Maruthi: అల్లు అర్జున్‌తో అలాంటి సినిమా చేయాలనుంది

5డీ కెమెరాతో వేడుకల్లో వీడియోలు షూట్‌ చేయడమే కాదు వెండితెరపై కథనీ చూపించొచ్చని నిరూపించారు. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించి భారీ వసూళ్లు రాబట్టారు. ప్రేమ కథల్ని ఎంత వైవిధ్యంగా ఆవిష్కరించారో కుటుంబ కథల్నీ అదే స్థాయిలో అందించి ‘భలే భలే దర్శకుడివోయ్‌’ అనిపించుకున్నారు. ఇప్పటికే మీకు అర్థమైఉంటుంది ఆయనెవరో! ఆయనే మారుతి.

Published : 02 Aug 2021 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 5డీ కెమెరాతో వేడుకల్లో వీడియోలు షూట్‌ చేయడమే కాదు వెండితెరపై కథనీ చూపించొచ్చని నిరూపించారు. తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించి భారీ వసూళ్లు రాబట్టారు. ప్రేమ కథల్ని ఎంత వైవిధ్యంగా ఆవిష్కరించారో కుటుంబ కథల్నీ అదే స్థాయిలో అందించి ‘భలే భలే దర్శకుడివోయ్‌’ అనిపించుకున్నారు. ఇప్పటికే మీకు అర్థమైఉంటుంది ఆయనెవరో! అవును.. ఆయనే మారుతి. తరుణ్‌ భాస్కర్‌ వ్యాఖ్యాతగా ‘ఈటీవీ ప్లస్‌’లో ప్రసారమయ్యే ‘నీకు మాత్రమే చెప్తా’ కార్యక్రమానికి విచ్చేశారాయన. తన మధుర జ్ఞాపకాల్ని ఈ వేదికగా నెమరువేసుకున్నారు. ఆ సంగతులివీ... 

* దర్శకుడు మారుతి గురించి అందరికీ తెలుసు. బందరులో పెరిగిన మారుతి గురించి చెప్పండి..

మారుతి: ఓపెన్‌ సీక్రెట్‌లా నా గురించి అందరికీ తెలుసు. అమ్మ మిషన్‌ కుట్టేది. నాన్న ఓ థియేటరు ముందు అరటి పండ్లు అమ్మేవారు. ఆ చోటే నాకు సినిమాని పరిచయం చేసింది. నాన్న భోజనానికి వెళ్లినపుడు నేను వ్యాపారం చూసుకునేవాణ్ని. ఆ సమయంలో థియేటర్‌ గోడలపై ఉన్న పోస్టర్లని చూసి బొమ్మలు గీయడం అలవాటుగా మారింది. అలా తెలియకుండానే నాలో సినిమాపై ఆసక్తి పెరిగింది. అక్కడున్న వాచ్‌మెన్‌కి అరటి పండ్లు ఇచ్చి ఇంటర్వెల్‌ తర్వాత నుంచి సినిమాలు చూసేవాణ్ని. పదోతరగతి తర్వాత మావయ్య ఆఫీసులో పనిచేశాను. అక్కడ వాహనాల నంబరు ప్లేట్లకి స్టిక్కరింగ్‌ చేస్తుండేవాణ్ని. అప్పట్లో ‘స్టిక్కరింగ్‌ మారుతి’ అంటే చాలా ఫేమస్‌. ఇప్పుడు దర్శకుడు మారుతి ఎలాగో అప్పుడు స్టిక్కరింగ్‌ మారుతి అలా. ఏ పనైనా చూసి నేర్చుకున్నాను తప్ప ఎవరి దగ్గరా అసిస్టెంట్‌గా చేయలేదు. కెమెరా దొరికింది, నాకు తెలిసిన సినిమా తీసేశాను అంతే. అది మంచా చెడా అని  ఆలోచించలేదు. 

* కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండేది?

మారుతి: ఏ విషయమైనా అమ్మతోనే చెప్పుకునేవాళ్లం. అమ్మతోనే చనువు ఎక్కువగా ఉండేది. తను చాలా ప్రోత్సాహం అందించేది. అమ్మానాన్న ఎంతోకష్టపడి మమ్మల్ని పెంచారు.

* మీ నాన్న గారు అరటి పండ్లు అమ్ముతారు.. అదీ ఇదీ అని ఎప్పుడైనా మాటలు పడ్డారా?

మారుతి: అప్పుడప్పుడు ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. కొంతమంది బంధువులూ వీళ్ల స్థాయి ఇంతే అన్నట్టుగా చూసేవాళ్లు. ఆ పరిస్థితికి తగ్గట్టే స్పందించేవాణ్ని కానీ ‘భవిష్యత్తులో అలా అవుతాం, ఇలా అవుతాం’ అని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరింటికి కార్యక్రమానికి వెళ్లినా అక్కడ పనులు చేసేవాణ్ని. పండగలకి దేవాలయాల్ని అలంకరించేవాణ్ని. నాకు అలా ఉండటమే ఇష్టం.

* 5డీ కెమెరాతో సినిమా తీయాలనే రిస్క్‌ ఎందుకు తీసుకున్నారు?

మారుతి: ‘బస్‌స్టాప్‌’ సినిమాని కొత్త హీరోతో చేద్దామనుకున్నా. ఈ సినిమాని ఇద్దరం కలిసి నిర్మించాల్సి వచ్చింది. దాన్ని రీల్స్‌ ఉండే కెమెరాలతోనే మొదలుపెట్టాం. చిత్రీకరణ ప్రారంభమయ్యాక కొన్ని రోజులకి మా దగ్గర డబ్బుల్లేవు. సినిమా అంటే ఇలా కాదు ముందు కథని సిద్ధం చేసుకుని మంచి నిర్మాతతో చేయాలని నాకు అప్పుడు అర్థమైంది. సినిమాని ఆపేశా. ఆ తర్వాత ఓ స్నేహితుడి ద్వారా రామ్‌ గోపాల్‌ వర్మ 5డీ కెమెరాతో తీసిన ‘దొంగల ముఠా’ గురించి తెలుసుకున్నా. మనమెందుకు తీయకూడదనిపించింది.

* ‘ఈ రోజుల్లో’.. సిటీ జీవితానికి సంబంధించిన ప్రేమికుల కథ. ఆ ఆలోచన ఎలా వచ్చింది?

మారుతి: ‘ఈ రోజుల్లో’, ‘బస్టాప్‌’ కథలు నిజ జీవితంలో చూసినవే. ‘అరే ఇలా కూడా జరుగుతుందా’ అనే ఆశ్చర్యంతో వీటినే సినిమాగా తీస్తే బాగుంటుందని తెరకెక్కించా. నేను ట్రెండ్‌కి తగ్గట్టు వెళ్తుంటా. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలోనూ అంతే. ప్రస్తుత సమాజంలో జరిగేది ఏదో ఒకటి చూపించేందుకు ప్రయత్నిస్తుంటా.

* ‘ప్రేమ కథా చిత్రమ్‌’ విషయంలో చిత్ర బృందంలో కొందరు బాగోలేదు అని చెప్పారట. ఆ సంగతేంటి?

మారుతి: అవును. ‘బిలో యావరేజ్‌ సినిమా ఇది. నీ పేరు వేసుకోకపోవడం బెటర్‌, ఇలాంటి నేపథ్యంలో సాగే చిత్రాలు పెద్దగా ఆడవు’ అని నాకు కావాల్సిన వాళ్లే చెప్పారు. దాన్ని నేనూ నమ్మాను. అందుకే ఓ సన్నివేశం జతచేసి టైటిల్‌ కార్డులో మా కెమెరామెన్‌ పేరు పెట్టాం.

* మీ తొలి సంపాదన ఎంత?

మారుతి: నంబరు ప్లేట్ల స్టిక్కరింగ్‌ చేసేటపుడు తొలిసారిగా రూ.35 తీసుకున్నా. ఆ క్షణం చాలా ఆనందపడ్డాను.

* స్టిక్కరింగ్‌ తర్వాత ఏం చేశారు?

మారుతి: ఆ పని చేశాక కొన్నాళ్లకు హైదరాబాద్‌ వచ్చాను. ఇక్కడికొచ్చాకే తెలిసింది ఆర్ట్‌ అంటే ఏంటో. దానికి సంబంధించిన కోర్సులు ఉంటాయని తెలుసుకున్నా. ఇక్కడవారిని చూశాక ‘మనం చాలా కష్టపడాలి’ అని అనుకుని ప్రతిరోజూ లక్డీకపూల్‌ వెళ్లి లైవ్‌ స్కెచింగ్‌ చేసేవాణ్ని. అలా ‘ఒక ఊరిలో’, ‘అంజి’ తదితర చిత్రాలకు స్టోరీ బోర్డింగ్‌ వేసే అవకాశం వచ్చింది. ఇంతవరకు గ్రాఫిక్స్‌ ప్రధానంగా నా సినిమాలు రాలేదు. నా విజువల్‌ ఎఫెక్ట్స్‌ మరో స్థాయిలో ఉంటుంది.

* విజువల్‌ ఎఫెక్ట్‌ అంటున్నారు. ఏమైనా సినిమా ఆలోచన ఉందా?

మారుతి: అల్లు అర్జున్‌తో అల్లాద్దీన్‌లాంటి సినిమా తీయాలని ఉంది. ఎందుకంటే బన్నీకి యానిమేషన్‌ అంటే చాలా ఇష్టం. తనూ బ్రహ్మాండంగా బొమ్మలు గీస్తాడు.

* మీ జీవితంలో బాధపడిన సంఘటనలు?

మారుతి: కెరీర్‌ ప్రారంభంలో దర్శకత్వ విభాగంలో చేరతాను సర్‌ అని ఓ పెద్ద నిర్మాతని కలిశాను. ‘అవన్నీ ఇలా అడక్కూడదు ఔట్‌’ అంటూ ముఖంమీదే తలుపేసేశాడు. అప్పుడు బాగా కోపం వచ్చింది, బాధ కలిగింది. నేను ‘కొత్తజంట’ చిత్రం తెరకెక్కిస్తున్నప్పుడు ఆయనే వచ్చి ‘నాకు ఓ సినిమా చేసిపెట్టాలి’ అని అడిగినప్పుడు ఆ కోపమంతా పోయింది. మరో సందర్భం ఏంటంటే.. ‘బస్టాప్‌’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆ సమయంలో కొంతమంది తక్కువ రేటింగ్‌ ఇచ్చి నన్ను పైకి రాకుండా నొక్కాలని చూశారు. నాకో స్టాంప్‌ వేస్తే మళ్లీ లేవడు అనుకున్నారు. బూతు డైరెక్టర్‌ అని ముద్ర వేశారు. ఆ బాధంతా దిగమింగుకుని వాళ్లే పొగుడుతారు, వాళ్లే విమర్శిస్తారని నా ధ్యాసని పని మీదే పెట్టాను.

* ఈ కార్యక్రమానికి తన సోదరి, అమ్మ, పిల్లలు విచ్చేసి మారుతిని సర్‌ప్రైజ్‌ చేశారు. వీళ్లంతా మారుతిపై తమకున్న ప్రేమని వ్యక్తం చేశారు. ఈ సందడితోపాటు అల్లు అర్జున్‌, చిరంజీవి గురించి మారుతి ఏమన్నారో ఆయన మాటల్లోనే వింటేనే బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ కింది వీడియోలో చూసేయండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని