aa okkati adakku: పెళ్లి సమస్యని వినోదాత్మకంగా చూపించాం

‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్‌ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్‌ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’.

Updated : 26 Apr 2024 11:52 IST

‘‘వినోదం, ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు.. ఇలా అన్నీ ఉన్న చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. తప్పకుండా ఇది అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఉంటుంద’’న్నారు నిర్మాత రాజీవ్‌ చిలక. ఆయన నిర్మాణంలో అల్లరి నరేశ్‌ హీరోగా మల్లి అంకం తెరకెక్కించిన చిత్రమే ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. ఇది మే 3న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా రాజీవ్‌ గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు.

  • ‘‘సినిమాలు నిర్మించాలనే దీర్ఘకాలిక ప్రణాళికతోనే నేనీ చిత్రసీమలోకి వచ్చాను. మా యానిమేషన్‌ సంస్థలో రూపొందించిన ‘ఛోటా భీమ్‌’ పెద్ద హిట్టయ్యాక మరో ఆరు యానిమేషన్‌ సినిమాలు చేశాం. అలా మా కంపెనీ పూర్తిగా స్థిరపడ్డాక నిర్మాతగా సినిమాల్లోకి రావాలనుకున్నా. కాకపోతే దీనికి కాస్త ఎక్కువ సమయమే పట్టింది. ఇక రెండేళ్ల క్రితం నిర్మాతగా తొలి అడుగు వేయాలనుకున్నప్పుడు మల్లి అంకం ఈ కథ చెప్పారు. పెళ్లి చుట్టూ తను అల్లుకున్న కథ నాకు బాగా నచ్చింది. వినోదం, భావోద్వేగాలతో పాటు అన్నిరకాల వాణిజ్య అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్నే మా తొలి చిత్రంగా పట్టాలెక్కించాం’’.
  • ‘‘నాకు ఈ కథ విన్నప్పుడే ఇది అల్లరి నరేశ్‌కు సరిగ్గా సరిపోతుందనిపించింది. మేము ఈ స్క్రిప్ట్‌ వినిపించే సమయానికి ఆయన మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్నా.. తన కోసం వేచి చూసి ఈ చిత్రం చేశాం. దీనికి ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ అనే టైటిల్‌ను సూచించింది అల్లరి నరేశే. సినిమాలో ఆయన్ని పెళ్లి ఎప్పుడని అడిగినప్పుడల్లా తను చిరాకుతో చెప్పే డైలాగ్‌ ఇది. నరేశ్‌ నాన్నగారి క్లాసిక్‌ సినిమా టైటిల్‌ను దీనికి పెట్టడం వల్ల మాపై బాధ్యత మరింత పెరిగింది. అందుకే సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చిందని నమ్మకం కలిగాకే ఆ పేరును ఈ చిత్రానికి ఖరారు చేశాం’’.
  • ‘‘ఈరోజుల్లో జీవితంలో స్థిరపడటం కంటే పెళ్లి అవ్వడమనేది పెద్ద సమస్యగా మారింది. ఈ చిత్రంలో హీరోది కూడా అదే సమస్య. సబ్‌ రిజిస్ట్రార్‌గా తన చేతులపై ఎన్నో పెళ్లిళ్లు జరిపించిన అతనికి 35ఏళ్లు వచ్చినా పెళ్లి కాదు. మరి తన వివాహం కోసం ఆ హీరో చేసిన ప్రయత్నాలేంటి? ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అన్నది వినోదాత్మకంగా చూపించాం. ఇది ఈతరం యువతకు బాగా కనెక్ట్‌ అయ్యే కథ. దీంట్లో కొన్ని ఆసక్తికరమైన ట్విస్ట్‌లు ఉన్నాయి. స్క్రీన్‌ప్లే ప్రేక్షకుల్ని ఆద్యంతం కట్టి పడేస్తుంది’’.
  • ‘‘ప్రస్తుతం మేము ‘ఛోటా భీమ్‌’ను పిల్లలతో రియల్‌ యానిమేషన్‌ పద్ధతిలో చేస్తున్నాం. డిస్నీలో ఒక యానిమేషన్‌ షో ప్రారంభించనున్నాం. అలాగే ప్రభాస్‌ ‘కల్కి 2898ఎ.డి’ చిత్ర ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ యానిమేషన్‌ కాన్సెప్ట్‌ను సిద్ధం చేస్తున్నాం’’.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు