెలుసు. అందుకే నాయికానాయకులు, ప్రధాన తారాగణంతో కూడిన ప్రచార చిత్రాలను తరచూ విడుదల చేస్తుంటారు. అలా అలరించేందుకు చిత్రబృందాలు విడుదల చేసిన పోస్టర్లు ఇవి.

‘రాజా సాబ్‌’ వచ్చాడు

ప్రభాస్‌ కథానాయకుడిగా... పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. రొమాంటిక్‌ హారర్‌ కథతో రూపొందుతున్న ఈ సినిమాకి ‘రాజా సాబ్‌’ అనే పేరుని ఖరారు చేశారు. సంక్రాంతి సందర్భంగా సోమవారం సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. అందులో లుంగీ కట్టి కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు ప్రభాస్‌. ‘‘సరదాగా, రొమాంటిక్‌గా సాగే పాత్రలో ప్రభాస్‌ని చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. నిర్మాణ సంస్థలో గుర్తుండిపోయే చిత్రంగా పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ రూపొందిస్తోంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని తెలుగుతోపాటు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామ’’ని సినీవర్గాలు తెలిపాయి. ఛాయాగ్రహణం: కార్తీక్‌పళని, సంగీతం: తమన్‌, పోరాటాలు: కింగ్‌ సోలోమన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌: ఆర్‌.సి.కమల్‌ కన్నన్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: రాజీవన్‌.


నలు దిక్కులా.. కంగువా

‘విధి కాలం కంటే బలమైనది.. గతం, వర్తమానం, భవిష్యత్‌...కాలం ఏదైనా నలుదిక్కులా మార్మోగే పేరు ఒక్కటే... కంగువా’ అంటూ సందడి చేశారు సూర్య. ఇదంతా ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘కంగువా’ చిత్రం కోసమే. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. దిశా పటానీ కథానాయిక. యోగిబాబు, బాబీ దేవోల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్‌ రాజా, వంశీ, ప్రమోద్‌ నిర్మాతలు. ఈ సినిమాలోని సెకండ్‌ లుక్‌ పోస్టర్‌ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేశారు. ట్రెండీగా, యుద్ధ వీరుడిగా రెండు కోణాల్లో కనిపించారు సూర్య. ‘‘పది భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రమిది’’అని సినీవర్గాలు తెలిపాయి. వేసవి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి కథ: శివ, ఆదినారాయణ, సంభాషణలు: మదన్‌ కార్కే, పోరాటాలు: సుప్రీమ్‌ సుందర్‌, ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి, కూర్పు: నిశాద్‌ యూసుఫ్‌.


భయపెట్టే.. ‘మహారాజా’

మంగళవారం విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి జన్మదినం. ఈ సందర్భంగా ‘మహారాజా’ చిత్ర దర్శకనిర్మాతలు విజయ్‌ సేతుపతి కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. అందులో మొహంపై పెద్ద గాయాలతో, చొక్కాకి రక్తపు మరకలతో కనిపిస్తున్నారు సేతుపతి. ఈ పోస్టర్‌ని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటూ ‘మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతికి జన్మదిన శుభాకాంక్షలు. భయపెట్టే, సత్తా ఉన్నా ‘మహారాజా’ రెండో పోస్టర్‌ ఇది’ అంటూ వ్యాఖ్యానించారు. విజయ్‌కి జోడీగా మమతమోహన్‌దాస్‌ నటిస్తున్న ఈ చిత్రానికి నితిలాన్‌ దర్శకుడు.


మార్చిలో ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ దాడి

ఛత్తీస్‌గఢ్‌లోని నక్సలైట్ల పోరాట నేపథ్య కథాంశంతో.. అదా శర్మ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’. సుదీప్తోసేన్‌ దర్శకుడు. విపుల్‌ అమృత్‌లాల్‌ షా నిర్మాత. తాజాగా చిత్ర పోస్టర్‌తోపాటు, విడుదల తేదీని ప్రకటించాయి సినీవర్గాలు. ఆలివ్‌గ్రీన్‌ దుస్తులు ధరించి, చేతిలో గన్‌ పట్టుకొని దళాన్ని ముందుండి నడిపిస్తున్నట్టుగా ఉన్న ఆ పోస్టర్‌ని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకుంటూ.. ‘‘ది కేరళ స్టోరీ’లాంటి దమ్మున్న చిత్రాన్ని తెరకెక్కించిన దర్శక నిర్మాతల నుంచి వస్తున్న సినిమా ‘బస్తర్‌: ది నక్సల్‌ స్టోరీ’ అంటూ వివరాలు పంచుకుంది అదా. ఈ చిత్రం మార్చి 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని