Bigg boss 7 telugu: షాకింగ్‌.. ఈసారి డబుల్‌ ఎలిమినేషన్‌.. శుభశ్రీ, గౌతమ్‌ ఔట్‌.. కానీ!

బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss 7 telugu)లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. నటి శుభశ్రీ రాయ్‌గురు, నటుడు గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌ అయ్యారు.

Published : 09 Oct 2023 01:51 IST

హైదరాబాద్‌: ‘ఉల్టా పుల్టా’ అంటూ మొదలైన బిగ్‌బాస్‌ సీజన్‌-7 (bigg boss 7 telugu)లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌ జరిగింది. సీజన్‌-7 నుంచి నటి శుభశ్రీ రాయ్‌గురు, నటుడు గౌతమ్‌ కృష్ణ ఎలిమినేట్‌ అయ్యారు. కానీ, గౌతమ్‌ కృష్ణను బిగ్‌బాస్‌ సీక్రెట్‌ రూమ్‌లో పెట్టడం గమనార్హం. ప్రేక్షకుల నుంచి అతి తక్కువ ఓట్లు వచ్చిన చివరి ముగ్గురు కంటెస్టెంట్‌లుగా శుభశ్రీ, గౌతమ్‌కృష్ణ, టేస్టీ తేజలు నిలిచారు. వీరిలో తొలుత శుభశ్రీ ఎలిమినేట్‌ అయింది. అతి తక్కువ ఓట్లు వచ్చిన ఐదో కంటెస్టెంట్‌గా ఆమె ఎలిమినేట్‌ అయినట్లు వ్యాఖ్యాత నాగార్జున ప్రకటించారు. ఈ వారం నామినేషన్స్‌లో టేస్టీ తేజ, శివాజీ, శుభశ్రీ, గౌతమ్‌ కృష్ణ, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక, అమర్‌దీప్‌లు ఉండగా, అందరినీ డార్క్‌ రూమ్‌లోకి పంపి ఎలిమినేట్‌ అయినవాళ్లు బయటకు వచ్చేస్తారని నాగార్జున తెలిపారు. దీంతో అతి తక్కువ ఓట్లు రావడంతో పాటు, హౌస్‌లో ఉండేందుకు అర్హతలేని చివరి ముగ్గురు కంటెస్టెంట్‌లలో శుభశ్రీ ఉండటంతో ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

ఈ సందర్భంగా బయటకు వచ్చిన శుభశ్రీ (Subhashree Rayaguru) అందరితోనూ నవ్వుతూ మాట్లాడింది. బిగ్‌బాస్‌ హౌస్‌ను తాను ఎంతో మిస్‌ అవుతున్నానని చెప్పింది. హౌస్‌మేట్స్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. ప్రియాంకతో కలిసి పాటలు పాడటం, స్విమ్మింగ్‌ చేయడం మంచి అనుభూతి అని చెప్పింది. తేజ చాలా జోక్‌లు చెప్పేవాడని, తనని ఎంతో నవ్వించేవాడని చెప్పుకొచ్చింది. శివాజీ నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపింది. బయటకు వచ్చాక తప్పకుండా కలుస్తానని చెప్పింది. గౌతమ్‌తో చాలా సంతోషకరమైన సందర్భాలు ఉన్నాయని, తనని ఎంతో ఫ్లర్ట్‌ చేసేవాడని చెప్పుకొచ్చింది. అతను ఉప్మా చేస్తే, తాను పోపు వేశానంది. అలాగే, ప్రశాంత్‌ను అన్నా అని పిలుస్తానని ముఖ్యంగా ‘లోటా బిస్కెట్‌’ మూమెంట్‌ మర్చిపోలేనంటూ ఆ రోజు జరిగిన సంఘటనను పంచుకుంది. ఇక సందీప్‌ మాస్టర్‌తో ఉదయం డ్యాన్స్‌ చేయడం ఎంతో ఆనందంగా ఉండేదని తెలిపింది. ఇక ఆయన పవర్‌ అస్త్ర తీసుకున్నప్పుడు బాధగా అనిపించిందని తెలిపింది. అమర్‌దీప్‌ విషయంలో మనోభావాల మూమెంట్‌ సందర్భంగా బాధపడ్డానన్న శుభశ్రీ.. యాలకులు తినేటప్పుడు చేసే స్టైల్‌ మర్చిపోలేనని నవ్వుతూ చెప్పింది. మొదటి నుంచి చివరివరకూ నవ్వుతూనే హౌస్‌మేట్స్‌తో మాట్లాడింది. ఇక టాస్క్‌లో భాగంగా ఇంటి సభ్యులు రాసిన ఉత్తరాన్ని శుభశ్రీ త్యాగం చేయగా, నాగార్జున తిరిగి దాన్ని ఆమెకు ఇచ్చారు.

ఇంటి సభ్యుల ఓట్లతో హౌస్‌ నుంచి బయటకు వచ్చిన గౌతమ్‌

ఊహించని విధంగా ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌లో గౌతమ్‌ కృష్ణ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారిలో శుభశ్రీ వెళ్లిపోగా, చివరకు టేస్టీ తేజ, గౌతమ్‌ కృష్ణ మిగిలారు. ఈ క్రమంలో హౌస్‌లో ఉన్న ఎనిమిది మందిలో ఆరుగురు టేస్టీ తేజను సపోర్ట్‌ చేస్తూ ఓటు వేశారు. దీంతో గౌతమ్‌ ఇంటి నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. బయటకు వచ్చాక గౌతమ్‌ మాట్లాడుతూ.. తన ఎలిమినేషన్‌ను అస్సలు ఊహించలేదని అన్నాడు. తాను టాస్క్‌లో బాగానే ఆడతానని చెబుతూనే తనకు వ్యతిరేకంగా ఓటు వేయడం చూస్తుంటే హౌస్‌మేట్స్‌ సేఫ్‌ గేమ్‌ ఆడాలనుకుంటున్నారని అర్థమైందన్నాడు. మరి హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు రియల్‌? ఎవరు ఫేక్‌ ఎవరో చెప్పమని అడగ్గా.. గౌతమ్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రతి ఒక్కరిలోనూ మరో కోణం ఉందని గౌతమ్‌ ఈ సందర్భంగా అన్నాడు.

  • హౌస్‌లో ఉన్న వాళ్లలో రియల్‌/ఫేక్‌ వీళ్లే..!
  • అమర్‌దీప్‌: సందీప్‌, ప్రియాంక, శోభ, అమర్‌ కలిసి ఆడతారు. వాళ్ల వాళ్లనే ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు.
  • సందీప్‌: సంచాలక్‌గా ఉన్నప్పుడు ఒకవైపు మాత్రమే స్టాండ్‌ తీసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో ఫేక్‌గా అనిపిస్తాడు.
  • శోభ: అందరితోనూ ఇరిటేట్‌ అయిపోతుంది. మాట్లాడాలంటే భయపడతారు ఇక్కడ అందరూ వ్యక్తిగతంగా ఆడతారు. నువ్వూ అలాగే ఆడాలి.
  • ప్రియాంక: చెల్లెమ్మా అని పిలుస్తా. అమర్‌, సందీప్‌, శోభలతో పోలిస్తే నువ్వు కాస్త అమాయకురాలివి. కానీ, ఆట విషయంలో నీ ఆట గురించే ఆలోచించు.
  • తేజ: ఫేక్‌ కాదు. ఉన్నవాళ్లలో నిజాయతీ కలిగిన వ్యక్తి. ఎంటర్‌టైన్‌ చేస్తూ ఉండు. టాస్క్‌లో బాగా ఆడు. ఏ గ్రూప్‌ దగ్గరకీ వెళ్లకు.
  • యావర్‌: శారీరకంగా చాలా స్ట్రాంగ్. నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు. గత వారం మంచి స్నేహితులు అయ్యాం. ఫేక్‌గా ఉండే సామర్థ్యం లేదు. గేమ్‌లో ఓడిపోతే వ్యక్తిగతంగా తీసుకోకు.
  • శివాజీ: ఫేక్‌ సైడ్‌ఉంది. ఆయనకు నచ్చిన వ్యక్తులకు ఓటు వేస్తారు.
  • ప్రశాంత్‌: ప్రశాంత్‌ సేఫ్ గేమ్‌ ఆడాడు. శివాజీ ఏది ఆడితే, అది ఆడతాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని