Published : 23 Oct 2021 08:28 IST

Akash Puri: మా నాన్నపై కామెంట్లు విని ఎంతో బాధపడ్డా: ఆకాశ్‌ పూరీ

తనయుడి మాటలకు పూరీజగన్నాథ్‌ ఎమోషనల్‌

హైదరాబాద్‌: ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా తన తండ్రి పూరీ జగన్నాథ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారని.. కెరీర్‌ ఆరంభంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారని నటుడు ఆకాశ్‌పూరీ అన్నారు. ఆకాశ్‌ కథానాయకుడిగా నటించిన ‘రొమాంటిక్‌’ చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వరంగల్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. పూరీ గురించి మాట్లాడుతూ ఆకాశ్‌ ఎమోషనల్‌ అయ్యారు. పూరీపై వచ్చిన కామెంట్లు చూసి తాను ఎంతో బాధకు లోనయ్యానని అన్నారు.

‘‘మా సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్‌కి థ్యాంక్యూ. విజయ్‌.. మీ వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ‘లైగర్‌’లో కొన్ని సీన్స్ చూశాను. మీరు అద్భుతంగా నటించారు. ఆ సినిమా సక్సెస్‌ మామూలుగా ఉండదు. ఇక, మా సినిమా ‘రొమాంటిక్‌’ విడుదల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. దర్శకుడు, మా బృందం అంతా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం.’’

‘‘మా నాన్న గురించి మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. నర్సీపట్నంలో పుట్టి, ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీ అనే మహా సముద్రంలోకి దూకి కష్టపడి పైకి వచ్చాడు మా నాన్న. కుటుంబం, బంధువులు, స్నేహితులందరి బాధ్యతలను భుజాలపై వేసుకుని ఆయన ప్రయాణం ప్రారంభించారు. అంతా బాగుంది అనుకునే సమయంలో ఓ వ్యక్తిని నమ్మడం వల్ల సాఫీగా సాగే ప్రయాణం అనుకోకుండా ఆగిపోయింది. అయినా సరే, మమ్మల్ని సురక్షితంగా చూసుకుంటూ ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ‘పూరీ కెరీర్‌ అయిపోయింది’, ‘రొటీన్‌ సినిమాలు చేస్తున్నాడు’.. ఇలాంటి కామెంట్లు చూసి బాధపడ్డాను. అలాంటి కామెంట్లు చేసిన వాళ్లందరికీ ఇప్పుడు ఒక్కటే చెబుతున్నా.. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో మళ్లీ మా నాన్న హిట్‌ కొట్టాడు. ఆ సినిమా సక్సెస్‌ చూసి నేను కాలర్‌ ఎగరేసుకున్నా. ‘నాన్నా.. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కానీ ఏదో ఒక రోజు నువ్వు గర్వపడేలా చేస్తా. ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి నటిస్తా. ఎన్ని సంవత్సరాలైనా సరే.. నేను కష్టపడి నువ్వు కాలర్‌ ఎగరేసుకునేలా చేస్తా’’ అని ఆకాశ్‌ పూరీ భావోద్వేగంతో మాట్లాడారు. తనయుడి మాటలు విన్న పూరీ పుత్రోత్సాహంతో ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. మరోవైపు, నిర్మాత బండ్ల గణేశ్‌ ఆకాశ్‌ మాటలు పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఆకాశ్‌ స్పీచ్‌ వీడియోని ట్విటర్‌లో షేర్‌ చేసిన బండ్ల.. ’‘గాడ్‌ బ్లెస్‌ యూ బంగారం. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావు’’ అని ట్వీట్‌ చేశారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని