Published : 29/11/2021 01:20 IST

Bigg Boss telugu 5: యాంకర్‌ రవి ఎలిమినేట్‌.. కాజల్‌ను సన్నీ సేవ్‌ చేయడానికి కారణమదే!

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg Boss telugu 5) చివరికి వచ్చేసరికి మరింత రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది సభ్యులు ఉండగా, 12వ వారానికి సంబంధించి ఎవరూ ఊహించని రీతిలో ఎలిమినేషన్‌ జరిగింది. యాంకర్‌ రవి(Ravi) ఈవారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్‌ అయిన వాళ్లలో చివరకు కాజల్‌(kajal), రవి(Ravi)లు మిగిలారు. ఈ ఇద్దరిలో ఒకరిని కాపాడే అవకాశం ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉన్న సన్నీ(sunny)కి రావడంతో అతడు కాజల్‌ను సేవ్‌ చేశాడు. మరోవైపు కాజల్‌తో పోలిస్తే రవికే తక్కువ ఓట్లు వచ్చాయని అందుకే హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అవుతున్నట్లు వ్యాఖ్యాత నాగార్జున(Nagarjuna) ప్రకటించారు.

అప్పుడలా.. ఇప్పుడిలా..

సీజన్‌-4లోనూ హౌస్‌మేట్స్‌ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ పొందే అవకాశం ఇచ్చాడు బిగ్‌బాస్‌(Bigg boss). అప్పుడు కమెడియన్‌ అవినాష్‌ పాస్‌ గెలుచుకుని తనకోసం వాడుకున్నాడు. 84 రోజున జరిగిన ఎలిమినేషన్‌ ప్రక్రియలో చివరకు అవినాష్‌(Avinash), అరియానా(ariyana) మిగిలారు. తాను హౌస్‌లో ఇంకొన్ని రోజులు ఉండాలనుకుంటున్నానని చెబుతూ అవినాష్‌ ఆ పాస్‌ ఉపయోగించుకున్నాడు. జనం ఓట్ల ప్రకారం అవినాష్‌ చివరి స్థానంలో ఉండటంతో అప్పుడు ఆ పాస్‌ సద్వినియోగమైంది. ఇప్పుడు ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను కాజల్‌ కోసం సన్నీ వాడాడు. ఒకరకంగా సన్నీకి ఈ పాస్‌ రావడానికి కారణం కాజలే. ‘ఫైరింజన్‌’ టాస్క్‌లో చివరిసారి బండి ఎక్కిన కాజల్‌.. మానస్‌తో గొడవపడి అనీ మాస్టర్‌, సిరి ఫొటోలు కాలిపోయేలా చేసింది. దీంతో ఆ టాస్క్‌లో చివరకు మిగిలిన సన్నీకి ఎవిక్షన్‌ ఫ్రీపాస్‌ దొరికింది. తన స్నేహితుడి కోసం అలా చేశానని నామినేషన్స్‌ సందర్భంగా కాజల్‌ గట్టిగానే చెప్పింది. ఇప్పుడు అదే స్నేహితురాలి కోసం సన్నీ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉపయోగించాడు. అయితే, ఈ వారం కాజల్‌ సేఫ్ అయిందని, రవికి తక్కువ ఓట్లు వచ్చాయని, ఆ పాస్‌ రవికి ఇచ్చి ఉంటే సేవ్‌ అయ్యేవాడని నాగార్జున చెప్పడం గమనార్హం.

హౌస్‌లో రవి జర్నీ సాగిందిలా...!

బిగ్‌బాస్‌ సీజన్‌-5(Bigg boss telugu 5)లో భాగంగా హౌస్‌లోకి వచ్చిన 19మంది పోటీదారుల్లో రవి(Ravi) బలమైన కంటెస్టెంట్‌.  బుల్లితెర యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి షోలోనూ తనదైన శైలిలో నవ్వించే ప్రయత్నం చేసేవారు. అంతేకాదు, అడపాదడపా కొన్ని సినిమాల్లో కథానాయకుడి స్నేహితుడిగా కనిపించి అలరించారు. ఈ సీజన్‌లో ఫైనల్‌ వరకూ ఉంటారని అనుకున్న ఐదుగురు కంటెస్టెంట్‌లలో రవి పేరు బాగా వినిపించింది. అయితే, పరిస్థితులు తారుమారు కావడంతో 12వ వారమే ఇంటి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది!

ఇన్‌ఫ్లూయెన్సర్‌.. ప్రియతో వివాదం..

అందరికంటే హౌస్‌లో చివరిగా అడుగు పెట్టిన వ్యక్తి రవి(Ravi). తెలిసిన ముఖం కావడంతో ఇంటి సభ్యులతో త్వరగానే కనెక్ట్‌ అయ్యారు. అయితే, తన మాటలతో ఇతరులను ప్రభావితం చేస్తాడని రెండో వారం నుంచే ఇంటి సభ్యులు అనుకోవడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో నటరాజ్‌ మాస్టర్‌ రవికి ‘గుంటనక్క’ అని పేరు పెట్టారు. అక్కడి మాటలు ఇక్కడ.. ఇక్కడి మాటలు అక్కడ మార్చి చెబుతాడని హౌస్‌మేట్స్‌ భావించేవారు. నామినేషన్స్‌ సందర్భంగా ప్రియ(Priya) రేపిన వివాదంతో హౌస్‌ ఒక్కసారిగా వేడెక్కిపోయింది. ‘వాష్‌ ఏరియాలో లహరి(lahari)ని రవి హగ్‌ చేసుకున్నాడు’ అని ప్రియ అనడంతో దుమారం రేగింది. ఈ వివాదంలో లహరి గురించి రవి అన్న మాటలను నాగార్జున వీడియో వేసి మరీ చూపించారు. ఆ తర్వాత టాస్క్‌ల సమయంలోనూ నోరు జారి, ఆ తర్వాత ‘నేను అనలేదు’ అనడంతో చాలాసార్లు దొరికిపోయాడు. ఇదే విషయాన్ని హౌస్‌లోకి వచ్చిన రవి భార్య కూడా చెప్పారు. ఏదైనా మాట అన్న తర్వాత గుర్తులేకపోతే తప్పు ఒప్పుకోమని సలహా ఇచ్చారు.

టాస్క్‌లో 100శాతం కృషి.. అలా కెప్టెన్‌

తన గురించి ఎవరు ఏమన్నా.. ఎలా మాట్లాడినా అన్నింటినీ సమానంగా తీసుకునేవాడు రవి. టాస్క్‌లు గెలిచేందుకు 100శాతం కృషి చేసేవాడు. అటు ఫిజికల్‌ టాస్క్‌లతో పాటు, తన మైండ్‌ గేమ్‌తో కొన్నిసార్లు టాస్క్‌లను మలుపుతిప్పాడు. వెన్ను నొప్పి బాధపెడుతున్నా, భరిస్తూ  ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’ టాస్క్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు. అయితే కెప్టెన్‌ అవడానికి మాత్రం 11 వారాలు పట్టింది. ‘బీబీ హోటల్‌ టాస్క్‌’లో సిబ్బందిగా మెప్పించి చివరకు కెప్టెన్‌ అయ్యాడు. అంతకుముందు 10వారాల పాటు వరుసగా నామినేషన్‌లో ఉండటం గమనార్హం. అయినా కూడా రవి చివరి వరకూ హౌస్‌లో కొనసాగుతాడని టాప్‌-5లో తప్పకుండా ఉంటాడని ఎంతో ప్రేక్షకులు ఊహించారు. కానీ, అనూహ్య రీతిలో రవి ఈ వారం ఎలిమినేట్‌ అయ్యాడు.

బిగ్‌బాస్‌ నుంచి చాలా నేర్చుకున్నానని యాంకర్‌ రవి అన్నారు. ఎలిమినేట్‌ అయి వేదికపైకి వచ్చిన రవి హౌస్‌లో తన జర్నీ చూసుకుని భావోద్వేగానికి గురయ్యాడు. ఇన్నాళ్ల జర్నీలో హౌస్‌లో ఉన్న వాళ్లలో ఎవరు పాస్‌? ఎవరు ఫెయిల్‌? అని నాగార్జున అడిగారు. తొలుత షణ్ముఖ్ పాస్‌ అయినట్లు చెప్పాడు. హౌస్‌లో తొలి నుంచి కనెక్ట్‌ అయిన వ్యక్తి షణ్ను అని అనగా, ‘రవి ఎప్పటికీ నా బ్రదర్‌’ అంటూ షణ్ముఖ్ సమాధానం ఇచ్చాడు. ఇక శ్రీరామ చంద్ర హౌస్‌లో చాలా పాజిటివ్‌గా ఉంటాడని, ఎప్పటికీ మర్చిపోలేని స్నేహితుడని రవి చెప్పుకొచ్చారు. రవి ఎలిమినేట్‌ అయ్యాడంటే తనకు మాటలు రావటం లేదని, తన కోసం, నిత్య, వియాకోసం ఆడతానని చెబుతూ శ్రీరామచంద్ర బాధపడ్డాడు. హౌస్‌లో సన్నీ తోపు అంటూ రవి కితాబిచ్చి అతడిని పాస్‌ చేశాడు. స్నేహితుడి కోసం ఎంతదూరమైనా వెళ్తాడని అన్నాడు. జీవితంలో కూడా అలాగే ఉండాలని ఆకాంక్షించాడు. ఇక ప్రియాంక, సిరి, మానస్‌, కాజల్‌లు ఫెయిల్‌ అయ్యారని రవి చెప్పుకొచ్చాడు.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని